సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

27, ఫిబ్రవరి 2012, సోమవారం

కాళిదాసూ... చందమామా !

ప్పుడో 61 సంవత్సరాల క్రితం ఎంటీవీ ఆచార్య గారు  ‘చందమామ’కు వేసిన ముఖచిత్రం ఈ ఫిబ్రవరి సంచికలో పునర్ముద్రించారు. ఏకకాలంలో విభిన్నరూపులతో వేర్వేరుచోట్ల కనపడే కృష్ణ లీలలను నారదుడు ఆశ్చర్యంతో  చూసే దృశ్యమిది. 

అప్పటి సంచిక  చూడకపోయినా  ఇంటర్నెట్  పుణ్యమా అని ఆ సంచిక  పీడీఎఫ్ కాపీ రెండు మూడేళ్ళ  క్రితమే  చూడగలిగాను. మళ్ళీ ఫిబ్రవరి సంచికలో ఆ ముఖచిత్రం   దర్శనమిచ్చింది.

ఈ రెండు ముఖచిత్రాలూ ఇక్కడ చూడండి.



నదీ తీరంలో చెట్టుకింద  మైమరిచి వేణుగానం చేస్తున్న కృష్ణుడి బొమ్మ చాలా బాగుంది. 

దాన్ని విడిగా...





పాత బొమ్మలను  రంగుల పరంగా, స్పష్టత కోణంలో  ‘ఇంప్రొవైజ్ ’ చేయటం  అభినందనీయం.  అయితే పాత బొమ్మల ఒరిజినాలిటీ,  యాంటీక్ వాల్యూ ని  విస్మరించలేం.

అలనాటి  వెన్నెల
చందమామ  వైభవం  అంతా గతంలోనే  కాబట్టి  పాత కథలను చిత్రా, శంకర్ ల బొమ్మలతో  పునర్ముద్రించటం  నాలాంటి పాఠకులకు సంతోషం  కలిగిస్తుంటుంది.

పాత కథలను అప్పట్లో చదివినా చదవకపోయినా  బొమ్మల్లోని వాతావరణం, అలనాటి ఇళ్ళూ, వాకిళ్ళ , అలంకరణల  నేపథ్యం అందమైన గతంలోకి   ప్రయాణించేలా చేస్తుంది.

అందుకే ఇప్పుడు కొత్త చందమామను మిస్సయితే మంచి పాత కథలనూ, కనువిందు చేసే  బొమ్మలనూ మిస్సవాల్సివస్తుందని కొంటున్నాను!

ఫిబ్రవరి సంచికలోనే  ‘ఎవరు జూదగాడు?’ అనే కథ చిత్రా బొమ్మతో వచ్చింది.


దీన్ని చూడగానే ఇది ‘మాయా సరోవరం’ ఆరంభ సంచికకు వేసిన తొలి బొమ్మ అని అర్థమైపోయింది.

ఈ కథకు కొత్త బొమ్మను వేయించకుండా ఎప్పుడో  36 ఏళ్ళక్రితం ప్రచురించిన  సీరియల్ కు  చిత్రా  వేసిన  బొమ్మ గుర్తొచ్చి, దాన్ని  ఉపయోగించవచ్చనే  ఆలోచన ఎవరికి వచ్చిందో ! అలా గుర్తుకురావటం మెచ్చుకోదగిందే.



కానీ మెచ్చుకోలేని విషయం ఏమిటంటే... బహుళ పాఠకాదరణ పొందిన సీరియల్స్ లోని బొమ్మలను ఇలా  సందర్భం కుదిరింది కదా అని    ఎడాపెడా వాడేసెయ్యటం! ఆ సీరియల్ తో, నాటి చిత్రాలతో   పెనవేసుకునివున్న  అందమైన పాత జ్ఞాపకాలను  ఇది మసకబారుస్తుంది.


మాయా సరోవరం నాయకుడు జయశీలుడు మొదట్లో జూదరి కావొచ్చు కానీ,  జూదరుల కథ దొరికింది కదా అని ఆ బొమ్మను వెతికి పట్టుకుని,  వాడేసెయ్యటం ఏం బాగుందీ? 

చందమామలో వచ్చే ప్రతి బేతాళ కథలోనూ  చివరి బొమ్మ తెలిసిందే కదా? ‘శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కే’ బేతాళుడూ, మౌనభంగం తర్వాత జరిగిన ఈ పరిణామానికి  అవాక్కై చూసే విక్రమార్కుడూ , శ్మశానం, ఒక పక్కకు వంగిన పురాతనమైన చెట్టూ .. వీటితో  ఉండే  బొమ్మను  వందలాదిగా ఎప్పటికప్పుడు  కొత్తవి వేయించిన చరిత్ర ‘చందమామ’ది.

 ఆ పత్రికలో  ఇలా జరగటం ఆశ్చర్యంగానే ఉంది.

అయితే  ఒక్క స్వల్పలోపం లోపమే  కాదు, పట్టించుకోదగ్గది కాదని ‘కుమార సంభవం’లో కాళిదాసు  చందమామను (పోలిక చెపుతూ) వెనకేసుకొస్తాడు. ఎలా అంటే... ‘ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః ’ (చంద్రుడికి ఉన్న ఎన్నో శుభ గుణాల మధ్య  మచ్చ ఉన్నంతమాత్రాన  నింద రాలేదు కదా ).

ఆ రకంగా  చందమామ పత్రికకు కూడా ఇదేమంత  లోపం కాదని  ‘చంపి’ల్లో కొందరైనా  సమర్థించుకోవచ్చనుకోండీ!
 

12, ఫిబ్రవరి 2012, ఆదివారం

అనగనగా... తొలి 'బ్లాగు పుస్తకం'!

‘సరైన సమయంలో సముచిత నిర్ణయం’- అని వార్తా పత్రికల్లో తరచూ చదువుతుంటాం కదా?  సురవర. కామ్ సంస్థ  ‘బ్లాగు పుస్తకం’ ప్రచురణ గురించి చెప్పాలంటే కూడా ఇదే వ్యాఖ్యను ఉపయోగించొచ్చు.  

ఇంటర్నెట్ సౌకర్యం  పల్లెటూళ్ళక్కూడా వ్యాపిస్తోంది.  తెలుగు బ్లాగుల గురించి  పాఠకుల్లో ఒకప్పటి కంటే అవగాహన పెరుగుతోంది.  ఈ రకంగా కొత్త బ్లాగర్ల సంఖ్య విరివిగా పెరగటానికి అనుకూలమైన పరిస్థితులు  ఏర్పడ్డాయి.

అందుకే ఈ ‘బ్లాగు పుస్తకం’ రూపకల్పన సరైన సమయంలో జరిగిందనిపిస్తోంది. 

18 అధ్యాయాలుగా  విస్తరించిన 108 పేజీల ఈ  చిన్న పుస్తకం ఔత్సాహికులకు కరదీపికగా ఉపయోగపడేలా ఉంది.. సాంకేతిక అంశాలను  స్క్రీన్ షాట్ల సాయంతో శ్రద్ధగా వివరించటం అభినందనీయం.  బ్లాగింగులో విధి నిషేధాలు కూడా చెప్పటం వల్ల  అదనంగా విలువ సమకూరింది. 

బ్లాగింగ్ ఇప్పటికే కొనసాగిస్తున్నవారిలో చాలామంది ప్రాథమిక సెటింగ్స్ తప్ప టపాను అందంగా మలిచే మిగిలిన సెటింగ్స్ గురించి అంతగా పట్టించుకోరు.  ఆ అమరికలన్నిటినీ  ఈ పుస్తకంలో గమనించవచ్చు.  

ఇవాళ్టి ఈనాడు ఆదివారం మ్యాగజీన్ లో ఈ పుస్తకం గురించి రాసిన క్లుప్త పరిచయం ఇక్కడ -



*  *  *

‘పాత్రికేయుల్లోనే చాలామందికి తెలుగు బ్లాగుల గురించి తెలియదు; ఇక వీటి గురించి సగటు పాఠకులకేం తెలుస్తుంది?’అనేది ఒకప్పటి మాట.

ఆ పరిస్థితిలో మార్పు బాగానే వచ్చింది.

చాలా దినపత్రికల్లో బ్లాగుల పరిచయాలతో రెగ్యులర్  శీర్షికలూ,  బ్లాగర్ల టపాల విశేషాలతో కథనాలూ వెలువడ్డాయి. వెలువడుతున్నాయి.  బ్లాగుల తాజా టపాలనూ, సరికొత్త వ్యాఖ్యలనూ  ఒకే చోట చూపే  సంకలినుల గురించి కూడా ప్రత్యేక కథనాలు వచ్చాయి. 

‘ఈనాడు’లో ప్రతి సోమవారం ప్రచురితమయ్యే ఎడ్యుకేషన్ సప్లిమెంట్  ‘చదువు’ ఆర్నెల్ల క్రితమే  బ్లాగు రూపం ధరించి కొనసాగుతోంది. ‘ఈనాడు’ మినీ ఎడిషన్లలో ప్రతిరోజూ కనపడే  ‘ప్రతిభ’ పేజీ కూడా కొత్తగా బ్లాగు రూపం ధరించింది. 

ఏకంగా బ్లాగు టపాలతోనే కదా, ఆంధ్రజ్యోతి పత్రిక సండే మ్యాగజీన్ ను ఇటీవల వెలువరించింది!   టీవీల్లో కూడా బ్లాగుల గురించిన  కార్యక్రమాలు ప్రసారమవుతూనే ఉంటాయి. 

ఇవన్నీ తెలుగు బ్లాగుల ప్రాచుర్యం విస్తరిస్తోందనడానికి  ఉదాహరణలే!

ఈ నేపథ్యంలోనే వెలువడింది ఈ బ్లాగు పుస్తకం. 

పత్రికల్లో వార్తా కథనాలు ఎన్నయినా వచ్చివుండొచ్చు; టీవీ కార్యక్రమాలు కూడా కొన్ని  ప్రసారమై ఉండొచ్చు. కానీ బ్లాగుల మౌలిక అంశాలు వివరిస్తూ- కొత్త వారికి  దారి చూపిస్తూ, అవసరమైన జాగ్రత్తలు సూచిస్తూ పుస్తకం తేవటం మాత్రం వేరు.  అందుకే ఈ ప్రయత్నం అభినందనీయం!

*  *  *

ఇదే సమయంలో  కొన్ని మాటలు చెప్పదలిచాను.

ఇలాంటి  డెమో ప్రాధాన్యమున్న సమాచారయుత పుస్తకంలో విషయాన్ని తేలిగ్గా  వివరించటమే ముఖ్యం.  అయితే తెలుగు పదాలనే విధిగా వాడాలనే ఆశయం వల్ల- సాంకేతిక అంశాల వివరణ సందర్భంలో- కొత్త పాఠకులు కొంత అసౌకర్యంగా భావించే అవకాశం ఉంది. 

బ్లాగులంటే అసలేమీ తెలియనివారికీ , సగటు పాఠకులకూ  చప్పున అర్థం కాని పదజాలం వాడకుండా ఉండాల్సింది.  ఉదా: అప్రమేయం, అనుకోలు, వేగు, జాలగూళ్ళు, (పని)ముట్లు, దిగుమతి, మునుజూపు.. ఇలాంటివి.  ఈ మాటలు  మొదటిసారి వాడినచోట ఇంగ్లిష్ సమానార్థకాలను ఇవ్వకపోలేదు కానీ, తర్వాత యథేచ్ఛగా వాటిని వాడేశారు. అలా కాకుండా ప్రతిచోటా బ్రాకెట్లో  ఇంగ్లిష్ మాటను కూడా  ఇచ్చివున్నా కొంత బాగుండేది. 

అసలు ‘పరిభాష’ను (అది ఏ భాషలోనైనా)  సాధ్యమైంతవరకూ తగ్గిస్తేనే చదివేవారికి తేలిగ్గా ఉంటుంది.



ఈ పుస్తకంలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు.
*  బ్లాగు రాయడానికి  ప్రాథమిక అర్హత భావ వ్యక్తీకరణే తప్ప సాంకేతిక పరిజ్ఞానం కాదు.

* ఆర్కుట్, ఫేస్ బుక్, ప్లస్, ట్విట్టర్ ఇంకా ఎన్నెన్నో నెట్ వర్కులు! వాటికి జేజెమ్మ లాంటిది బ్లాగు!

 
* బ్లాగు అనేది ఒక రంగస్థలం, ఒక కాన్వాస్, ఒక తెల్ల కాగితం!


* ప్రతి బ్లాగుకూ చిరునామా ఉన్నట్టే ప్రతి టపాకూ శాశ్వత చిరునామా ఉంటుంది. బ్లాగులు సాంకేతికంగా ఇంత ప్రఖ్యాతి వహించడానికి ఈ టపాకుండే శాశ్వత చిరునామా కూడా ప్రముఖ పాత్ర వహించింది.

 
* సప్త వ్యసనాలను అష్ట వ్యసనాలుగా మార్చి అందులో బ్లాగింగ్ ని కూడా చేర్చాలని అప్పుడప్పడూ తెలుగు బ్లాగర్లు జోక్ చేస్తుంటారు. 


* ఒకసారి మీ వ్యాఖ్య (లేదా రాత ఏదైనా సరే) అంతర్జాలంలోకి జారిపోయిందా... ఇక దాన్ని వెనక్కి తీసుకోలేం!


*  *  *

ఎంచుకున్న విషయమే బ్లాగుల గురించి కాబట్టి సందర్భానుసారంగా కొందరు తెలుగు బ్లాగర్ల ప్రస్తావన ఈ పుస్తకంలో కనపడుతుంది.  వారు ఎవరంటే...

గృహిణులు
వలబోజు జ్యోతి
రాధిక
మాలాకుమార్
అన్నపూర్ణ
వరూధిని
శ్రీలలిత
జయ
సుభద్ర


రచయితలు
గొల్లపూడి మారుతిరావు
కస్తూరి మురళీ కృష్ణ
నిడదవోలు మాలతి
వసుంధర
సుధామ
కల్పనా రెంటాల
పి.సత్యవతి
షాడో మధుబాబు


కవులు
నిషిగంధ
రాధిక
మూలా సుబ్రహ్మణ్యం
కె.క్యూబ్ వర్మ
అక్షర మోహనం
ఏకాంతపు దిలీప్
అఫ్సర్
బీవీవీ ప్రసాద్


సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు
రవి
నాగమురళి
ఫణికుమార్ 
నామాల మురళీధర్
కృష్ణప్రియ
మేథ
రవిచంద్ర
రామ్ బొందలపాటి


మీడియా
రాము
కోవెల సంతోష్
పూడూరి రాజిరెడ్డి
స్కైబాబ
బాలు

ఇంకా...
వి.బి. సౌమ్య
దాట్ల లలిత
మధురవాణి
భమిడిపాటి ఫణిబాబు


(కవి బ్లాగర్లలో బొల్లోజు బాబా, ఎండ్లూరి సుధాకర్;  మీడియా బ్లాగర్లలో తెలకపల్లి రవి, చందమామ రాజు, రెంటాల జయదేవలను వదిలేశారేమిటి అంటారా? భలేవారే... ఇలాంటి జాబితాలు ఇచ్చినపుడు వచ్చే సమస్యే ఇది.  పుస్తకంలో ఇచ్చిన పేర్లు indicative అని అర్థం చేసుకోవాలి :)).

ఈ పుస్తకాన్ని ‘మనసులో మాట’ సుజాత,  ‘సత్యాన్వేషణ’ రహ్మాన్ గార్లు సంయుక్తంగా రాశారు.  సాంకేతిక సంపాదకునిగా వ్యవహరించినవారు ‘ఆది బ్లాగరి’ చావా కిరణ్.  తెలుగులో మొట్టమొదటి  బ్లాగు టపా రాసిన కిరణ్ ఈ  తొలి బ్లాగు పుస్తకంలో కూడా  పాత్ర వహించారన్నమాట! 

తెలుగులో బ్లాగింగ్ అనూహ్యంగా ఎలా మొదలయిందో- ఆ విశేషాలను ఆయన స్వయంగా ఈ పుస్తకంలో పంచుకుని ఉంటే ఆసక్తికరంగా ఉండేది.

తెలుగులో (ఇప్పటివరకూ)  మొత్తం ఎన్ని బ్లాగులున్నాయి, రోజుకు సగటున ఎన్నికొత్త బ్లాగులు మొదలవుతున్నాయి, వాటిలో క్రియాశీలకమైనవి ఎన్ని, ప్రతిరోజూ  ఎన్ని టపాలు రాస్తున్నారు, సంకలినులు సాంకేతికంగా ఎలా పనిచేస్తాయి... ఈ  సమాచారం కూడా ఇచ్చివుంటే ఈ పుస్తకం సమగ్రత సంతరించుకునేది.

ఇంటర్నెట్లో- బ్లాగుల్లో- ‘చోటు’అనేది  అసలు సమస్యే  కాదు. కానీ, పుస్తకంగా వచ్చినపుడు పేజీల పరిమితి విధించుకోవటం మామూలే కదా?  బహుశా ‘గ్రంథ విస్తరణ భీతి’వల్ల   కొన్నిఅంశాలకే పరిమితమయ్యారనిపిస్తోంది!

టపా రాశాక కూడా అవసరమైతే  మెరుగుపరిచి అప్ డేట్ చేస్తుంటాం కదా? అలాగే నాలాంటివారు చేసిన సూచనలన్నీ పరిశీలించి , ఆచరణ సాధ్యమైనవాటిని  రెండో ముద్రణలోనైనా  జోడిస్తే బాగుంటుంది!

ఈ పుస్తకం వివరాలు  ఈ లింకు లో...   

ఈ- పుస్తకం  కోసం చూడాల్సిన లింకు-
 http://kinige.com/kbook.php?id=545&name=Blagu+Pustakam