సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ఎన్టీఆర్... అక్కినేనీ ... ‘కళర్ మాంత్రికుడూ’!

హాభారతంలో భీముడెలా ఉంటాడు?

ద్రౌపదికి నిండు సభలో జరిగిన అవమానాన్ని అన్నదమ్ముల్లాగా తలవంచుకుని భరించలేక  ఆగ్రహావేశాలతో ఊగిపోతూ భీముడు చేసిన శపథాన్ని  వెయ్యి సంవత్సరాల క్రితమే నన్నయ ఇలా వర్ణించాడు -

‘ధారుణి రాజ్యసంపద మదంబునఁ గోమలిఁ గృష్ణఁ జూచి రం
భోరు నిజోరు దేశమున నుండఁగఁ బిల్చిన యిద్దురాత్ము దు
ర్వార మదీయ బాహుపరివర్తిత చండ గదాభిఘాత భ
గ్నోరుతరోరుఁ జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్’


70 ఏళ్ళ క్రితం శ్రీశ్రీ ‘జ్వాలాతోరణం’లో భీముణ్ణి కళ్ళకు కట్టాడు.

‘... కురుక్షేత్రమున కృద్ధ వృకోదరు
గదాఘాతమున గజగజలాడగ ...’


46 సంవత్సరాల కిందట వచ్చిన ‘పాండవ వనవాసం’లో భీముడి పాత్ర పోషణ చేసిన ఎన్టీఆర్  హావభావాలు చిరస్మరణీయం.

వాల్ పోస్టర్లలో వాటికి వన్నెలద్ది, మెరుగుపరిచి సినీ అభిమానులను సమ్మోహనపరిచిన చిత్ర కళానైపుణ్యం పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ ది!



ఒరిజినల్ లో ఉన్న భీమసేనుణ్ణి  ఎంతగా ఇంప్రొవైజ్ చేశారో చూశారా? తలను కొంచెం వంపుతిప్పటం వల్ల మెరుగుదల వచ్చింది. ఇక స్వర్ణాభరణాల నగిషీల పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పదేముంది?


ఆలోచనలో, విచారంలో  నిమగ్నత..  తర్వాత  ఉగ్రమూర్తిగా రౌద్రం...!

కృద్ధ వృకోదరుడి హావభావాలు  చూడండి-

కొంచెం క్లోజప్ లో....  క్లోజ్ క్లోజప్ లో...!





శ్వర్  రాసిన ‘సినిమా పోస్టర్’ పుస్తకం ఈ మధ్యనే విడుదలైంది.  దానిలో  ఇచ్చిన  వర్ణచిత్రాలివి. 


ఎన్నో విశేషాలతో రూపొందిన ఈ అద్భుతమైన పుస్తకాన్ని (చవి) చూసిన అనుభూతి తో ఈశ్వర్ గురించి నాలుగు మాటలు ఇలా.. రాయాలనిపించింది.

ఈ- పుస్తకంగా  దీన్ని  చదవాలనుకున్నవారు  చూడాల్సిన  కినిగె లింకు- 
http://kinige.com/kbook.php?id=1852&name=Cinema+Poster

కొన్ని దశాబ్దాల క్రితం అయస్కాంతంలా ఆకట్టుకునేవి సినిమా ప్రకటనలు. వాటి కిందిభాగంలో ESWAR అనో, గంగాధర్ అనో సంతకాలను గమనించి, ఆ చిత్రకారుల కళను ఆరాధనగా చూస్తూ, వాళ్ళ సంతకాలూ, రాసే అక్షరాల తీరూ అనుకరిస్తూ ఆనందిస్తూ మురిసిపోయేవాణ్ణి.




చందమామకు చిత్రా, శంకర్ లు ఎలాంటివారో వెండి(తెర) చందమామకు ఈశ్వర్, గంగాధర్ అలాంటివాళ్ళనిపిస్తుంది. వీరిలో ముగ్గురి పేర్లు శివుడితో సంబంధమున్నవి కావటం ఆసక్తికరం!


‘ప్రకటనా చిత్ర కళలో
కళని నిలువెత్తుగా నిలబెట్టి
పోస్టర్ పోర్ట్రైట్ స్థాయికి
పెంచి చూపెట్టిన
కళర్ మాంత్రికుడు..’


అంటూ బాపు, రమణల ప్రశంసలు పొందిన కళాకారుడు ఈశ్వర్.  

క్కినేని నాగేశ్వరరావు అనగానే గుర్తొచ్చే చిత్రం ఒకటుంది కదా! స్టిల్ ఫొటోగ్రాఫర్ మన సత్యం దీన్ని తీశారనుకుంటాను. ఆ ఫొటోను రేఖల్లో, రంగుల్లో రూపచిత్రంగా ఈశ్వర్ ఎలా మలిచారో చూడండి...

వర్ణచిత్రం లేతవయసును ప్రతిబింబిస్తోంది. రేఖాచిత్రంలో మీసాలు చిత్రించి  కొంచెం వయసును పెంచినట్టుంది! 

‘సినిమా పోస్టర్ ’ పుస్తకం గురించిన పరిచయం కాదిది. కానీ ఓ మాట చెప్పకుండా ఉండలేను.

పుస్తకం  చివర్లో ఇచ్చిన వర్ణచిత్రాలు న భూతో.. !

ఇక వివిధ సినిమాల, నటీనటుల
నలుపు తెలుపు  
రూపచిత్ర 
విన్యాసమంటారా..!  

----------------------------------------------------------------------
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ 
----------------------------------------------------------------------
తాజా చేర్పు:
టపాను  ‘నమస్తే ఆంధ్ర ’  మ్యాగజీన్ లో మే 2012లో  ప్రచురించారు.  చూడండి.