సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, జనవరి 2012, మంగళవారం

విగ్రహాలూ.... ఆగ్రహాలూ!

కావలసింది ఆలోచన... విచక్షణ  (రోడిన్ శిల్పం ‘థింకర్’) 
శిలా విగ్రహాలో,  కాంస్య విగ్రహాలో..  అసలు ఏ విగ్రహమూ  కనపడని ఊరే మనకు కనపడదు!

తాము అభిమానించేవారు చనిపోయిందాకా ఆగకుండానే  విగ్రహాలు పెట్టేవారు కొందరైతే.. . తమ విగ్రహాలను తామే పెట్టించుకునేవారు మరికొందరు. 

సినీ తారలకు గుళ్ళు కట్టి పూజించే దురభిమానం..  కోపమొస్తే వాటిని  ధ్వంసం కూడా చేసేంతటి ఆగ్రహాభిమానం పొరుగు రాష్ట్రంలో చూస్తుంటాం!
 
రాజకీయాల విషయానికొస్తే...  విగ్రహాల ప్రతిష్ఠ అనేది  ప్రతిష్ఠకూ,  పరపతికీ  సంబంధించినదిగా,  ఓట్లు పెంచుకునే సాధనంగా భావించటం పెరగటం వల్ల ఈ విగ్రహావిష్కరణలు పెరుగుతూనే ఉన్నాయి.

కొత్త విగ్రహాలకు చోటే దొరకనంతగా ఊళ్ళల్లో  కూడళ్ళు  కిటకిటలాడటం చూస్తూనే ఉంటాం. 

రకరకాల భావజాలాల  ప్రతినిధుల  విగ్రహాలనూ , రాజకీయ నాయకుల  విగ్రహాలనూ  వాటి వ్యతిరేకులు  అవమానించటం,  ధ్వంసం చేయటం..  ప్రతిగా వారి వ్యతిరేకుల ప్రతిచర్యలూ..  ఆగ్రహావేశాలూ...   సవాళ్ళూ,  జరిగిన అవమానాన్ని ‘శుద్ధి ’ చేయటానికని  క్షీరాభిషేకాలూ ..  ఈ మధ్య ప్రతిరోజూ పేపర్లలో  చూస్తున్నాం. 

ఆ నాయకుల విగ్రహం ధ్వంసం  చేశారన్న  కోపంతో ఈ నాయకుల  విగ్రహాల  విధ్వంసం...  నిరసనగా  బంద్ .. . ఈ  బంద్ కు  వ్యతిరేకంగా ర్యాలీ...   


ఇవన్నీ విషవలయంలాగా  తయారయ్యాయి.


(ఈనాడు హైదరాబాద్ ఎడిషన్లో ఇవాళ వచ్చిన ఫొటో ఇది.) 

రాష్ట్రానికి తలనొప్పిగా మారిన కొత్త సమస్య ఇది.  ఎప్పటినుంచో  ఉండి, అప్పడప్పడూ బయటపడుతున్న పాత సమస్య కూడా!   

ఈ విగ్రహాల  అంశం మూలాలను స్పృశిస్తూ  రంగనాయకమ్మ గారు ఇవాళ ‘ఆంధ్రజ్యోతి’లో వ్యాసం రాశారు. 

ఆలోచనాత్మకమైన ఈ వ్యాసంలోని  కొన్ని భాగాలు చూడండి...

'విగ్రహ విధ్వంసం' అనే వికృతత్వం, దాని కన్నా ముందు జరిగే 'విగ్రహ ప్రతిష్ట' అనే మొదటి వికృతత్వానికి తప్పనిసరి ఫలితం! చిత్రాల లాగే విగ్రహాలు కూడా కళారూపాలే కావచ్చు. కళారూపాలకు, అవి నిలబడవలసిన స్తలాలే సవ్యమైన స్తలాలు. కళా రూపాలకు పోరాటాల పాత్రలు అప్పజెప్పకూడదు. 

మనుషుల విగ్రహాల్ని కళా రూపాలుగా భావిస్తూ, ఇళ్లల్లోనూ, మ్యూజియమ్‌లలోనూ పెట్టుకుంటే, వాటిని ఆ ఇళ్లవాళ్లూ, ఆ మ్యూజియంల వాళ్లూ, ఇష్టంతో బాధ్యతతో చూసుకుంటారు. కానీ వాటిని బహిరంగ ప్రదేశాల్లో పెడితే, వాటిని అవమానించే సదవకాశాలు వాటి వ్యతిరేకుల్ని పిల్చి అప్పగించినట్టే!


 విగ్రహాన్ని అవమానం నించి తప్పించే మార్గం, దాన్ని మరింత మరింత దృఢ తరం చెయ్యడం కాదు. మట్టితో రక్షణ లేక, కంచుతో రక్షణ దొరికితే, అది కంచు శక్తే గానీ, అది ఆ నాయకుడి శక్తి కాదు. విగ్రహం చుట్టూ తుపాకులతో కాపలాలు కాయడాలైతే, తుపాకీ లేకుండా రక్షణ దొరకని విగ్రహానికి అదే అసలైన అవమానం.

ఆహారంగా వుపయోగపడే పాలు, ఆకలితో అలమటించే నిరుపేద పిల్లల కడుపుల కోసంగానీ, విగ్రహాల అభిషేకాల కోసం కాదు. భూమిని ఉపయోగించవలసింది, నిలవనీడలేని నిరాశ్రయుల నివాసాల కోసం గానీ, బొమ్మల్ని నిలబెట్టడం కోసం కాదు.


మొత్తం వ్యాసం ఇక్కడ...



27, జనవరి 2012, శుక్రవారం

ఆబాల గోపాలాన్ని ఆకట్టుకునే... కపాల దుర్గం !


నగనగా ‘చందమామ’లాంటి పత్రిక.  పేరు ‘ప్రమోద’!

అడుగుజాడలు చందమామవే అయినపుడు దానిలో  ‘కంచుకోట’లాంటి, ‘పాతాళ దుర్గం’లాంటి  జానపద సీరియల్  ఉండాల్సిందే కదా?

దాన్ని ఇంకెవరు రాయగలరు? ‘సుప్రసిద్ధ’ అజ్క్షాత రచయిత దాసరి సుబ్రహ్మణ్యం (దా.సు.) తప్ప!

అసలు ఆయన సహకారం ఉందనే హామీ దొరికాకే కదా  ‘బొమ్మరిల్లు’ అయినా, ‘ప్రమోద’ అయినా, ‘స్నేహబాల’ అయినా మొదలయింది!

అలా ‘ప్రమోద’లో ప్రారంభ సంచిక నుంచే  మొదలైంది ... ‘కపాల దుర్గం’!



నవల పేరే  వింతగా, భయ విస్మయకరంగా  లేదూ?

కపాలాలతో  కోట..  ఎవరు, ఏ ప్రయోజనం కోసం  కట్టివుంటారు? దానిలో ఎవరుంటారు? కథ ఏమైవుంటుంది?

30 నెలలపాటు సాగిన ఈ సీరియల్  చిత్రవిచిత్ర  సంఘటనలతో  దా.సు. సమ్మోహన అక్షరజాలంతో  పాఠకులను  బాగా ఆకట్టుకుంది.

ఇదంతా 33 ఏళ్ళ కిందటి ముచ్చట!

ఈ ‘కపాల దుర్గా’న్ని అక్షరాలతో ఎవరు కట్టారన్నది  చాలా కొద్దిమందికే తెలుసు. ఆ రహస్యం అలాగే  ఉండిపోయింది, సాహిత్య ప్రపంచానికీ, పాఠకులకూ  ఏమీ తెలియకుండానే!

దాసరి సుబ్రహ్మణ్యం గారు  చనిపోయిన ఏడాదికి ‘రచన’ పత్రిక ద్వారా  అది వెలుగులోకి వచ్చింది.

ఇప్పుడు ఆయన ద్వితీయ వర్థంతి (27.1.2012) నాటికి  ‘కపాల దుర్గం’ పుస్తక రూపం ధరించి  హైదరాబాదులో ఆవిష్కరణకు సిద్ధమైంది.

చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ  సమావేశ మందిరంలో జనవరి 27 (శుక్రవారం)  సాయంత్రం  6.30 గంటలకు బాల సాహిత్య పరిషత్తు ఈ పుస్తకావిష్కరణను నిర్వహిస్తోంది. ‘ప్రమోద’ సంపాదకులు  ధనికొండ శ్రీధర్, వేమూరి సత్యనారాయణలు  అతిధులుగా పాల్గొంటారు.

*  * *

‘ప్రమోద’లో  సీరియల్ గా వచ్చినపుడు  ఈ నవల గురించి నాకు  తెలియదు.  దా.సు. గారు ఈ నవలను రాశారని తెలిశాక, ఆసక్తి పెరిగింది.

ఇన్నేళ్ళ తర్వాత  ప్రూఫుల దశలోనే   చదివే అవకాశం వచ్చింది!

జానపద కథారణ్యంలో రచయిత అలవోకగా , అనితర సాధ్యంగా  కథనాన్ని కదం తొక్కిస్తుంటే,  ఉత్కంఠభరిత ఘట్టాలు సాగుతుంటే ఒకోసారి  అక్షరదోషాలను కనిపెట్టే  పని కాసేపు పక్కనపెట్టాలనిపించేది!

మనుషుల పుర్రెలతో  కోట కట్టే మాంత్రికుడూ-
అతడి  శిష్యుడు హరహర బైరాగీ-
కుక్క మొహంతో భయంకర పక్షి శునక భేరుండం-
చిత్ర విచిత్ర  జీవులూ,  గంధర్వులూ,  కింపురుషులూ-


ఆబాల గోపాలాన్నీ, అన్ని రకాల పాఠకుల్నీ అడుగడుగునా సంభ్రమాలతో ముంచెత్తే సంఘటనలు!


 ఈ పుస్తక నేపథ్యం గురించి వివరిస్తూ  దాసరి సుబ్రహ్మణ్యం గారిని ‘అజ్ఞాత సాహిత్య ముసుగు వీరుడు’గా పోల్చారు ‘రచన’ శాయి.

‘ ఆ కాలంలో (1950-81 సంవత్సరాల్లో) వెలువడిన ‘అన్ని’ పిల్లల మాస పత్రికలలోనూ అత్యద్భుత జానపద నవలలు రాశాడు ఆ అజ్ఞాత  సాహిత్య వీరుడు. తన  సాహిత్యం అందరినీ చేరి అలరించాలన్న తపనే కాని, తనకి పేరు ప్రఖ్యాతులు రావాలనే కోరిక అణుమాత్రం లేని నిస్వార్థ కామి ఆయన! ’ అని  ‘జానపద నవలా సమ్రాట్’ సాహిత్య తత్వాన్నీ, విశిష్టతనూ వెల్లడిస్తారు.

ముందుమాటలో ‘వసుంధర’ ఈ నవల ప్రత్యేకతలనూ, రచనా విశేషాలనూ  ఎంతో చక్కగా వివరించారు.  

‘కత్తి పామై వీరుల్ని భయపెడుతుంది. కర్ర మొసలిగా మారి తోడేలును ఢీకొంటుంది. సువర్ణ కంకాళాలు సజీవమై కదులుతాయి. కుక్క తల గండభేరుండ పక్షి- మనిషిలా మాట్లాడుతుంది. ఆకాశంలో గంధర్వుడు, కింపురుషుడు - బాహాబాహీ శృంగా శృంగీ పోరాడతారు.’ 

‘కథాంశం అద్భుతం. రసం హాస్యం. సందేశం సర్వ కాలీనం, చదవరికి వినోదం, విజ్ఞానం, వికాసం’ అంటూ అందంగా అభివర్ణిస్తారు వసుంధర.

ప్రమోదలో సీరియల్ గా వచ్చినప్పటి  బొమ్మలన్నిటినీ (నలుపు తెలుపుల్లో) ఈ పుస్తకంలో ఇవ్వటం విశేషం. ఇలాంటి జానపద గాథకు ‘చిత్రా’ బొమ్మలు అమరివుంటే  మరింత గొప్పగా ఉండేది.  కానీ తమ పరిధుల్లో చిత్రకారులు  ప్రియతమ్, కిరణ్, మల్లేశ్వర్, మురళి, నీలి బాగానే బొమ్మలను వేశారు.



 


 










ముందుకు సాగే పులి,  ఘీంకరించే ఏనుగు,  ముసుగు వేసుకున్న కోటశక్తి,  గుర్రాన్ని కాళ్ళతో  పట్టుకుని ఆకాశంలోకి లేచిన శునక భేరుండం ... లాంటి   కొన్ని బొమ్మల్లో చిత్రాను అనుకరించినట్టు స్పష్టంగానే కనపడుతుంది.  ఇది యాదృచ్ఛికం కాదు,  జానపద బొమ్మలపై చిత్రా ముద్ర అలాంటిది!

ఇంతకీ ఈ నవల కథ ఏమిటి?   చదివి తెలుసుకుంటేనే మజా!

వాహిని బుక్ ట్రస్ట్ (ఫోన్: 040-27071500) ,  మంచి పుస్తకం  సంస్థలు సంయుక్తంగా ప్రచురించాయి. 254 పేజీలున్న ఈ నవల వెల  150 రూపాయిలు.