సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

27, ఏప్రిల్ 2009, సోమవారం

ఈ పుస్తకం నాకు ఉపయోగపడింది!

రచయిత్రి  రంగనాయకమ్మ



నసులో భావాలను అక్షరాల్లోకీ, అందమైన వాక్యాల్లోకీ మార్చి చూసుకుంటే ఎంత బావుంటుందో! బ్లాగర్లకు ఇది నిత్యం అనుభవమే. స్వేచ్ఛగా, హాయిగా, పదునుగా రాయటం గొప్ప నేర్పు.

కవిత్వమే కాదు, వచనం కూడా ఆల్కెమీయే... రసవాదమే.

ఆ రహస్యం శ్రీశ్రీకీ, కొ.కు.కీ తెలుసు.
చలం గారికి తెలుసు,
రంగనాయకమ్మ గారికి తెలుసు. 
ముళ్ళపూడి వెంకట రమణ గారు ... 
ఇంకా చాలామంది ఈ జాబితాలోకి వస్తారనుకోండీ.

ఇక్కడ ప్రస్తుతం నేను చెప్పదల్చుకున్నది- అందంగా రాయటం గురించి కాదు, తప్పుల్లేకుండా సక్రమంగా వాక్యాలు రాయటం గురించి.


రోజూ అక్షరాలతో సహవాసం చేసే పాత్రికేయులే అసూయ పడేలా ‘ఈజ్’తో రాసేవారు కొందరు మన తెలుగు బ్లాగావరణంలో కనిపిస్తారు. అలాగే భాష విషయంలో తప్పటడుగులు వేసేవారు కూడా ఉన్నారనుకోండీ.
చిన్నప్పటినుంచీ కథలూ, నవలలూ ఇష్టంతో చదివేవారూ; లేఖలూ, డైరీలూ అలవాటున్నవారూ తెలుగును కొంత బాగా రాయగలుగుతారు.

ఇలాంటి నేపథ్యం ఉన్న నాకు కూడా ఎంతో ఉపయోగపడిన పుస్తకం - ‘వాడుక భాషే రాస్తున్నామా?’.

పత్రికా రంగంలో తొలి అడుగులు వేస్తున్నపుడు నా కోసమే రంగనాయకమ్మ గారు రాశారా అన్నట్టు ఈ రచన ఆంధ్రజ్యోతి వీక్లీలో సీరియల్ గా ప్రారంభమైంది.

శ్రద్ధగా వారం వారం చదివేవాణ్ని.

భాషకు సంబంధించి నాలో స్పష్టంగా, అస్పష్టంగా ఉన్న చాలా సందేహాలను తీర్చిందీ రచన. తెలియని విషయాలను నేర్పింది. తర్వాత పుస్తక రూపంలో వచ్చింది.

ఇదేదో అకడమిక్ పుస్తకంగా నీరసంగా ఉంటుందనుకోవద్దు. తిరుగులేని తర్కం, వ్యంగ్యం, హాస్యం ముప్పేటలా అల్లుకుని పాఠకులను ఆసక్తిగా చదివిస్తాయి.

తెలుగును సక్రమంగా రాయాల్సిన పాత్రికేయులకు నేను రికమెండ్ చేసే పుస్తకాల్లో దీనికి మొదటి స్థానం. ఈ పుస్తకం చదవని బ్లాగర్ మిత్రులూ, బ్లాగ్ వీక్షకులూ కూడా ఓసారి చదవాలని నా సూచన.

దాదాపు 19సంవత్సరాల క్రితం పుస్తకంగా అందుబాటులోకి వచ్చిన ఈ రచనకు ఇప్పటికీ ప్రాధాన్యం ఉంది. దీనికి రుజువులు ఇప్పటికీ తెలుగు పత్రికల్లో వస్తున్నరకరకాల దోషాలే. (ఆ దోషాలన్నీ ఈ రచనలో ప్రస్తావించినవే).
‘బడు’ వాడకం గురించి భాషావేత్త చేకూరి రామారావు గారి వాదనలూ, రంగనాయకమ్మ గారి ప్రతివాదనలూ ఈ పుస్తక పాఠకులకు బోనస్.

‘‘భాషని ‘రాయడం’ దగ్గిరికి వచ్చేటప్పటికే వస్తుంది గొడవ అంతా. మాట్లాడేటప్పడు ఎన్నడూ జరగని రకరకాల తప్పులు, రాసే భాషలో జరుగుతూ వుంటాయి’’ అంటూ ఈ రచన కొనసాగిస్తారు రంగనాయకమ్మగారు.

దినపత్రికల్లో కొంతకాలం వచ్చిన దోషాలను శ్రద్ధగా సేకరించి, వర్గీకరించి ఓ పరిశోధన లాగా ఈ రచన చేశారు.

2007 ఫిబ్రవరిలో వచ్చిన 3వ ముద్రణ ప్రస్తుతం అందుబాటులో ఉంది.

డెమ్మీ సైజులో 175 పేజీల ఈ పుస్తకం ప్రతులకు సంప్రదించాల్సిన చిరునామా-

‘అరుణా పబ్లిషింగ్ హౌస్’, విజయవాడ. (ఫోన్ 0866 - 2431181).

విశాలాంధ్ర ప్రచురణాలయాల్లో, ఇతర పుస్తక కేంద్రాల్లో కూడా దొరుకుతుంది.

ధర 30 రూపాయిలు.

కినిగె సైట్  ద్వారా  ఈ -బుక్ గా  కూడా కొనుగోలు చేయవచ్చు. లింకు-  
http://kinige.com/kbook.php?id=1026&name=Vaduka+Bhashe+Rastunnaamaa

24, ఏప్రిల్ 2009, శుక్రవారం

ఆ రెండు మౌన గీతాలు !


ళయరాజా స్వరపరిచిన పాటల్లో ఓ రెండు నాకు మరీ మరీ ఇష్టం.

1981లో వచ్చిన ‘మౌనగీతం’లో పాట ఒకటి.

1983లో వచ్చిన ‘సాగర సంగమం’లోది మరోటి.

రెంటినీ బాలూ, జానకి లే పాడారు.

పల్లవికీ చరణానికీ మధ్య వచ్చే వాద్య సంగీతం ఆ పల్లవీ, చరణాలకంటే మధురంగా ఉండటం చాలా అరుదు. 

ఇళయరాజా పాటల్లో బాణీకి ఉండే ప్రాధాన్యమే వాద్య (జంత్ర) సంగీతానికి ఇవ్వటం క(వి)నిపిస్తుంది.

మౌనగీతంలోని ‘పరువమా చిలిపి పరుగు తీయకు’ అనే పాటలో బాణీకి రెండో స్థానం, Interlude కు ప్రథమస్థానం ఇస్తా నేను. ఆ పాట కొత్తగా వినిపిస్తున్న రోజుల్లో మనసుకు ఎలాగో పట్టేసింది. 

 ఎక్కడో రేడియోలో దూరంగా వస్తూంటే పాట పూర్తయ్యేవరకూ ఆగిపోయి వినటం, తర్వాతే కదలటం నాకింకా బాగా గుర్తు. 

తొలి చరణానికి ముందు వచ్చే గంటల్లాంటి ధ్వని, అంతకుముందు ఆగిపోతూ మెల్లగా అయిపోతూ సాగిపోయే వాద్యసంగీతం మర్చిపోలేము. రెండో చరణానికి ముందు వచ్చే సంగీతం మొదటి దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఒకదానితర్వాత ఒకటిగా దూసుకొచ్చే వాద్యాల సమ్మేళనం వింత అనుభూతిని ఇస్తుంది.

తర్వాతి సంవత్సరాల్లో క్యాసెట్ దొరుకుతుందేమోనని ప్రయత్నించా కానీ దొరకలేదు. అయితే ఇప్పడా పాట అంతర్జాలంలో అందుబాటులో ఉందనుకోండీ. 

ఈ పాట మహా బేస్ వాయిస్ తో మొదలవుతుంది. 

అయినా ఆకట్టుకోవటం ఇళయరాజీయమే.

రెండో పాట ‘మౌనమేలనోయి...’ . ఇది అందరికీ తెలిసిన పాటే. ఈ పాట కొత్తగా రేడియోలో వినిపించే రోజుల్లో నాకో విచిత్రమైన అనుభవం ఎదురైంది. నేను నిద్రపోయి, మెలకువ వస్తున్నదశలో ఆ పాట చెవులకు సోకింది. నిద్ర లేచాక కూడా ఆ ట్యూనింగ్, నేపథ్యంలోని ఆ వేణు గాన మధురిమ నన్ను వదల్లేదు. 

It haunts me like anything for a long time.

సాహిత్యం సరిగా వినలేదు కాబట్టి ఆ పాట ఏమిటో, ఏ సినిమాలోదో తెలుసుకోవటం అంత త్వరగా సాధ్యమే కాలేదు. 

 అది కమలహాసన్- విశ్వనాథ్- ఇళయరాజా ల త్రివేణీ సంగమం ‘సాగర సంగమం’లోదని తర్వాత తెలిశాక సంతోషం వేసిందనుకోండీ. 

‘తారాడే హాయిలో...’ తర్వాత ఒకదాని వెంట మరొకటి వినవచ్చే రెండు రకాల వేణువుల మాధుర్యం, ‘ ఇది ఏడడుగుల వలపూ మడుగుల.. ’ దగ్గర బాలు గొంతులో పల్లవించే భావం, ఆ బాణీలోని శ్రావ్యత అనుభూతించండి.

ఈ రెండు పాటల్లో ఒకదాని సినిమా పేరులో మౌనం, మరో పాటలో పల్లవిలోనే మౌనం ఉండటం- ఈ రెండూ నా హాంటింగ్ మెలడీలు కావటం నాకు సంబంధించి ప్రత్యేకంగా అనిపిస్తాయి.
 
ఆత్రేయ, వేటూరిలు రాసిన పాటలివి. కింద ఇచ్చిన సైట్లో పాటల లిరిక్స్ ను ఆ పాట ఎదురుగా లింక్ అనేచోట నొక్కి చూడవచ్చు.

http://www.chimatamusic.com/searchmd.php?st=Ilaya%20Raja
ఇప్పడు పాటలను వినే లంకెలు ఇస్తున్నా కింద.
పరువమా... పాట వినటం కోసం...
http://www.chimatamusic.com/playcmd.php?plist=7515
మౌనమేలనోయి... పాట వినటం కోసం...
http://www.chimatamusic.com/playcmd.php?plist=5768

20, ఏప్రిల్ 2009, సోమవారం

‘ ఎక్కడున్నావురా ఇన్ని రోజులూ’

వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించే శక్తి అందరికీ ఉండదు. దార్శనికత (విజన్) ఉన్నవారికే ఆ ప్రతిభ సాధ్యమనిపిస్తుంది. ముడిపదార్థంగా ఉన్నపుడే కళాకారుని రేంజ్ ని అందరికంటే ముందే ఊహించగలగటం అద్భుతమే కదా!
ఈ నైపుణ్యం సినీ దర్శకుల్లో బాలచందర్ కి ఉంది; విశ్వనాథ్ కి ఉంది.
ప్రకాష్ రాజ్ ను మొదటిసారి చూసినపుడు ‘ఎక్కడున్నావురా ఇన్నిరోజులూ’ అని ప్రేమగా చిరాకుపడ్డారట బాలచందర్. (నిన్నటి ‘ఈనాడు ఆదివారం పుస్తకం’లో వ్యాసం చూడండి). ప్రకాష్ రాజ్ నట జీవితం ఆ క్షణమే మలుపు తిరిగింది. అద్భుతమైన కాంబినేషన్లు ‘చారిత్రక అవసరం’ లా వాటికవే కుదురుకుంటాయేమో..
కమల్ హాసన్ నూ, రజనీకాంత్ నూ డిస్కవరీ చేసిన ఘనత కూడా బాలచందర్ దే కదా!
ఇక కె.విశ్వనాథ్ విషయం-
సూటు బూటూ వేసుకొని, పెద్ద ‘క్రాఫ్’ తో కనిపించిన ప్రభుత్వాధికారి జె.వి. సోమయాజులులో ‘శంకరాభరణం శంకరశాస్త్రి ’ని ఊహించగలిగారాయన. ఇది మామూలు విషయం కాదు. అసలు సినీ ఫార్ములాకు సుదూరంగా ఆ చిత్రకథను తయారుచేయటానికే ఎంతో భవిష్యద్దర్శనం కావాలనుకోండీ.
గాయకుడు బాలసుబ్రహ్మణ్యంలో ప్రతిభను ఘంటసాల యుగంలోనే గుర్తించి, ప్రోత్సహించిన ఎస్.పి. కోదండపాణిని కూడా ఈ కోవలోకి చేర్చవచ్చు.

16, ఏప్రిల్ 2009, గురువారం

‘చందమామ’ రచయితను కలిసినవేళ....

 

‘చందమామ’ జానపద సీరియళ్ళను అమితంగా ఇష్టపడేవారిలో ఎక్కువమందికి వాటి రచయిత ఎవరో తెలియదు. ప్రచురణ కర్తలు కూడా రచయిత పేరుకు బదులు ‘చందమామ’ అని ప్రచురిస్తూ వచ్చారు. 

దీంతో ‘తోకచుక్క’ దగ్గర్నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ అద్భుత కథలను తీర్చిదిద్దినది ఎవరో పాఠకలోకానికి తెలియకుండా పోయింది. 

కొద్దిమంది రచయితలకు మాత్రమే ఆయనెవరో తెలుసు. 

ఆ రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారు. 

చందమామలో యాబై నాలుగేళ్ళు , 2006వరకూ పనిచేసి, ఉద్యోగ విరమణ చేశారు.  

ఆయనను కిందటి సంవత్సరం దసరా రోజున కలిసి, మాట్లాడాను! 

అసలు సుబ్రహ్మణ్యం గారి పేరు తొలిసారిగా విన్నది- కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి ‘చందమామ జ్ఞాపకాలు ’ వ్యాసంలో. ‘ఈ మాట’లో వచ్చిందీ వ్యాసం. తర్వాత రోహిణీప్రసాద్ గారు అమెరికా నుంచి మన రాష్ట్రానికి వచ్చినపుడు విజయవాడ వెళ్ళి సుబ్రహ్మణ్యం గారిని కలిసి, ఆ విషయం ఓ టపాలో రాశారు. అప్పుడే నిర్ణయించుకున్నా విజయవాడ వెళ్లినపుడు సుబ్రహ్మణ్యం గారిని తప్పకుండా కలవాలని! రోహిణీ ప్రసాద్ గారికి వేగు (మెయిల్) పంపి, అడ్రస్ సంపాదించాను. 

విజయవాడకు త్వరలోనే ప్రయాణం కుదిరింది. మొగల్రాజపురం మధు కళామండపం పక్కనున్న వైశ్యాబ్యాంక్ ఎంప్లాయీస్ అపార్ట్మెంట్స్. అక్కడే సుబ్రహ్మణ్యంగారు ఉంటున్న ఫ్లాటు చేరుకుని ఉత్కంఠతో ఎదురుచూశాను. 

కొద్ది సేపట్లోనే ఓ వృద్ధమూర్తి ఆగమనం. 

‘ఈయనేనా మూడుతరాల పాఠకులను అద్భుతలోకాల్లో విహరింపజేసిన సాహితీ స్రష్ట ’ అనే భావం మనసులో మెదిలింది. నా బాల్యపు హీరోలు ఖడ్గవర్మ, జీవదత్తులు (శిథిలాలయం, యక్ష పర్వతం, రాతిరథం) గుర్తొచ్చారు. అరగంటకు పైగా మాట్లాడాను. ఆప్యాయంగా సంభాషించారు. వయసు మీదపడటం వల్ల ఆయనలో కొంత వినికిడి లోపం. ‘చిత్రా’ బొమ్మల గురించీ, ఇంకా ఎన్నో విషయాల గురించీ అడగాలనుకున్నా గానీ అనుకున్నంత వివరంగా మాట్లాడలేకపోయా. 

 చందమామలో తాను రాసిన సీరియళ్ళను తిరిగి ప్రచురించేటప్పడు ఎనిమిది పేజీల మ్యాటర్ ను ఆరు పేజీలకు కుదిస్తున్న సంగతి ప్రస్తావించారు. తన రచనలను పరిశీలించేవారు తొలి ప్రచురణలనే ప్రమాణంగా తీసుకోవాలని ఆయన సూచించారు. 

  గొప్ప రచయితను కలిశాననే సంతోషంతో సెలవు తీసుకున్నాను. 

ఈ నెల కౌముది పత్రికలో సుబ్రహ్మణ్యంగారి గురించి వసుంధర రాసిన ప్రత్యేక వ్యాసం ‘చందమామకి వెన్నెముక- సుబ్రహ్మణ్య సృష్టి’ చదవండి.  

దానితో పాటే ప్రస్థానంలో గత సంవత్సరం సెప్టెంబరులో వచ్చిన ఆర్టికల్ కూడా జోడించారు. తప్పనిసరిగా చదవండి. http://koumudi.net/Monthly/2009/april/index.html

12, ఏప్రిల్ 2009, ఆదివారం

‘యమునా తీరాన’... ఎవర్ గ్రీన్!

 
తెలుగు పాటల్లో మధురమైనవీ, మర్చిపోలేనివీ ఎన్నో ఉన్నా కొన్ని పాటలు మాత్రం నాకు ... అత్యంత ప్రీతిపాత్రంగా తోస్తాయి.

వాటిలో ‘గౌరవం’ సినిమాలో పాట-

‘యమునా తీరాన రాధ మదిలోన కృష్ణుని ప్రేమకథ...’  ఒకటి. 

చిన్నప్పడు దీన్ని తొలిసారిగా విన్నప్పుటి నుంచీ  ఇష్టం మొదలయింది. ఇది ఏ సినిమాలోదో కూడా చాలాకాలం వరకూ తెలియలేదు.

సంగీత కర్త ఎం.ఎస్. విశ్వనాథన్ అని తర్వాత తెలిసింది. 

 
‘అంతులేని కథ’ నుంచీ బాలచందర్ సినిమాల ద్వారానే విశ్వనాథన్ ఎక్కువగా తెలుసు. ‘నన్ను ఎవరో తాకిరి’, ఇంకా... ‘నా జన్మభూమి ఎంతో అందమైన దేశమూ...’ లాంటివి మినహాయింపులనుకోండీ.

ఎంతో  బాగా  తెలిసినప్పటికీ  విశ్వనాథన్ సంగీతం సమకూర్చినదే అని నాకు  చాలా కాలం తెలియని మరో  మధుర గీతం.. ‘ఏమంటున్నది ఈ గాలీ.. ఎగిరే పైటను అడగాలీ..’  (మేమూ మనుషులమే.. 1973) 

గౌరవం సినిమా 1970లో వచ్చిందట. సినిమా చూసే అవకాశం ఇంతవరకూ రాలేదు.

ఈ పాట రాసింది రాజశ్రీ అని ఎక్కడో చదివాను. నిజమేనా?


మునా తీరాన... పాటలో ఏముందని తరచి చూసుకుంటే ... సాహిత్యం కన్నా సంగీతానికే 90 శాతం మార్కులు. 

ముఖ్యంగా పాటలో రవళించే మురళీ స్వరాలు ఎంత బాగుంటాయో!

ఈ పాటను చిరస్మరణీయం చేసింది చరణాలే. పల్లవి కంటే చరణాలు  అమిత మధురంగా తోస్తాయి.

హృదయం తెలుపు ఊహలలో... రాగం నిలుపు ఆశలలో...’ అంటూ ఆరంభమవుతుంది తొలి చరణం. ఆ ట్యూను మాధుర్యాన్ని వర్ణించటం కష్టం. పాట నాకు అమితంగా నచ్చటానికి కారణం- చరణాలకు కూర్చిన బాణీలే!

నాకు తెలిసిన చాలామంది ఈ పాట ఇష్టమని చెప్పారు. కానీ నా స్థాయి (!)లో కాదనుకోండీ.

దాదాపు నలబై సంవత్సరాలు అవుతోంది ఈ పాట పుట్టి!  ‘ఎవర్ గ్రీన్ పాటలకు కాలదోషం ఉండదు కదా!


అంతర్జాలంలో ‘యమునా తీరాన...’ ఓ సారి వినండి.
http://www.chimatamusic.com/searchmd.php?st=MS%20Viswanathan



ఈ పాట సాహిత్యం..

యమునా తీరాన రాధ మదిలోన
కృష్ణుని ప్రేమ కథా....
కొసరి పాడేటి కోరి వలచేటి
మనసు నీది కదా..

హృదయం తెలుపు ఊహలలో..
రాగం నిలుపు ఆశలలో..
తేనెల తేటల తీయని భావన
ఊరెను నా మనసులో..        >> యమునా తీరాన రాధ మదిలోన... >>

 1.  ఎదలో తలపే వణికెనులే
అధరం మధురం చిలికెనులే
రాధా హృదయం మాధవ నిలయం
మాయని ఈ చరితమే

2. మనసే నేడు వెనుకాడే
హృదయం విరిసి కదలాడే
లోలో భయము తొణికేనే
ఎదలో సుఖము విరిసేనే
పందిరిలో నిను పొందెద ఆ దినం..
ఆ దినమే పండుగ               >> యమునా తీరాన రాధ మదిలోన... >>
 

10, ఏప్రిల్ 2009, శుక్రవారం

పాత పుస్తకాలంటే ఎంతిష్టమో!

పుస్తకాలంటే నాకు ఇష్టమే. మళ్ళీ వాటిలో కొత్త పుస్తకాల కంటే పాతవే ఎక్కువ ఇష్టం!
  • కొత్తవి ఎక్కడైనా దొరుకుతాయి; పాతవి మళ్ళీ దొరక్కపోవచ్చు.
    పాత పుస్తకాల్లో మంచివి కూడా కొన్నిటిని పబ్లిషర్లు ప్రచురించటం లేదు కదా! పుస్తక పఠనానికి ఆదరణ తగ్గిన ఈ రోజుల్లో ఎన్నో మంచి తెలుగు పుస్తకాలు రీ ప్రింట్లు లేకుండా ఉన్నాయి.

    * ఒకే రచయిత పుస్తకం కొత్తదీ, పాతదీ ఎంచుకోవాలంటే నేను పాతదానికే ఓటు వేస్తాను. పాత పుస్తకాలను రీ ప్రింట్ చేసేటప్పుడు పేరాలు పేరాలే కంపోజింగ్ లో మిస్సయ్యే ప్రమాదముంటుంది. రచయితలో, ప్రచురణ కర్తలో పట్టించుకోకపోతే అంతే సంగతులు! ఇది చాలా ముఖ్యమైన పాయింటు.
    (రంగనాయకమ్మ గారి పుస్తకాల విషయంలో ఇది వర్తించదు. ఆమె తన పుస్తకాలను పాతవాటికంటే చాలా మెరుగులు దిద్దుతారు... వస్తు పరంగా , కథన పరంగా కూడా! రీ ప్రింటు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.)
    * అచ్చుతప్పులు పాతవాటిల్లో తక్కువ. కొత్త వాటిలో ఎక్కువని వేరే చెప్పాలా?
  • పాత పుస్తకాలు హేండ్ కంపోజింగ్ లో తయారైనవి. ఆ ఫాంట్ల ముందు చాలా సందర్భాల్లో ఇప్పటి ఆధునిక ఫాంట్లు తీసికట్టే.
    * కవర్ పేజీలు కొత్త ప్రచురణల్లో మారిపోతున్నాయి. పాత కవర్లను ప్రముఖ చిత్రకారులు వేసేవారు. కొత్త కవర్లను ఫోటోషాప్ బొమ్మలు ఆక్రమిస్తున్నాయి. ఈ కొత్తవి సాధారణంగా... పాతవాటితో పోలిస్తే బొత్తిగా బావుండవు. (కావాలంటే మచ్చుకు గోపీచంద్ ‘మెరుపుల మరకలు’, బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది’ నవలల పాత, కొత్త ప్రచురణలు చూడండి).
  • విశ్వప్రసాద్ నవలల్లో రెండొందల పుస్తకాలకు ఆర్టిస్టు కేతా ముఖచిత్రాలు వేశారు. ‘ఆయన కలం, నా కుంచె సమైక్యతతో, ఉత్సాహంగా పోటీ పడేవి’ అని కేతా అన్నారోసారి. ఇప్పడు ఓ గ్రాఫిక్ తో లాగించేస్తే పోలా అనుకుంటున్నారు.

ఆదివారం పేవ్ మెంట్ల మీద రాశులుగా పోసే పుస్తకాల్లో అమూల్య, అలభ్య, అరుదైన పుస్తకాల కోసం వీలున్నప్పుడల్లా వెతికేవారిలో మీలో కొందరైనా ఉంటారు కదూ!

ఈ సందర్భంగా విజయవాడ లెనిన్ సెంటర్లో ఉన్న ‘వంశీ ప్రాచీనాంధ్ర గ్రంథమాల’ గురించి ప్రస్తావించటం నా బాధ్యత. ఈ బుక్ స్టాల్ యజమాని నర్రా జగన్మోహనరావు. సాహిత్యాభిమాని. ముక్కుసూటి మనిషి. పుస్తకాలను బేరం చేస్తే ఆయనకు గిట్టదు. పుస్తకం స్థాయినీ, రేరిటీని బట్టీ ఒక ధర చెపుతారు. ఇక అంతే, దానికిక తిరుగుండదు.
ఈ పాత పుస్తకాల షాపులో చాలా అరుదైన పుస్తకాలు దొరుకుతాయి. ఫోన్ నంబరు 9849632379

6, ఏప్రిల్ 2009, సోమవారం

‘విన్నారా అలనాటి వేణుగానం?’

ప్పుడీ రీ- మిక్స్ రోజుల్లో ...
ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం కన్నుమూసిన రమేష్ నాయుడు గురించీ, ఆయన సంగీతం గురించీ ఎవరైనా పట్టించుకుంటారా?

ఈ సందేహం కొంత సరైందే.

కానీ, మధురమైన సంగీతానికి మైమరిచిపోయే శ్రోతలు ఎప్పుడూ ఉంటారు. శ్రావ్యమైన  పాట అజరామరం కదా!

అచ్చతెలుగు సినీ సంగీత దర్శకుడు రమేష్ నాయుడు.

తెలుగు శ్రోతలకు రమేష్ నాయుడు  సంగీతం ఏళ్ళ తరబడి  అందిందంటే..  ప్రధానంగా  ముగ్గురు వ్యక్తులు కారకులు.   వారు  దర్శకులైన  దాసరి నారాయణరావు,  విజయనిర్మల,   జంధ్యాల. 

ఈ ముగ్గురూ ఆయన  సంగీతాన్ని  ఎంతో ఇష్టపడి, ఎన్నో సినిమాల్లో  ఆయన ప్రతిభను  ఉపయోగించుకున్నారు.  ఆయన కూడా ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని  ఎన్నో మధురమైన పాటలను స్వరపరిచి, అందించారు. 


మామూలు మాటలుగా కన్పించేవి కూడా ఆయన కూర్చిన స్వరాల స్పర్శకు జీవం పోసుకుంటాయి. యాంత్రికంగానో,  పొగడ్తగానో   అంటున్న వ్యాఖ్య కాదిది.

‘చదువు-సంస్కారం’లో ‘దీపానికి కిరణం ఆభరణం’ పాట వినండి.

‘చందన’లో ‘ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలి’ వినండి.

నా మాటల్లో నిజమెంతో తెలుస్తుంది.

‘శ్రీవారికి ప్రేమలేఖ’లో ‘మనసా తుళ్ళిపడకే...’ , ‘

శివరంజని’లో ‘ జోరు మీదున్నావు తుమ్మెదా’ పాటల్లో సాహిత్యానికి ప్రాణం పోసిన స్వరకల్పనను ఆస్వాదించండి.

‘జీవితం’లో ‘ఇక్కడే కలుసుకున్నాము..’ పాటలోని స్వర విన్యాసం,

‘అమ్మ మాట’లో ‘ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్’ పాటలో పలికిన చిలిపితనం ఆహ్లాదించండి.

‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో  ‘విన్నారా అలనాటి వేణుగానం’ పాట .. సింప్లీ సుపర్బ్!

ఈ పాట పల్లవి  వినండి....

 


గాలి పాటలను కూడా ఎంత బాగా స్వరపరిచారో ‘మసక మసక చీకటిలో..’, ‘మాయదారి సిన్నోడు...’ పాటలు చక్కటి ఉదాహరణలు.

రమేష్ నాయుడు గారి గురించి వేటూరి తన ‘కొమ్మకొమ్మకో సన్నాయి’ పుస్తకంలో  రెండు అధ్యాయాలు కేటాయించి  రాశారు. వాటిని  వీలు చూసుకుని చదవండి.


అంతకంటే ముఖ్యంగా రమేష్ నాయుడు స్వరాభిషేకంలో తడిసి, ముద్దవ్వండి!

పాటలు ఎక్కడ వినాలంటారా? ఓ రెండు సైట్ల లంకెలు ఇస్తున్నా.
http://www.chimatamusic.com/rameshNaidu.php?PHPSESSID=bf4f3e490a1c4360c257166bade813f1

http://www.24by7music.com/SongsByTag.aspx?CategoryID=10

4, ఏప్రిల్ 2009, శనివారం

ఈ రచయిత ఎవరో చెప్పుకోండి చూద్దాం!


ఈ ఫొటో చూసి, ఈ రచయిత ఎవరో చెప్పగలరా?

ఫోటో చూసి, రచయితను గుర్తించటం తెలుగు పాఠకులకు అంతగా అలవాటు లేని పని కాబట్టి కొన్ని క్లూలు ఇస్తాను.
* ఈ రచయిత 500పైగా తెలుగు పుస్తకాలు రాశారు.
* అపరాధ పరిశోధక నవలా రచయితగా సుప్రసిద్ధుడు.
* సస్పెన్స్, థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ రచనల్లో ప్రత్యేక ముద్ర ఉన్న రచయిత.
* తాను రూపకల్పన చేసిన హీరో్ పేరుమీదే పబ్లికేషన్స్ నడిపారు.
* డజన్ సినిమాలకు కథ, మాటలు రాశారు.
* సాహిత్య, సినీ, పిల్లల మాసపత్రికలకు సంపాదకునిగా వ్యవహరించారు.
* ఈ రచయిత ఇప్పుడు జీవించిలేరు.

ఎంతో ప్రాచుర్యం పొందిన రచయిత పేరును చెప్పమని ఇలా క్విజ్ అడగటం అన్యాయమే. 

కానీ ఈయన చనిపోయినపుడు తెలుగు పత్రికలు చాలా అన్యాయం చేశాయి. అప్రధానంగా చిన్న వార్త ఇచ్చాయి. కొన్ని పత్రికలయితే అసలు పట్టించుకోనేలేదు. నివాళి వ్యాసాలు అసలే లేవు. నేటి పాత్రికేయుల సాహితీ పరిచయం ఇంతలా ఉంది. 

 డిటెక్టివ్ నవలలకు సాహిత్య గౌరవం ఉండదు కాబట్టి ఇలా జరిగిందనుకోలేం. ఇతర అంశాల్లో ఆయన కంట్రిబ్యూషన్ సంగతి పట్టించుకోనేలేదు!