సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

28, అక్టోబర్ 2011, శుక్రవారం

మనుషులూ... మతాలూ... దేవుళ్ళూ!

మధ్య నేను ఎక్కువగా చదివినవి రచయితల స్వీయ కథలూ,  యదార్థ గాథలే.  ఈ  పరంపరకు భిన్నంగా వైజ్ఞానిక దృక్పథంతో సాగిన ఓ రచనను కొద్దిరోజుల క్రితం చదివాను.

ఈ వ్యాస సంకలనం  పేరు ‘మనుషులు చేసిన దేవుళ్ళు’. శాస్త్రవేత్త, పాపులర్ సైన్స్ రచయిత  కొడవటిగంటి రోహిణీప్రసాద్ రచన.  ఈ- పుస్తకం లభించే  కినిగె లింకు- http://kinige.com/kbook.php?id=397&name=Manushulu+Chesina+Devullu

ఈ పుస్తకం పేరు విన్నపుడు వందేళ్ళ క్రితం గురజాడ రాసిన కథ శీర్షిక – ‘దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్ళారా! మీ పేరేమిటి?’ గుర్తొస్తుంది.

‘మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగునుఅని  ఆ మహాకవి ఎందుకు ఆకాంక్షించాడో  స్పష్టమవుతుంది.

మత విశ్వాస పరిణామాలను వైజ్ఞానికంగా విశ్లేషణ చేసిన పుస్తకమిది.  ఆస్తికులుగానో, నాస్తికులుగానో ఉండకుండా తటస్థంగా ఉన్నవారికి ఈ రచన ఎక్కువ ఉపయోగపడుతుంది.  ముఖ్యంగా హేతువాద దృక్పథం ఉన్నవారు తమ భావాల శాస్త్రీయ ప్రాతిపదిక కోసం ఇది తప్పనిసరిగా  చదవదగ్గది. 

‘మరి భక్తి విశ్వాసాలున్నవారు ఈ  పుస్తకం చదవకూడదా?’ అంటే చదవొచ్చు.   

ఈ ప్రపంచం మనిషి కోసమే ఉందనీ, మానవులుగా  పుట్టటం ఎంతో ఉత్కృష్టమైన విషయమనీ నమ్మేవారికి ఈ భూగోళమ్మీద మనిషి ఎంతో జూనియర్ అనీ, అతడి ప్రమేయం లేకుండా ఎంతో సుదీర్ఘకాలం గడిచిందనీ చెప్పే సైన్స్ వివరణ అంత తేలిగ్గా మింగుడుపడకపోవచ్చు.  ‘‘చావు విషయంలో మనకూ, ఊరకుక్కలకూ, బొద్దింకలకూ తేడా ఏమీ ఉండదని నమ్మడం ఏ మనిషికైనా చాలా కష్టమే’’  అంటారు రచయిత ఈ పుస్తకంలో. 

తాము విశ్వసిస్తూ పాటిస్తున్న భావాలకు మూలాలేమిటో  వేరే కోణంలో చదవటం- మత విశ్వాసాలున్నవారికి భిన్నమైన అనుభవమే అవుతుంది కదా?

పుస్తకంలో ప్రస్తావించినవాటిలో దేని గురించి అయినా వివరాలు కావాలంటే రచయిత ఈమెయిల్ rohiniprasadk@yahoo.com  ద్వారా సంప్రదించే అవకాశముంది.
 

 ‘ఏ మాత్రమూ ఆవేశానికీ, ఉద్వేగాలకూ, ముందే మనసులో ఉన్న మార్క్సిజం వంటి సిద్ధాంతాలకూ లోబడకుండా మతాల గురించి విశ్లేషణ చేసుకోవచ్చు. కాస్త ప్రాథమిక విజ్ఞాన వైఖరి ఉంటే చాలు’ అంటారు ఉపోద్ఘాతంలో రచయిత.

ఈ పుస్తకం గురించి అక్టోబరు 23 ఈనాడు సండే మ్యాగజీన్ లో చిన్న పరిచయం రాశాను.


రచయిత మాటల్లో...
ఈ పుస్తకంలో ఆలోచనాత్మకంగా, ఆసక్తికరంగా ఉన్న కొన్ని అంశాలను యథాతథంగా ఇస్తున్నాను.


తాల గురించి విజ్ఞానపరంగా ఆలోచించడం సబబు కాదని చాలామంది అనుకుంటారు. వీరిలో మతాలలో నమ్మకం లేనివారు కూడా ఉండవచ్చు. మతాలు అకస్మాత్తుగా తలెత్తినవి కావనీ, మానవ సమాజం పరిణామ దశల్లో మొదలైనవేననీ గుర్తుంచుకుంటే మతాలనేవి ప్రజల మనసుల్లో ఎలా రూపు దిద్దుకున్నాయో అర్థమవుతుంది.

*   *    *

1400 కోట్ల ఏళ్ళ వయసు గల విశ్వంలో భూమి పుట్టి 500 కోట్ల ఏళ్ళు కూడా కాలేదు. జరుగుతున్నవి చూసి, అర్థం చేసుకోగలిగిన మానవజాతి మొదలై 2 లక్షల ఏళ్ళు కూడా గడవలేదు.

... భూమి వయసుతో పోలిస్తే మనవంటి జీవరాశి వయసు చాలా తక్కువన్నమాట. మొదటి 400 కోట్ల సంవత్సరాల కాలంలో ఎవరైనా గ్రహాంతర యాత్రికులు భూమిని సందర్శించినట్టయితే వారికి కనబడే  జీవపదార్థం కేవలం నాచు లాంటిది మాత్రమే అయివుండేది.

... జీవకణాలు పుట్టిన ఎంతోకాలానికి గానీ మానవజాతి రూపొందలేదు. అందుకనే ఈ ప్రపంచమంతా మనుషుల కోసమే అనే భావన అర్థం లేనిదిగా అనిపిస్తుంది. అంతేకాక మనిషీ, దేవుడూ, జీవాత్మా, పరమాత్మా అంటూ మనవాళ్ళు అల్లుకునే ఊహలు ఎంత సంకుచితమైనవో తెలుస్తుంది.

*   *    *

దేవుళ్ళూ, పూనకాలూ, దెయ్యాలూ, చేతబడులూ, ప్రేతాత్మలూ అన్నీ ఎంతో ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతున్న మూఢనమ్మకాలు.
*   *    *

తాలంటే కేవలం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టటమే కాదు.  పునర్జన్మలూ, బాబాల మహిమలూ, జాతకాలూ, చిలకజోస్యం అన్నీ కూడా కంటికి కనబడని అతీత శక్తిలోని నమ్మకాలకు దృష్టాంతాలే.  ఈ భ్రాంతికి కారణాలు-
కొన్ని చరిత్రాత్మకమైనవి,
కొన్ని సామాజికమైనవి,
కొన్ని బూటకపు మోసాల ఫలితాలు,
మరికొన్ని మన నాడీమండలం మనమీద కలిగించే ప్రభావాలు.


*   *    *

న శరీరంలో పెద్దపేగుకు చివర ఉన్న అపెండిక్స్ ఒకప్పుడు మనకు పనికొచ్చేదట. ఈనాడు దానివల్ల ఉపయోగమేమీ లేకపోగా అప్పుడప్పుడూ అపెండిసైటిస్ వ్యాధిని కూడా కలిగిస్తూ ఉంటుంది. దాన్ని తొలగించడమే మంచిది. మతమనేది కూడా అంతే.  

ఉపసంహారం
మెదడుపై జరుగుతున్న ఆధునిక పరిశోధనలవల్ల  తెలిసిన ఒక  విషయం గురించి రచయిత ఈ పుస్తకంలో ప్రస్తావిస్తారు. 

అదేమిటంటే... 

ఉన్నవీ, లేనివీ కల్పించుకునే అనవసరమైన ఊహాశక్తి ప్రకృతిసిద్ధంగా మన మెదడుకు అలవడిన లక్షణమట.  అందుకే పూర్తిగా హేతువాదవైఖరి కలిగినవారు చాలా అరుదుగా ఉంటారట.

అసలు మన సమాజంలో  హేతువాదులే  చాలా తక్కువమంది. ఆ తక్కువమందిలో కూడా పూర్తి హేతువాదులు  మరీ స్వల్పం!  దీనికి మెదడుకు  అలవడిన లక్షణం కూడా కారణమన్నమాట!

సమాజంలో హేతువాద భావనలు బలపడేందుకు కృషి మరింత పట్టుదలతో  జరగాలని ఆకాంక్షిస్తూ ముందుమాటలో ఇలా రాశారు టంకశాల అశోక్ -

‘మనిషిని, ప్రకృతిని, సమాజాన్ని, వ్యవస్థలను, ఇటీవలి చారిత్రక పరిశోధనలను తరచి చూసి రాసిన ఈ వ్యాసాల సంకలనం ఇప్పటికే హేతువాదులైనవారికి కూడా చదవదగినది అవుతున్నది’

12 కామెంట్‌లు:

ఆ.సౌమ్య చెప్పారు...

wow...అయితే ఈ పుస్తకం తప్పకుండా కొని చదవాల్సిందే!
మంచి పుస్తకం పరిచయం చేసినందుకు thanks వేణు గారు.

karthik చెప్పారు...

వేణు గారూ
ముందుగా, ఈ టపా అంతా తికమకగా ఉంది.. రెండు మూడు సార్లు చదివితే గానీ నాకు అర్థం కాలేదు..
ఆ విషయం పక్కన పెడితే,
>>మత విశ్వాస పరిణామాలను వైజ్ఞానికంగా విశ్లేషణ చేసిన పుస్తకమిది.
విశ్వాసాలనా? లేక వాటి వల్ల కలిగిన పరిణామాలనా? లేక రెండిటి గురించా??
>>మరికొన్ని మన నాడీమండలం మనమీద కలిగించే ప్రభావాలు.
సాధారణంగా నేను హేతువాదుల రచనలు వ్యాసాలు చదవను.. (వాళ్ళంతా ఫాసిస్ట్ గుంపు అని నా అభిప్రాయం) కానీ ఈ నాడి మండలం అంటే ఏదో ఆసక్తి కరంగా ఉంది.. చదవటానికి ప్రయత్నిస్తాను..
శ్రమ తీసుకుని పరిచయం చేసినందుకు నెనర్లు..

వేణు చెప్పారు...

సౌమ్య గారూ, థాంక్యూ!

కార్తీక్ గారూ, టపా తికమకగా ఉంటే ఆ మకతిక అంతా నాదే. పుస్తకానిది కాదు! మత విశ్వాసాలనూ, వాటి పరిణామాలనూ విశ్లేషించిన పుస్తకం ఇది.

హేతువాదుల రచనలూ, వ్యాసాలూ మీరు చదవకపోవడానికి వారి మీద మీకున్న అభిప్రాయం కారణమా? మరి ఆ అభిప్రాయం ఎందుకని ఏర్పడింది? (వారి రచనలు చదవకుండానే?)

Malakpet Rowdy చెప్పారు...

Kartik

Rohini Prasad is a different material altogether. His observations are usually backed up by solid justifications. I love reading his stuff.

He is not like those other worthless communist hate-mongers

అజ్ఞాత చెప్పారు...

ఇట్లాంటి పుస్తకాలు రాసేవాళ్ళలో రిచర్డ్ డాకిన్స్ చాలా ప్రసిద్ధుడు. ఆయన రచ‌నల‌కి నేను అభిమానిని. రోహిణీ ప్రసాద్ గారి వ్యాసాలు కూడా నాకు నచ్చుతాయి. ఎటొచ్చీ ఒక్కోసారి వీళ్ళు ఇచ్చే తీవ్రమైన స్టేట్ మెంట్సు చూస్తే కొద్దిగా నవ్వొస్తుంది. 'మతం ఎపెండిక్సు లాంటిది. దాన్ని తొలగించడమే మంచిది. మతాన్ని నమ్మేవాళ్ళ మెదడులో లోపం ఉంది.' ఇలాటి మాటలే ఒకసారి డాకిన్సు రేడియోలో మాట్లాడితే ఒకాయన అడిగాడు, 'బాగుంది, అయితే మతాన్ని నమ్మేవాళ్ళందరికీ మొదట పిచ్చికుక్కలని ముద్ర వేస్తున్నారు. తర్వాత ఏమిటి? వాళ్ళందరికీ నాజీ జర్మనీలో యూదులగతి పట్టించడానికి గ్రవుండు ప్రిపేర్ చేస్తున్నారా'? అని. పాపం డాకిన్సు తనని అజ్ఞానం నుంచి కాపాడాలని ప్రయత్నిస్తున్నాడని ఆయన గ్రహించలేకపోయాడు.

ఏదేమైనా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ని గట్టిగా ప్రెజెంట్ చేసేటప్పుడు తీవ్రమైన స్టేట్ మెంట్సు కూడా తప్పవనుకోండి. 'తెలిసిన' చదువరులు (Informed Readers) వాటిని పట్టించుకోరు.

కామేశ్వరరావు చెప్పారు...

అవును. రోహిణీప్రసాద్ గారి వ్యాసాలు చాలా ఆలోచనాత్మకంగా ఉంటాయి. ఈ పుస్తకం నేను చదవలేదు కాని ఈ అంశానికి సంబంధించిన చాలా వ్యాసాలు ఇంటర్నెట్ పత్రికల్లో వచ్చినవి చదివాను.

అయితే, మత సంబంధమైన నమ్మకాలని వైజ్ఞానిక విషయాలుగా చెలామణీ చెయ్యాలని ఎలా అయితే కొంతమంది తాపత్రయపడతారో, అదే రకంగా మతానికి సంబంధించిన అపనమ్మకాన్ని (లేదా భౌతికవాదమ్మీదనున్న నమ్మకాన్ని) వైజ్ఞానిక విషయంగా చూపించే సందర్భాలు వారి రచనల్లో కూడా పాలలో నీళ్ళలా కలగలిసి ఉంటాయని నాకు అనిపించే విషయం.

టపాలో ఉదహరించిన విషయాలలోనే అలాంటివి కొన్ని చూడండి:

1. "ఈ ప్రపంచం మనిషి కోసమే ఉందనీ, మానవులుగా పుట్టటం ఎంతో ఉత్కృష్టమైన విషయమనీ నమ్మేవారికి ఈ భూగోళమ్మీద మనిషి ఎంతో జూనియర్ అనీ, అతడి ప్రమేయం లేకుండా ఎంతో సుదీర్ఘకాలం గడిచిందనీ చెప్పే సైన్స్ వివరణ అంత తేలిగ్గా మింగుడుపడకపోవచ్చు."

భూగోళమ్మీద మనిషి చాలా జూనియరే అనడం శాస్త్రీయమైన విషయం. అయితే దానికీ మానవులుగా పుట్టడంలోని ఉత్కృష్టతకి సంబంధం అశాస్త్రీయం. ఉత్కృష్టతని కాలపరిమాణంతో కొలవం కదా! విశ్వసృష్టి జరిగిన దాదాపు వెంటనే మానవుడు పుట్టాడన్న నమ్మకం కొన్ని మతాలకే పరిమితం.

2. ‘చావు విషయంలో మనకూ, ఊరకుక్కలకూ, బొద్దింకలకూ తేడా ఏమీ ఉండదని నమ్మడం ఏ మనిషికైనా చాలా కష్టమే’

భౌతికంగా చావు విషయంలో మనకీ, కుక్కలకీ బొద్దింకలకీ పెద్ద తేడా లేదు అనడం శాస్త్రీయం. ఇందులో మనిషి నమ్మడానికీ నమ్మకపోవడానికి ఏమీ లేదు. మనిషి నమ్మకం ఉన్నది అభౌతికమైన విషయాలపైన. అది వైజ్ఞానికిశాస్త్ర నిరూపితం కాదు కాబట్టి అది నమ్మకమే. అయితే అందులో వైజ్ఞానికశాస్త్ర విరుద్ధమైనది ఏమీ లేదు. అంటే వేరే అభౌతికమైనది ఏదీ ఉండేందుకు అవకాశం లేదని, నాకు తెలిసి, వైజ్ఞానికశాస్త్రం నిరూపించ లేదు. భౌతికవాదానికి మాత్రం అది విరుద్ధమైనది, అంతే.

3. అంతేకాక మనిషీ, దేవుడూ, జీవాత్మా, పరమాత్మా అంటూ మనవాళ్ళు అల్లుకునే ఊహలు ఎంత సంకుచితమైనవో తెలుస్తుంది

దేవుడూ, జీవాత్మా, పరమాత్మా అంటూ మనవాళ్ళు అల్లుకున్నవి ఊహలే అనడం శాస్త్రీయం. అవి సంకుచితమైనవి అనడంలో శాస్త్రీయత ఏమిటో నాకు బోధపడదు.

4. మతానికీ, అపెండిక్సుకీ పోలికకూడా శాస్త్రీయం కాదు. అది భౌతికవాదంపైనున్న నమ్మకం మాత్రమే. మతం యొక్క అవసరం ఉన్నదా లేదా అని వైజ్ఞానికశాస్త్రం (పోనీ సామాజికశాస్త్రం) ద్వారా తేల్చడం అసాధ్యం. కేవలం మతం వలన తలెత్తుతున్న ఇబ్బందుల ఆధారంగా, అది నిరుపయోగమనీ ప్రమాదకరమనీ నిర్ణయించడం పూర్తిగా అశాస్త్రీయం. మనిషి వైజ్ఞానిక అభివృద్ధి కూడా ఎన్నో ఇబ్బందులని తెచ్చిపెడుతున్నది. అందువల్ల అది పూర్తిగా నిష్ప్రయోజనం అని అనడం అసమంజసమే కదా. నానాటికీ తరుగుతున్న మనిషి వివేచనే సర్వ అనర్థాలకీ కారణం. కోతి చేతిలో రాయయినా, కొబ్బరికాయయైనా ఒకటే!

5. "ఉన్నవీ, లేనివీ కల్పించుకునే అనవసరమైన ఊహాశక్తి ప్రకృతిసిద్ధంగా మన మెదడుకు అలవడిన లక్షణమట."

ఉన్నవీ లేనివీ కల్పించుకునే ఊహశక్తి ప్రకృతిసిద్ధంగా మన మెదడుకు అలవడిన లక్షణం - అన్నంత వరకూ అది శాస్త్రీయమే. అది అవసరమా అనవసరమా అని తేల్చడం అశాస్త్రీయం. శాస్త్రీయమైన ఒక పరిమిత అర్థంలో/కాంటెక్స్టులో మాత్రమే దాన్ని "అనవసరం" అనగలం. ఆ కాంటెక్స్టు లేకుండా/చెప్పకుండా, దాన్ని జెనరలిజ్ చేసి చెప్పడం అశాస్త్రీయం, అసమంజసం.

వేణు చెప్పారు...

భైరవభట్ల కామేశ్వరరావు గారూ!

మీరు పేర్కొన్న మొదటి పాయింటు: రచయిత యథాతథంగా రాసిన వాక్యం కాదిది. సారాంశంగా నేను చెప్పింది మాత్రమే అది! ఈ ప్రపంచం తనకోసమే ఉందని మానవుడు అనుకోవటంలో అర్థం లేదనీ, భూగోళంలో తన ఉనికి కూడా లేకుండా సుదీర్ఘ కాలం గడించిందనీ చెప్పటమే ఇక్కడ భావం. మానవుడి పరిమిత ప్రాధాన్యం చెప్పటానికే ‘జూనియర్’ అనే మాట. దానికీ ఉత్కృష్టతకూ నేరుగా ఎలాంటి సంబంధం లేదు!

మీరు ప్రస్తావించిన మిగిలిన పాయింట్లన్నీ రచయిత పుస్తకంలో యథాతథంగా రాసిన అంశాలే.

పాఠకులు సందర్భం నుంచి విడదీసి అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో కాదు- వాటిని నేనిక్కడ ఇచ్చింది. అవి ఆలోచనాత్మకమూ, ఆసక్తికరమూ అని నాకు తోచటం వల్లనే అలా excerpts గా ఇచ్చాను.

రచయిత ప్రతిపాదించినవాటిని పూర్తిగా అర్థం చేసుకోవాలన్నా, విభేదించాలన్నా, విమర్శించాలన్నా వాటిని రాసిన సందర్భాలతో కలిపి చూడాలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు!

అందుకే రెండు, మూడు, ఐదు పాయింట్లపై మీ అభిప్రాయాల గురించి నేను చెప్పదేమీ లేదు. అలాగే రోహిణీ ప్రసాద్ గారి రచనలపై మీ అభిప్రాయాల గురించి కూడా!

మీరు పేర్కొన్న నాలుగో పాయింటు: మతాల వల్ల తలెత్తుతున్న ఇబ్బందుల వల్ల మాత్రమే అది నిరుపయోగమనీ, ప్రమాదకరమనీ రచయిత అనలేదు. మానవ ప్రస్థానంలో మతాల పుట్టుక ఎలా జరిగిందీ, ఏ పరిణామాలు సంభవించాయీ .. ఇవన్నీ చెపుతూ వాటి దుష్ఫలితాలను కూడా చెప్పారు.

మతాలు నిరుపయోగమనీ, ప్రమాదకరమనీ రచయిత అభిప్రాయపడ్డారు కాబట్టే అలా చెప్పారు. అలా చెప్పటం అశాస్త్రీయమని మీరు గానీ, ఎవరైనా కానీ భావిస్తే రచయిత వాదనలో ఇవీ లొసుగులు అంటూ విమర్శించవచ్చు. ఖండించవచ్చు!

అజ్ఞాత చెప్పారు...

/అవి సంకుచితమైనవి అనడంలో శాస్త్రీయత ఏమిటో నాకు బోధపడదు/

/కేవలం మతం వలన తలెత్తుతున్న ఇబ్బందుల ఆధారంగా, అది నిరుపయోగమనీ ప్రమాదకరమనీ నిర్ణయించడం పూర్తిగా అశాస్త్రీయం./

/ఉన్నవీ లేనివీ కల్పించుకునే ఊహశక్తి ప్రకృతిసిద్ధంగా మన మెదడుకు అలవడిన లక్షణం - అన్నంత వరకూ అది శాస్త్రీయమే. అది అవసరమా అనవసరమా అని తేల్చడం అశాస్త్రీయం/

చాలా బాగా చెప్పారు. పైన వ్యాసం చదువుతుంటే ఏదో వెలితిగా అనిపించింది. క్రిందనున్న మీ కామెంట్ చదివాక కాస్త క్లారిటీ వచ్చింది. అపెండిక్స్‌తో పోల్చడం వరకూ సరదాగా అనిపించిందిగాని శాస్త్రీయత ఏమిటో అర్థం కాలేదు. 'అవసరం లేదో/తెలియదో గాని, అవసరం లేనిది తీసేయడం అనడంలో శాస్త్రీయత అర్థం కాని విషయమే.
కామేశ్వర రావు గారు, మీ వ్యాఖ్యలు కొన్ని చదివాను, చాలా బాగా , to the point గా వుంటాయి.

కామేశ్వరరావు చెప్పారు...

వేణుగారు,

మీరు ప్రస్తావించిన విషయాలలో నాకు కనిపించిన శాస్త్రీయ/అశాస్త్రీయ విషయాలని వేరుచేసి చూపించే ప్రయత్నం చేసాను. అవి out of contextలో నేను అర్థం చేసుకున్నానని మీరనుకుంటే, మీరు పుస్తకం చదివారు కాబట్టి వాటి సరైన context తప్పకుండా చెప్పండి. అలాగే అశాస్త్రీయమని చెప్పినవాటి గురించి మీ అభిప్రాయం కూడా.

>>"మతాలు నిరుపయోగమనీ, ప్రమాదకరమనీ రచయిత అభిప్రాయపడ్డారు కాబట్టే అలా చెప్పారు. అలా చెప్పటం అశాస్త్రీయమని మీరు గానీ, ఎవరైనా కానీ భావిస్తే రచయిత వాదనలో ఇవీ లొసుగులు అంటూ విమర్శించవచ్చు. ఖండించవచ్చు!"

అవును. అది "అభిప్రాయం" అనే నేనూ అంటున్నాను. అందులో ఒకవేళ మీకు శాస్త్రీయత కనిపిస్తే (పుస్తకం ఆధారంగా), ఎందుకో వివరిస్తే నాకు ఉపయోగంగా ఉంటుంది. లేదు, దానికోసం పుస్తకమంతా చదవాలి అంటే, ఒకె.

>>ఈ ప్రపంచం తనకోసమే ఉందని మానవుడు అనుకోవటంలో అర్థం లేదనీ, భూగోళంలో తన ఉనికి కూడా లేకుండా సుదీర్ఘ కాలం గడించిందనీ చెప్పటమే ఇక్కడ భావం.

ఈ ప్రపంచం తనకోసమే అని మానవుడు అనుకోవడం, శాస్త్రీయంగా అర్థం లేనిది. నిజమే. అయితే దీని కాంటెక్స్ట్ ఏమిటి? ప్రపంచం తనకోసమే అని మానవుడు నిజంగా అనుకుంటున్నాడా? ఎక్కడ? ఎలా? ఈ సందర్భమేదీ లేకుండా దీన్ని ప్రస్తావించడంలో నాకు పెద్దగా అర్థం బోధపడలేదు. పొద్దులో "విశ్వంలో మనిషి స్థానం" అనే వ్యాసం దీనికి సంబంధించినదే. అందులో కూడా "మనిషిని ప్రపంచంలో అత్యున్నతజాతికి చెందిన ప్రాణిగా భావిస్తారు." అని మొదలుపెట్టారు. ఎవరనుకుంటారు? ఏ విషయంలో అలా భావిస్తారు? మొదలైన నేపథ్యమేదీ లేకుండా అలా మొదలుపెట్టడం అంత సమంజసంగా నాకు అనిపించదు.

మీరు అతని పుస్తకాన్ని పరిచయం చేసారు కాబట్టి, దానికి సంబంధించిన అతని వ్యాసాలు నేను చదివి ఉండబట్టి, మీరు ప్రస్తావించిన విషయాలని పేర్కొంటూ వాటి మీద నా అభిప్రాయం యిక్కడ నేను పంచుకున్నాను. అది మీకు అసందర్భంగా అనిపిస్తే నా వ్యాఖ్యలని నిరభ్యరంతరంగా తొలగించండి.

వేణు చెప్పారు...

కామేశ్వరరావు గారూ!

మీ అభిప్రాయాలు ఇక్కడ పంచుకోవటం నాకు సంతోషకరం. వీటిని చదివే పాఠకులకు కూడా ఈ చర్చ ఆసక్తికరంగా ఉంటోందనే భావిస్తున్నాను.

మీరు out of context అర్థం చేసుకున్నారని నా ఉద్దేశం కాదు. కానీ అలా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది, పుస్తకంలో అక్కడక్కడా ఉన్న అంశాలను మాత్రమే చూసి రాస్తే, మాట్లాడితే! అందుకే ‘మనుషులు చేసిన దేవుళ్ళు’ పుస్తకం మీరు చదవాలనీ, తర్వాత మీరు దానిలోని అంశాలను వివరంగా మీ కోణంలో విమర్శించాలనీ నా అభిలాష.

కామేశ్వరరావు చెప్పారు...

వేణుగారు,
తప్పక ప్రయత్నిస్తాను.

oremuna చెప్పారు...

మధుబాబు గారి పుస్తకాలు ఇప్పుడు ఈ-పుస్తకాలుగా లభిస్తున్నాయి. ఈ లింకు చూడగలరు http://kinige.com/kbrowse.php?via=author&id=20