సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

26, మార్చి 2009, గురువారం

బేతాళ కథల కమామీషు







‘పట్టు వదలని విక్రమార్కుడు....’ అంటూ 54 ఏళ్ళుగా తెలుగు ప్రజలను ఆనందపరుస్తున్న బేతాళకథలు ‘చందమామ’లో ప్రత్యేక ఆకర్షణ. కొన్నిసార్లు ‘విసుగు చెందని విక్రమార్కుడు...’ అంటూ ఆరంభమయ్యేది కానీ కథ ఎత్తుగడ మారేది కాదు.

ఈ కథలకు మొదట బొమ్మ వేసింది  చిత్రా.
ఆ శ్మశానం, విక్రమార్కుడి భంగిమ, భీతిగొలిపే వాతావరణం ... ఆ క్రెడిట్ ఆయనదే. 

కొన్ని నెలల తర్వాత ఆ బొమ్మను మెరుగుపరిచింది శంకర్. తర్వాత ఆయనే బేతాళ కథలకు పేటెంట్ చిత్రకారుడై ఇప్పటివరకూ వేస్తూ వస్తున్నారు.

(మధ్యలో రాజీ,  శక్తిదాస్లు  కూడా కొన్ని బొమ్మలు వేశారు).

చివరిపేజీలో విక్రమార్కుడి భుజమ్మీద నుంచి (శవంలోంచి) మాయమై, చెట్టుమీదకు దూసుకుపోయే బేతాళుడి బొమ్మలు శంకర్ ఎన్ని వందలు వేశారో.... ఆ వైవిధ్యం అబ్బురమన్పిస్తుంది.

బేతాళ కథల బొమ్మ డిజైన్ ను  ‘ఆధునికం’గా మార్చటం నచ్చనివాళ్ళలో నేను మొదటివరసలో ఉంటాను. 

చందమామ పున: ప్రారంభమయ్యాక అర్థచంద్రాకార డిజైన్ వచ్చింది. వణికే రాతలో ఉండే ‘బేతాళ కథ’ అక్షరాలను ప్రింటులోకి మార్చారు.   చిత్రకారుడు ఉత్తమ్ ద్వారా  ఈ పని జరిగింది.

ఇవేమీ నాకు నచ్చలేదు. మీలో ఎంతమంది నాతో ఏకీభవిస్తారో గానీ.

పాత చందమామల్లో శీర్షికలు చక్కగా ఆర్టిస్టు రాసేవారు. ..ఒక్కొక్కటీ ఒక్కో తీరులో . ఇప్పుడు అన్నీ ఒకే ఫాంటులో ప్రింటు టైపులో వస్తున్నాయి.

బేతాళ కథలపై ఓ బ్లాగు కూడా తెలుగులో మొదలయింది.

చందమామ ఆగిపోతోందని రాస్తూ ఓ దినపత్రిక పెట్టిన శీర్షిక  ‘పట్టు వదిలిన విక్రమార్కుడు’.  అంటే చందమామకు బేతాళ కథలు పర్యాయపదంగా మారాయన్నమాట. ఇవన్నీ ఈ కథల ప్రాచుర్యాన్ని చెబుతున్నాయి.

మొదటి బేతాళ కథ చదివారా? అది 1955సెప్టెంబర్ సంచికలో వచ్చింది. 1972జులైలో పునర్ముద్రించారు.

బేతాళ కథల బొమ్మలు  ఎలా పరిణామం  చెందుతూ వచ్చాయో   ... పైన చూడండి.

మొదటి రెండూ చిత్రా వేసినవి.
మూడోది  శంకర్ చిత్రణ.  ఇదే  దశాబ్దాలుగా కొనసాగింది.
నాలుగో బొమ్మ వేసినవారు  వడ్డాది పాపయ్య. (వ.పా.)  ఇది   1972 జులైలో  చందమామ స్వర్ణోత్సవ సందర్భంగా .. మొదటి బేతాళకథను  పున: ప్రచురించినపుడు వేసిన బొమ్మ.
 ఇక చివరిదైన  ఐదోది-   ఉత్తమ్  ‘మెరుగులు’ దిద్దిన  చిత్రం!

3 కామెంట్‌లు:

జీడిపప్పు చెప్పారు...

Check this blog http://chandamaamalu.blogspot.com/

అజ్ఞాత చెప్పారు...

ఈ భేతాళ కథల్లో కొన్ని ఒరిజినల్ వి కూడా ఉన్నాయి. ఆ తర్వాత బాలజ్యోతిలో, రచయిత రెంటాల గోపాల కృష్ణ గారు అనుకుంటాను. పూర్తిగా సాలభంజికలు చెప్పిన ౩౨ కథలను సీరియల్ గా ప్రచురించారు.

వేణు చెప్పారు...

జీడిపప్పు గారూ, మీరు పేర్కొన్న బ్లాగు లింకు బాగుంది. చందమామ అభిమానులకు ఆనందం కల్గిస్తుంది.

రవి గారూ, ఒరిజినల్ బేతాళ కథలు కొన్నే. చివరి కథలో బేతాళుడి ప్రశ్నకు విక్రమార్కుడికి సమాధానం తెలియక, మౌనభంగం కాదు. అప్పుడు బేతాళుడు కపట సన్యాసి విషయం చెపుతాడు. ఆ కథ వివరాలు ఎక్కడ దొరుకుతాయి? మీకు గానీ, ఇతర మిత్రులకు గానీ తెలిస్తే చెప్పండి.

చందమామలో ఆ చివరి కథ ఎప్పటికీ రాదు. ఎందుకంటే అది వస్తే బేతాళకథల ధారావాహిక ముగిసిపోతుంది కదా.