సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

18, డిసెంబర్ 2013, బుధవారం

మ్యాగజీన్ నడిపే కళలో తిరుగులేని ‘కమెండో’... నాగరాజు గారు!

తెలుగు సాహిత్యంలో ఒక విలక్షణమైన నవల  ‘ఊబిలో దున్న’ ఇవాళ ఈ -బుక్ గా విడుదల అయింది.   http://kinige.com/kbook.php?id=2408&name=Oobilo+Dunna

 ‘కమెండో’ ఎడిటర్ వినుకొండ నాగరాజు గారు రాశారిది.



ఏమిటీ పుస్తకం ప్రత్యేకత?
డాక్టర్  కేశవరెడ్డి  గారు  ‘అతడు అడవిని జయించాడు’ 1984లో రాశారు.  అప్పటికి 14 సంవత్సరాలముందే  1970లో నాగరాజు గారి  ‘ఊబిలో దున్న’ నేరుగా పుస్తకరూపంలో వచ్చింది.

ఈ రెండు నవలలూ ‘చైతన్య స్రవంతి’ (ఛాయల) లో రాసినవే.  రెండిటికీ  స్ఫూర్తినిచ్చిన నవల ఒకటే- అది హెమింగ్వే రాసిన  ‘The old man and the sea'.

పాఠకుల్లో చాలామందికి కేశవరెడ్డి గారి నవల తెలుసు కానీ, అంతకుముందే వచ్చిన నాగరాజు గారి నవల విషయం తెలియదు.  నవలాచరిత్రల వ్యాసాల్లో మాత్రమే ఈ  నవల ప్రస్తావన కనిపిస్తుంటుంది.  

‘ఊబిలో్ దున్న’ను మార్చి 1970లో ఎమెస్కో సంస్థ ప్రచురించింది.

ముఖచిత్రాన్ని బాపు వేశారు.


ఆరున్నర గంటలలో అసాధ్యాన్ని సాధించిన అసహాయ శూరుడి కథ ఇది. ఊబిలో కూరుకుని ప్రాణం వొదిలేస్తున్న దున్నను దాని శక్తిని దానికి తెలిసేలా చేసి ఊబినుంచి బయటకు రప్పించటానికి  ఓ  రైతన్న చేసిన ప్రయత్నం.

ప్రాణగండం నుంచి బయటపడ్డ దున్న రైతు పట్ల కృతజ్ఞత చూపిందా లేదా? ఎలా స్పందించింది?  అనేది ముగింపు.  ప్రతీకాత్మకంగా దీన్ని సమాజానికి అన్వయించటం ఉంటుంది.

పాత పుస్తకాల షాపులో...
ఈ నవల గురించి విన్న చాలాకాలం వరకూ నేను చదవనేలేదు.  రెండు దశాబ్దాల క్రితం కూడా అది అందుబాటులో లేకపోవటమే దీనికి కారణం.  చివరకు విజయవాడ పాత పుస్తకాల షాపుల్లో దొరికింది.

చదివాను.  

చాలామంది పాఠకులకు ఈ పుస్తకం గురించి తెలుసు. కానీ వాళ్ళు చదవటానికి పుస్తకాల షాపుల్లో  దొరికితేగా?

ఇన్నేళ్ల తర్వాత  నాగరాజు గారి జయంతి సందర్భంగా  ఇవాళ ‘ఊబిలో దున్న’ ఈ-బుక్ రూపంలో నవతరం పాఠకులను చేరుతోంది.


ఏడు సంవత్సరాల క్రితం...  
ఆ సాయంత్రం వానజల్లులు పడుతున్నాయి. ‘కమెండో’ నాగరాజు గారి దగ్గర్నుంచి ఫోన్ !  నన్ను రమ్మంటూ ఆహ్వానం... ‘వానొస్తోంది కదా, ఏం వెళ్తాంలే’ అనిపించి వాతావరణం సంగతి ఆయనతో ప్రస్తావించాను.

‘ఆ మాత్రం దానికే ఆగిపోవాలా?’ అనే భావంతో ‘నదీ నదాలూ అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి?’ అంటూ శ్రీశ్రీ కవిత్వ పంక్తులు ఆయన కంఠంలో ఖంగుమని మోగాయి.

నా తటపటాయింపుకు ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చింది. వెంటనే బయల్దేరి వెళ్ళాను.

దాదాపు ఏడేళ్ళ నాటి సంగతి ఇది!


నాగరాజు గారితో వ్యక్తిగతంగా నా సాన్నిహిత్యం వయసు నాలుగేళ్ళే! ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చినపుడు ఓ అభిమానిగా ఆయన్ను కలిసి, మాట్లాడాను. అంతే. అయితే ‘కమెండో’ రూపంలో ఆయనతో నాకున్న పాఠకానుబంధం 27 ఏళ్ళుగా పెనవేసుకునివుంది.

ఏ ఊళ్ళో న్యూస్ స్టాల్స్ దగ్గరకు వెళ్ళినా కమెండో కోసం నా కళ్ళు వెతికేవి. పత్రిక కనిపించగానే ఆత్మీయనేస్తం దొరికినంత సంతోషం కలిగేది.

హేతువాద దిక్సూచి
నాలో హేతువాద భావాలు స్థిరపడటానికి ‘కమెండో’, ‘వెరయిటి’ పత్రికలే కారణం. మిత్రులతో వీటిలోని వ్యాసాల గురించి చర్చించటం అలవాటుగా ఉండేది. హైస్కూలు, జూనియర్ కాలేజీల రోజుల్లో మాలాంటి పల్లెటూరి కుర్రాళ్ళకు కమెండో, వెరయిటీలే దిక్సూచిగా కనిపించేవి. మా తరానికి చెందిన ఎందరినో ఈ పత్రికలు ప్రభావితం చేశాయి.

‘వెరయిటి’లో వచ్చిన  అంతర్జాతీయ నవలల అనువాదాలు తెలుగు పాఠకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. అబ్రహాం టి. కోవూర్ వ్యాసాలు నాగరాజు గారి శైలిలో కొత్త సొబగులు దిద్దుకునేవి. అవీ, మరెన్నో కథనాలూ నాలాంటివారి హేతువాద పునాదిని పటి్ష్ఠం చేశాయి.

బెర్ముడా ట్రయాంగిల్ లాంటి అద్భుతాలూ, ‘రండి, ఈ ప్రపంచాన్ని జయిద్దాం!’ లాంటి వ్యక్తిత్వ వికాస రచనలూ సమ్మోహనపరిచేవి, జ్ఞానాన్ని ఇచ్చేవి.

ఇవన్నీ ఎడిటర్ (వినుకొండ నాగరాజు ) ఒంటిచేత్తో రాసేవారని తెలిసి, ఆశ్చర్యంతో తలమునకలయ్యేవాణ్ణి!

అమిత ప్రభావం
నాగరాజు గారి ప్రభావం నా మీద ఎంత బలంగా ఉందో రెండు విషయాలు చెప్తే చాలు. ఆయన ఎం.ఎ. ఆంగ్ల సాహిత్యం చదివారు కాబట్టి నేను డిగ్రీలో స్పెషల్ ఇంగ్లిష్ తీసుకున్నాను. ఆయన స్ఫూర్తితోనే జర్నలిజాన్ని ఇష్టపడి ఎంచుకున్నాను.

1986లో కమెండోలో ‘మేమూ చెప్పదలిచేము’ అనే శీర్షికకు ఒక లేఖ రాశాను. అమర్ వేసిన కార్టూన్ తో దాన్ని ప్రచురించినప్పుడు సంబరపడిపోయాను.

విజయవాడలో డిగ్రీ చదివేటప్పుడు న్యూస్ స్టాల్స్ లో ‘కమెండో’ (ఇంకా ఇతర పీరియాడికల్ మ్యాగజీన్స్) విక్రయించటంపై పోలీసు ఆంక్షలుండేవి. పత్రిక చదవటం కోసం తపించిపోయేవాణ్ణి. పింగళి దశరథరామ్ హత్యపై వచ్చిన సంచికను గుంటూరు నుంచి స్నేహితుడు తెచ్చి ఇస్తే చదవగలిగాను.

‘కమెండో’ లోగో ఒక పోరాట పత్రికకు తగినట్టుగా ఎంతో ఆకర్షణీయంగా నాకు కనిపిస్తుంది.

   ఒక కదలిక, చైతన్యం, వేగం స్ఫురించేలా ఉండే ఆ అక్షరాలంకరణను యథాతథంగా కాగితంపై చెక్కటం నాకు సరదాగా ఉండేది.

క్లాసిక్  కథనాలు

కమెండో ‘క్లాసిక్స్’ అని పేర్కొనదగ్గ ఆర్టికల్స్ ను చెప్పమంటే ఎన్నయినా చెప్పుకోవచ్చు. 

‘ఎవడురా ప్రకాశం పంతుల్ని తిట్టాడుట?’ వ్యాసం వ్యంగ్య రచనా వైభవానికి పరాకాష్ఠ. ఆంధ్రకేసరి ఊతపదమైన ‘ఎవడురా’ అనే మాటను ఉపయోగించటం ఒక్కటే కాదు; గ్రాంథిక శైలిలో శరపరంపరంగా విరుచుకుపడే పదగుంఫనతో సాగే కత్తిపదును లాంటి వాదన మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.

కపట మాయోపాయాల యోగుల బతుకుల నిజ స్వరూపాన్ని నిశిత హేతువాద వాదనాస్త్రంతో తుత్తునియలు చేసిన విజయగాథ ‘యోగితో తలపడ్డ ఎడిటర్’.

అక్కసుతో లాయర్  నోటీసులు పంపినవారినీ  ( ‘ఉపేంద్ర పరువు అమ్మకానికి వచ్చింది. ఖరీదు పది లక్షలు!’), చట్టసభల్లో పత్రికలోని ‘భాష’పై  ధ్వజమెత్తిన రాజకీయ నాయకులనూ నిర్భీతితో నిప్పులు చెరిగే అక్షరాలతో ఎదుర్కొన్న తీరు విభ్రాంతి గొలిపేది.

రాసే సబ్జెక్టుకు తగ్గట్టు భాష కదం తొక్కేది. మేధావి పాఠకులకు మెచ్చే రీతిలో భాషా ప్రయోగాలు ఉండేవి.

గ్రీకు, హిందూ పురాణ గాథలనూ, చారిత్రక సంఘటలనూ, ఆంగ్ల సాహితీ రసవద్ఘట్టాలనూ ఉటంకిస్తూ , వర్తమాన రాజకీయ పరిణామాలతో పోలుస్తూ  ఎడిటర్ నాగరాజు గారు చేసే వ్యాఖ్యానాలు అనితర సాధ్యం. షేక్ స్పియర్ ‘జూలియస్ సీజర్’ లోని మార్క్ ఆంటోనీ మహోపన్యాసం , క్రిస్టఫర్ మార్లో ‘డాక్టర్ ఫాస్టస్’లోని హెలెన్ వర్ణనా (‘ఈ ముఖమేనా మన కాబోయే ముఖ్యమంత్రి?’) ఈ  కోవలోవే.

మెరుపు వ్యాఖ్యలు
అనువాదం  అంత సరళంగా ఉండదనే విమర్శ ఆయన పట్ల ఉంది.  కానీ  నాలాంటివాళ్ళకు ఆ అనువాదం తీరు ముచ్చటగా అనిపించేది. ‘హెన్ పెక్ డ్ హజ్బెండ్ ను ‘పెట్టమారి మొగుడు’ గానూ, ‘మిస్ బెన్నెట్ ’ను ‘బెన్నెట్ సతి’ గానూ అనువదించి, ఒప్పించిన ఘనత ఆయనది.

కమెండోలో శీర్షికలు ఎంత పొడుగ్గా ఉన్నా ఆకట్టుకునేవి. ఒక రకమైన ఇంద్రజాలం ఆ అక్షరాల పొందికలో ఉందా అనిపిస్తుంది.

ఏ టాపిక్ రాసినా తిరుగులేని పఠనీయతతో పాఠకులను తనతో లాక్కెళ్ళే శైలి నాగరాజు గారిది. ఈ రచనాశైలి గురించి రెండు మూడు సార్లు ప్రశంసిస్తూ మాట్లాడబోతే  ‘చా... ఊరుకోండీ!’ అంటూ వారించేవారు.

కమెండోలో చిన్నచిన్న బిట్స్ కు ఆయన మెరుపుల్లాంటి వ్యాఖ్యలు జోడించి , రసగుళికల్లా మార్చేవారు. అంతెందుకు? సమాచారాన్ని తెలిపే సాధారణ కరపత్రం రాసినా ఆయన ముద్ర కనిపించేది. జనరంజకంగానూ, ప్రయోజనాత్మకంగానూ మ్యాగజీన్ ను తీర్చిదిద్దే కళలో ‘మాస్టరీ’ సాధించారాయన !

‘చైతన్యస్రవంతి’ (స్ట్రీమ్ ఆఫ్ కాన్షస్ నెస్) క్లిష్టమైన శిల్పం. దీనిలో నవలలు రాసిన కొద్దిమంది రచయితల్లో ఈయన ఒకరు. ‘ఊబిలో దున్న’తో పాటు  ‘తాగుబోతు’, ‘ఎంతదూరం’ నవలలు ఈ విధానంలో రచించినవే!

తెలుగు  పీరియాడికల్ (మ్యాగజీన్స్ ) చరిత్రలోనే కాదు;  తెలుగు నవలా చరిత్రలో కూడా నాగరాజు గారిది ఓ ప్రత్యేక స్థానం! 
 

12, నవంబర్ 2013, మంగళవారం

యక్షప్రశ్నల్లో వెలుగూ చీకటీ !


తాటిచెట్టు ప్రమాణంలో ఉన్న యక్షుడి రూపం.
(1956 అక్టోబరు చందమామ ముఖచిత్రంగా ఎంటీవీ ఆచార్య వేసిన బొమ్మ)
‘నీ యక్షప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు’ అంటూ ఈసడిస్తాం.

 ‘యక్షప్రశ్నలడిగేసి బుర్ర తినేశాడు’ అని విసుగు ప్రదర్శిస్తాం.

 ‘అవి మామూలు ప్రశ్నలా? సాక్షాత్తూ యక్ష ప్రశ్నలు!’ అని హేళనగానో,  ఆశ్చర్యంగానో  వ్యాఖ్యానిస్తాం.

ఇలా మన తెలుగువారి  దైనందిన  జీవిత సందర్భాల్లో ఈ  ప్రశ్నల ప్రస్తావన  ఓ భాగమైపోయింది.

మహాభారతంలోని పాత్ర  ఈ యక్షుడు. ఇతడికి ప్రత్యేకంగా  పేరేమీ ఉండదు. పాండవులు వనవాసం చేస్తున్న కాలంలో ఇతడు ధర్మరాజును ఆసక్తికరమైన, వైవిధ్యమైన ప్రశ్నలతో  పరీక్షిస్తాడు.

విశేషమేమిటంటే... ఇతడు నిజమైన యక్షుడు కాదు. యక్షరూపంలో ప్రశ్నలడిగాడు కాబట్టి అవి  యక్షప్రశ్నలుగా ప్రసిద్ధికెక్కాయి! 

* * *

క్షప్రశ్నలనగానే  చాలామందికి గుర్తొచ్చే ప్రశ్న-  

*  గాలి కంటే వేగం కలదేది?  ( మనసు).

తల్చుకున్నంత మాత్రానే దూరభారాల ప్రసక్తి  లేకుండా తక్షణమే అక్కడికి చేరుకోగలుగుతుంది కదా మనసు. ఎంత వాస్తవం!  తల్చుకున్నకొద్దీ ఈ ప్రశ్న... సమాధానాల లోతు, గొప్పతనం అర్థమవుతుంది.

మరో రెండు ప్రశ్నలు కూడా ప్రాచుర్యం పొందినవే.

*  నిద్రలోనూ కన్నుమూయనిది ఏది?  (చేప)
*  పుట్టాక కూడా కదలనిది ఏది?  (గుడ్డు)

* * *

సలు ఈ ప్రశ్నలు మొత్తం ఎన్ని?-  ఈ  ప్రశ్నకు సమాధానం కోసం వెతికాను.  ఒక్కో పుస్తకంలో ఒక్కో రకంగా కనిపించింది.

ఈ క్రమంలో వంద సంవత్సరాలకు పూర్వం ఈ సబ్జెక్టుపై తెలుగులో ప్రచురించిన రెండు పుస్తకాల గురించి తెలిసింది. వాటిని పరిశీలించాను.



 ఆ అన్వేషణలోంచి రూపుదిద్దుకున్న వ్యాసం నవంబరు ‘తెలుగు వెలుగు’ మాసపత్రికలో ప్రచురితమైంది.


ఆ వ్యాసం  ఇక్కడ - 
  
   Yaksha Prasnalu by Reader on Scribd












* * *

స్కూలు రోజుల్లో ఓ పాఠంగా ఈ యక్షప్రశ్నలు  చదివి అబ్బురపడ్డాను.
ఆ కాలంలోనే  ‘చందమామ’ మాసపత్రికలో ఈ ఘట్టం చదివి ఆనందించాను.

ధర్మరాజును హెచ్చరిస్తున్న అశరీరవాణి  (చిత్రకారుడు శంకర్. 1972 మార్చి చందమామ)

తర్వాతి కాలంలో  నాస్తికత్వం, హేతువాదం, మార్క్సిస్టు భావజాలాల పరిచయం తర్వాత ఈ తరహా రచనలను చూసే దృష్టి మారింది.  పురాణేతిహాసాల్లోని అభూత కల్పనలనూ, మానవాతీత శక్తుల వర్ణననూ ఆ రచనకు సంబంధించిన  రూపం (form)లో భాగంగా భావించాలని అర్థమైంది. 

మహాభారతంలో భాగమైన ఈ ప్రశ్నోత్తరాల్లో ఆ ఇతిహాస రచనా కాలపు సంఘ పరిస్థితులు కొంతమేరకు ప్రతిఫలించాయి.  పాలక /  ఉన్నతవర్గాల్లో ఉన్నవారి  దృక్కోణం కొన్ని ప్రశ్నల్లో, జవాబుల్లో ప్రస్ఫుటంగా కనపడుతుంది.

ప్రకృతి గురించి చెప్పిన వాటిల్లో లోకజ్ఞానం వెలుగూ; సమాజం గురించి చెప్పినవాటిల్లో నాటి అసమానతల చీకటీ కనపడతాయి. కొన్ని వర్గాలపై  పక్షపాతం, మరికొందరిపై వ్యతిరేకత... ఇవన్నీ గమనించవచ్చు.

నాస్తిక దూషణ!
వేదాలనూ, ధర్మశాస్త్రాలనూ నమ్మకపోతే ఎప్పటికీ నరకంలో పడివుండాల్సిందేననే హెచ్చరిక ఒక జవాబులో  ఉంది.

ఆ గ్రంథాలను నమ్మనివాళ్ళు ... 
అంటే నాస్తికులు!
ప్రాచీన భారతదేశంలోని తాత్విక చింతనకు ప్రతినిధులు! 
 
ఆ కాలంలో అలాంటివాళ్ళు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారనీ, వాళ్ళు ఇగ్నోర్ చేయదగ్గ  స్థితిలో లేరనీ -  అందుకే బెదిరించాల్సిన పరిస్థితి వచ్చిందనీ ఈ ప్రశ్నోత్తరాల ద్వారా ఊహించవచ్చు!


యక్ష ప్రశ్నల మొత్తంలో ఒక ప్రశ్నకు సమాధానం మరో ప్రశ్నలోనే  ఉన్న సందర్భం ఒక్కటే.  నాస్తికులను తీవ్రంగా దూషించిన సందర్భమది!

‘మూర్ఖుడెవరు? నాస్తికుడెవరు?’
అనే రెండు ప్రశ్నలకు కలిపి-
 ‘నాస్తికో మూర్ఖ ఉచ్యతే’( మూర్ఖుడే నాస్తికుడు)  అని ధర్మరాజు ఒకే సమాధానం చెపుతాడు.
 

ఆ రోజుల్లో నాస్తికుల ప్రాబల్యం, అధికార స్థానాల్లోనివారికి వారిపట్ల ఉన్న ద్వేషాలకు ఇది సూచిక!

ఆధ్యాత్మిక భావజాలం

నేరుగా కాకుండా గూఢార్థంతో అడిగిన ప్రశ్నలకు ఆలంకారికంగా చెప్పిన  సమాధానాల్లో ధర్మరాజు  నమ్మిన ఆధ్యాత్మిక భావజాలం ఉంది.  (యక్షుడి రూపంలో ఉన్న యమధర్మరాజు కూడా వీటితో ఏకీభవించాడు కాబట్టే అవి సరైన సమాధానాలయ్యాయి).

* సూర్యుణ్ణి ఉదయింపజేసేది ఏది?  (పరబ్రహ్మం )
* సూర్యుణ్ణి  అస్తమింపజేసేది ఏది? (ధర్మం) ఇలాంటివి....

సమాజంలో మగ సంతానానికి ఉన్న ప్రాముఖ్యం భారత రచనా కాలానికీ,  నేటికీ ఏమీ మారలేదు.  ‘అపుత్రస్య గతిర్నాస్తి’ అనే విశ్వాసం అప్పట్లో ఎంత ప్రబలంగా ఉండేదో  యక్ష ప్రశ్నల్లో  రెండు ప్రశ్నలు సాక్ష్యమిస్తాయి. 

* మనుషునికి ఆత్మ ఏది?
(పుత్రుడు) 
* సంతానం పొందేవారికి  ఏది శ్రేష్ఠం? (పుత్రుడు).

* * *
నిత్యసత్యాలు

దారిద్ర్యం గురించీ, రుణభారం గురించీ అడిగిన ప్రశ్నలు అన్ని కాలాలకూ, అందరికీ వర్తించే నిత్యసత్యాల్లాంటివి!

* చనిపోయినవాడితో ఎవరు సమానం? (దరిద్రుడు).  నిరుపేదతనం ఏ కాలంలోనైనా దుర్భరమే. 

 ‘అప్పు లేనివాడు సంతోషంగా ఉంటాడు’ అనే సమాధానం అప్పటికీ- ఎప్పటికీ  నికార్సయిన నిజం.

‘యాచన అనేది విషం’ అని నిక్కచ్చిగా చెప్పిన ధర్మరాజు దానాన్ని మాత్రం బాగా శ్లాఘిస్తాడు.

* చనిపోయేవాడికి ఏది నేస్తం? (దానం)
* కీర్తికి ముఖ్యమైన ఆశ్రయం?
(దానం)
* మానవునికి  ముఖ్యంగా కోరదగినది?
(దానం)
* దైవం ఏది?
(దానఫలం)

*  సుఖాల్లో ఉత్తమ సుఖమేది? (తృప్తి).
నిర్వివాదాంశమైన నిజం.  తృప్తి లేకపోతే సుఖమే లేదు.  అసంతృప్తికీ  సుఖానికీ చుక్కెదురు కదా!

‘జయించటానికి శక్యంకాని శత్రువు ఏది?’ అంటే ‘కోపం’ అని సమాధానం. ‘తన కోపమె తన శత్రువు’  అనీ, దాన్ని జయించటం కష్టమనీ ధర్మరాజు ద్వారా వ్యాసుడు ఎప్పుడో  చెప్పాడన్నమాట.
      
‘ప్రాణులు రోజూ చనిపోతుండటం చూస్తూ కూడా తను మాత్రం స్థిరంగా ఉంటాననుకోవటం’ ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని  ధర్మరాజు చెప్పిన సమాధానం -

మానవ స్వభావానికి పట్టిన నిలువెత్తు దర్పణం!

13, అక్టోబర్ 2013, ఆదివారం

ఎన్టీఆర్ ‘నర్తనశాల’... కమల్ ‘విశ్వరూపం’!


గొప్ప నటుల అభినయంలో  కనపడే  పోలికలు ఆసక్తికరంగా ఉంటాయి.  కమలహాసన్ నటన చూస్తుంటే  నాకు చాప్లిన్ గుర్తొస్తుంటాడు. (ఆయన్ని కమల్ తెలిసో తెలియకుండానో  అనుకరిస్తుంటాడని నా నమ్మకం).  అలాగే  ఒక్కోసారి  నవ్వుల  రాజబాబు కూడా కమల్ నటనలో తొంగిచూస్తుంటాడు!

ఈ మధ్య  ఎన్టీఆర్  ‘నర్తనశాల’ చూస్తుంటే  సన్నివేశపరంగా  కమల్ ‘విశ్వరూపం’ గుర్తొచ్చింది. 
 

 ‘నర్తనశాల’లో నాట్యాచార్యుడైన  బృహన్నల పాత్ర అర్జునుడిగా మారి శంఖం పూరించినపుడు ఎన్టీఆర్ చూపిన వైవిధ్యం అబ్బురంగా కనపడుతుంది. 

 ‘విశ్వరూపం’లో కూడా కథక్ డాన్స్ మాస్టర్ గా పరిచయమై,  నపుంసక ఛాయల్లో  హావభావాలూ, సంభాషణలూ పలికే కమల్ ఒక్కసారిగా  మెరుపు ఫైట్ చేసి హీరోయిన్ నీ, ప్రేక్షకులనూ ఆశ్చర్యంలో ముంచెత్తుతాడు!

 సినిమా ఇంకా  చూడని వారు ఆ trasformation సన్నివేశాన్ని యూ ట్యూ బ్ లో చూడొచ్చు.

స్వర్ణోత్సవ సందర్భంగా ....
ఇంతకీ ‘నర్తనశాల’ చిన్నప్పుడెప్పుడో చూశాను కానీ  ఈ మధ్య  ఈనాడు సినిమా పేజీలో కథనం రాయటం  కోసం ఒకటికి రెండు సార్లు ఆ సినిమాను  చూడటం తటస్థించింది.


ఈ  చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు

ఈ సినిమా విడుదలై యాబై ఏళ్ళయిన సందర్భంగా రాసిన ఆ కథనం ఇక్కడ-




అర్జునుడి రాకతో పరవశుడై ద్రోణుడు  ఆలపించిన తిక్కన పద్యం -  'సింగంబాకటితో గుహాంతరమునన్‌ చేడ్పాటు మైనుండి...’ సన్నివేశం చూడండి-




అర్జునుడిని బృహన్నలగా తొలిసారి  చూసినపుడు ద్రౌపది (సావిత్రి)  ముఖంలో హావభావాలు
‘సఖియా వివరించవే...’

ఈ పాట పాడుతుంటే... తొలిసారి సైరంధ్రిని చూస్తాడు కీచకుడు.
 

ఆమెపై  మరులుగొని సెగలు కక్కుతున్న మోహావేశాన్ని తన ముఖకవళికల్లో అనితర సాధ్యంగా ప్రతిఫలించిన ఎస్.వి. రంగారావు

ఉత్తర గోగ్రహణం అడ్డుకున్న  యుద్ధంలో కౌరవ సేనపై  అర్జునుడి సమ్మోహనాస్త్ర ప్రయోగం 

అతిథి పాత్రలో నాటి అందాల తార కాంచనమాల

శ్రీమద్విరాట పర్వము

‘నర్తనశాల’ చూశాక  ఎన్టీఆర్  ప్రపంచ రికార్డు ‘పంచ పాత్రలు ’ వేసిన  ‘శ్రీమద్విరాట పర్వము’ ఎలా ఉందో అని ఆసక్తి కలిగింది.

చూశాను!

‘నర్తనశాల’ విడుదలైన  పదహారు సంవత్సరాలకు ఎన్టీఆర్ చేసిన ప్రయత్నమిది.

‘నర్తనశాల’ సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, గాయకుడు (బాల మురళీ కృష్ణ) దీనికి కూడా పనిచేశారు.  ముఖ్యంగా ఎన్టీఆర్ నిర్మాణ - దర్శక బాధ్యతలతో పాటు  రెండు పాత్రల నుంచి ఐదు పాత్రలకు తన కృషిని విస్తరించారు. 

తగిన  ఫలితం రాకపోవటానికి  ఎన్నో కారణాలు...!

ద్రౌపది పాత్ర  ( సావిత్రి)   రూపకల్పనకు  ఎంతో విరుద్ధంగా ఉంది  వాణిశ్రీ ధరించిన పాత్ర.   

దర్శకుడు కమలాకర కామేశ్వరరావు  పనిచేయలేదు సరే;   సావిత్రి , ఎస్వీ రంగారావులు లేని లోటు బాగా కనపడింది.  ఎల్. విజయలక్ష్మి లేకపోవటం కూడా! 

‘నర్తనశాల’లో  బృహన్నల పాత్రపై   తీసుకున్న శ్రద్ధ,  జాగ్రత్తలు  ‘శ్రీమద్విరాటపర్వము’ లో  కనిపించలేదు.

అసలు  స్క్రిప్టులో,  పాత్రల తీరుతెన్నుల్లోనే లోపాలుండటం ఈ సినిమా పరాజయానికి ప్రధాన కారణం!

26, సెప్టెంబర్ 2013, గురువారం

చిత్రం ఒకటే ... చిత్రణ తీరు వేర్వేరు!

పురాణేతిహాసాల ఘట్టాలను చిత్రలేఖనంలో కళ్ళకు కట్టేలా  చూపించాలంటే  కళానైపుణ్యంతో పాటు ఎంతో ఊహాశక్తి కూడా  కావాల్సిందే. 

ఈ విషయంలో రవివర్మ పేరు ముందు చెప్పుకోవాలి. సరస్వతి, లక్ష్మి,  గంగావతరణం, శకుంతల, భీష్మ ప్రతిజ్ఞ,  హంస- దమయంతి,  జటాయువు వధ లాంటి బొమ్మలు ఆయన వేసినవే తర్వాతి చిత్రకారులకు ప్రామాణికంగా మారాయి.

మన తెలుగులో చందమామ మాసపత్రిక దశాబ్దాల క్రితం  మహాభారతాన్ని ధారావాహికగా ప్రచురించినపుడు వివిధ సన్నివేశాలను ఎంటీవీ ఆచార్య  ముఖచిత్రాలుగా వేశారు. అవి  పాఠకులను బాగా ఆకట్టుకున్నాయి.  తెలుగు పౌరాణిక సినిమాల్లో  వివిధ పాత్రలకు ఆయన బొమ్మలే ఒరవడి పెట్టాయంటారు. 

భీష్ముడి పాత్రకు గడ్డం ఉందో లేదో గానీ ఆయన గడ్డంతో వేశాక అది ప్రామాణికమైపోయింది. ఇక అప్పటినుంచీ సినిమాల్లో గానీ, చిత్రాల్లో గానీ గడ్డం లేని భీష్ముడిని గుర్తు పట్టలేని పరిస్థితి ఏర్పడింది.

ఆచార్య తర్వాత చందమామలోనే  శంకర్, వడ్డాది పాపయ్య (వ.పా.) లు ఈ బొమ్మల్లో ప్రతిభను చూపించారు.

ఒకే ఘట్టాన్ని వేర్వేరు చిత్రకారులు  బొమ్మగా వేస్తే ?

అలా వేసిన చిత్రాలను గమనిస్తూ  సారూప్యాలూ, తేడాలను  పరిశీలించటం నాకు ఆసక్తికరంగా ఉంటుంది,  రూపు రేఖలెలా ఉన్నాయి,  ఎవరు దేన్ని హైలైట్ చేశారు,  నేపథ్యం ఎలా ఉందీ ఇవన్నీ.  ఆ బొమ్మల  బాగోగులకు చిత్రకారుల కళా సామర్థ్యం మాత్రమే కాకుండా వారి అప్పటి మూడ్,  పెట్టిన శ్రద్ధ,  ఆ సన్నివేశంపై వారికి అప్పటికి ఉన్న పరిజ్ఞానం... ఇవన్నీ కారణమవుతాయి.   

కంసుడు... యోగ మాయ

తనను  చంపబోతుండగా పసిబిడ్డ యోగ మాయగా మారి ఆకాశంలోకి ఎగిరి కంసుణ్ణి హెచ్చరించే ఘట్టం.  దేవకి  దు:ఖం, వసుదేవుడి అనునయం, ఆశ్చర్యానందాలు, కంసుడి విభ్రాంతి, భంగపాటు చక్కగా చిత్రించారు ఎంటీవీ ఆచార్య.   కంసుడి అనుచరుడి భంగిమను ప్రత్యేకంగా గమనించాలి. ఇది చందమామలో  1949 మార్చి ముఖచిత్రంగా వచ్చిన  బొమ్మ.

 
ఇది వ.పా. బొమ్మ. నిజానికి  ఆచార్య బొమ్మకు  కొనసాగింపు వేయటం వల్ల  మాయ క్రోధాన్నీ, కంసుడి భంగపాటునూ వ.పా.  స్ఫుటంగా చిత్రించగలిగారు. మాయగా మారకముందటి పసిపాపను కూడా చూపటం ఓ విశేషం. కుడిపక్కన  ఆకాశంకేసి తలెత్తి నమస్కరిస్తున్న దేవకీ వసుదేవులను గమనించండి. 1987 అక్టోబరు ముఖచిత్రం ఇది.      

వ.పా. వేయటానికి దాదాపు వందేళ్ళ ముందు రవివర్మ ఇదే ఘట్టాన్ని 1890లో  ఇలా చిత్రించారు. ఆకాశంలోని యోగ మాయను అస్పష్టంగా చిత్రించటం ఇందులో విశేషం.

మూడు బొమ్మల్లోనూ వసుదేవుడికి గడ్డం కామన్ గా ఉంది.   

కాళియ మర్దనం

చిన్నికృష్ణుడు కాళింది మడుగులో కాళియుని పడగలపై నాట్యం చేస్తున్న సన్నివేశం.  ఎంటీవీ ఆచార్య చిత్రంలో  కాళియుని భార్యల వేడికోలు, ఒడ్డున గోపబాలురు ఆతృతతగా  చూడటం గమనించండి.

 
 
వ. పా. బొమ్మను  క్లోజప్ లో వే్యటం వల్ల నేపథ్యానికి అవకాశం లేకుండా పోయింది.  అయతే  ఈ  కృష్ణుడు.. .బాల కృష్ణుడిలాగా కాకుండా  యువక కృష్ణుడిలా ఉన్నాడు.

నరకాసుర వధ




కృష్ణుడు రథంపై  మూర్ఛపోగా సత్యభామ  బాణం ఎక్కుపెట్టటం.  నరకాసురుడు ఏనుగు అంబారీ మీద వచ్చినట్టు ఆచార్య వేశారు.

 


గరుడ వాహనం మీద యుద్ధం చేస్తున్నట్టు  వ.పా. చిత్రణ. సత్యభామ కిరీటానికి కూడా నెమలిపింఛం చూడొచ్చు.

ఏకలవ్యుడి గురుదక్షిణ



ఏకలవ్యుడు బొటనవేలు సమర్పించుకున్న దృశ్యంలో  ద్రోణాచార్యుడి వెనక లేతవయసులో ఉన్న అర్జునుడిని చూశారా?  ఆశ్రమ పరిసరాలు అందంగా వేశారు ఆచార్య.  జింకచర్మం ధరించి  నలుపురంగుతో  ఉన్న ఏకలవ్యుడి బొమ్మ సహజంగా ఉంది.


ద్రోణుడి  ప్రతిమను తల వరకే కాకుండా సంపూర్ణంగా  వేశారు వ.పా.  ఏకలవ్యుడి త్యాగాన్ని కళ్ళు విప్పార్చి ఆశ్చర్యంగా  చూస్తున్నాడు కదూ అర్జునుడు!  రెండు బొమ్మల్లోనూ ద్రోణుడికి గడ్డం మీసాలు లేవు.

భీష్ముడిపై చక్రాయుధం 



కురుక్షేత్ర యుద్ధరంగంలో ఆవేశపడిపోయి,  తన ప్రతిజ్ఞ మరచి భీష్మునిపై చక్రాయుధం ప్రయోగించబోతున్న శ్రీకృష్ణుడు.  నేపథ్యంలో యుద్ధ బీభత్సాన్ని కూడా  చిత్రించారు ఆచార్య.




వ.పా. బొమ్మలో భీష్ముడూ,  ఆచార్య బొమ్మలో అర్జునుడూ  మోకరిల్లినట్టు చిత్రితమైంది.

లంకిణి- హనుమ



లంకలో ప్రవేశించిన హనుమంతుడికి లంకిణి  ఎదురవటం.   లంకిణి భీకరాకారాన్ని ఆచార్య  చక్కగా  చిత్రించారు. జూన్ 1948 చందమామ ముఖచిత్రం ఇది. 
 


వ.పా. తన బొమ్మలో హనుమంతుణ్ణీ,  భవనాలనూ  అందంగా చిత్రించారు. డిసెంబరు 1963 చందమామ ముఖచిత్రం ఇది.

జటాయువు  వధ



 



రవి వర్మ గీసిన ఈ రెండు  చిత్రాలూ  ఎంత గొప్పగా ఉన్నాయో కదా?  రావణుడి క్రూరమైన నవ్వూ,  భయపడిన  సీత  చేతులతో  మొహం కప్పుకోవటం చూశారా?

ఇదే ఘట్టాన్ని ఎంటీవీ ఆచార్య ఇలా చిత్రించారు.


ఇక చందమామ చిత్రకారుడే  శంకర్ (రెండు బొమ్మలు) ఎలా చిత్రించారో  కూడా చూడండి.
 

  



(వీటిలో ఎక్కువ బొమ్మలు చందమామ నుంచీ, వారు ప్రచురించిన  ఆర్ట్ బుక్ నుంచీ తీసుకున్నవి.  ప్రచురణకర్తలకు  కృతజ్ఞతలు)

28, ఆగస్టు 2013, బుధవారం

శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ తొలి మెరుపు!

యాబై తొమ్మిదేళ్ళ క్రితం విడుదలైన  ‘ఇద్దరు పెళ్ళాలు’ సినిమాలోని ఓ  డ్రీమ్ సాంగ్ లో ఎన్టీ రామారావు  శ్రీకృష్ణుడి వేషంలో తొలిసారి మెరిశారు. 

తర్వాత  రెండు సంవత్సరాలకు ‘సొంత వూరు’లో కూడా అదే గెటప్ లో కనపడ్డారు.

మరుసటి ఏడాది విడుదలైంది-  ‘మాయాబజార్’!   అమాయకత్వం, చిలిపిదనం, లేతదనం కలిసిన  అసలు సిసలు  వెండితెర  కృష్ణుడు ఆవిర్భవించాడు!  

ఈ పాత్ర తర్వాత ఎన్నిసార్లు వేసినా  ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపుతూ , పాత్ర పోషణకు కొత్తందాలు అద్దారు.

పెరిగిన వయసు ప్రభావం అంతగా కనపడనీయకుండా ప్రేక్షకులను అన్నిసార్లూ మెప్పించగలగటం అసాధారణం.

శ్రీకృష్ణ పాత్రపై ఎన్టీఆర్ సాధించిన సాధికారతకూ, అసమాన నటనా వైదుష్యానికీ ఇది తార్కాణం!  

ఈ విశేషాలతో  ఇవాళ ‘ఈనాడు సినిమా పేజీ’లో  నేనో  వ్యాసం రాశాను. 



ఈ కథనంలో ప్రస్తావించినట్టు-  శ్రీకృష్ణ పాత్రలో ఎన్టీఆర్  తొలిసారి  ‘ఇద్దరు పెళ్ళాలు’ సినిమా పాటలో  ఇలా కనపడ్డారు.


మూడేళ్ళ తర్వాత   ‘మాయాబజార్’లో.... చిన్నారి శశిరేఖతో!




ఘంటసాల, లీలలు  శ్రావ్యంగా పాడిన ‘మదిలో హాయీ.. ’ పాటను ఇక్కడ   వీక్షించండి-  వేణువూదుతూ సగం కిరీటంతో  దర్శనమిస్తాడు ఎన్టీఆర్.



                                                 * * *

‘ఇద్దరు పెళ్ళాలు’ వీడియో సీడీ ...  ఓల్గా వీడియోస్ ద్వారా  ఇప్పడు మార్కెట్లో దొరుకుతోంది.

టైటిల్ ని బట్టి  ఈ సినిమాలో  హీరో  ఎన్టీఆర్ కు  ఇద్దరు హీరోయిన్లుంటారని ఎవరైనా అనుకుంటారు.  ఓల్గా వీడియోస్ (పబ్లిసిటీ విభాగం)  వారు కూడా అలాగే అనుకున్నారు. 

కానీ సినిమాలో హీరోయిన్ జమున మాత్రమే ఉంది.  రెండో హీరోయిన్ ఎక్కడా  కనపడలేదు.  (సినిమాను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి చూసి వుంటారు). 

మరి సినిమా టైటిల్ ని  ‘జస్టిఫై చేయటం’ ఎలాగో వాళ్ళకు పాలుపోలేదు.  (ఆ బాధ్యత ఏదో  తమమీద ఉన్నట్టు వాళ్ళు ఫీలవటం ఎందుకో!)

చివరికి  ఏం చేశారంటే... జమున బొమ్మనే  వేరేది  తీసుకున్నారు.  ఎన్టీఆర్ బొమ్మకు  రెండో పక్క పెట్టేశారు.  ఇద్దరు జమునల మధ్య ఎన్టీఆర్! 

ఇలా సీడీ కవర్ తయారుచేసి సీడీ విడుదల చేసేశారు. :)

 ఇంతకీ  సినిమాలో ఇద్దరు భార్యలున్నది  ఎన్టీఆర్ కు కాదు;  ఆయన  తండ్రి  పాత్ర  వేసిన  సీఎస్ ఆర్ కు! 

హీరో తండ్రి కోణంలో కూడా  సినిమా టైటిల్ ఉండొచ్చనేది  ఇప్పటి తరానికి అనూహ్యమన్నమాట!   

* * *

రోసారి సినీ శ్రీకృష్ణుడి  దగ్గరకు వద్దాం.

ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్  ఈశ్వర్  చిత్రించిన ఈ వర్ణచిత్రం  చూడండి -




గోపికలు చుట్టూ చేరివుండటం  (‘గోపస్త్రీ పరివేష్ఠితో’)  మినహాయిస్తే...   ‘కస్తూరీ తిలకం లలాట ఫలకే...’ వర్ణనలో  ఉన్నట్టే ఉన్నాడు కదూ!  ముక్కు మీద ముత్యమేదీ  (‘నాసాగ్రే నవ మౌక్తికం ’) లేకపోయినా ఈ కృష్ణుడి రూపానికేమీ లోటు రాలేదనుకోండీ.  (అసలది  లేకపోవటమే ఇంకా బాగుంది) .

సరే... 
కొంచెం
క్లోజప్ పెంచి
ఈ బొమ్మను దగ్గరగా  చూద్దాం!






ఆ ప్రసన్నగంభీర వదనం,  లోతైన చూపు ... ఇప్పుడింకా  స్పష్టంగా,  మరింత ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి కదూ? 

( సమాచారం,  ఛాయాచిత్రాల  సేకరణకు సహకరించిన శ్యామ్ నారాయణ గారికి కృతజ్ఞతలతో...)

30, జులై 2013, మంగళవారం

కనపడని హింసపై విమల-నిర్మల కవితాస్త్రాలు

 
సినీ నటి నందితాదాస్ ఓ క్యాంపెయిన్ నిర్వహిస్తోందని  చదివేవుంటారు.

‘90 శాతం మంది నలుపు రంగులో ఉండే దేశంలో పుట్టి -  తెల్లగా లేనందుకు ఆత్మన్యూనతతో బాధపడటం విచారకరం’ అనేది ఈ ప్రచార కార్యక్రమం!

నలుపులోనూ అందం ఉందని ప్రచారం చేయటం ఈ  క్యాంపెయిన్ లక్ష్యం. కానీ  అందం ( నలుపు రంగు అయితేనేం... )  అందరూ  పట్టించుకోవాల్సిన విషయమేనని ఈ కార్యక్రమం పరోక్షంగా చెపుతున్నట్టే !

అందంగా లేననే భావన- ఆత్మన్యూనతను అమితంగా పెంచివేసే ధోరణి గత రెండు దశాబ్దాల నుంచీ బాగా పెరిగిపోతోంది. 
  
చూడచక్కగా కనపడేలా చేయటానికి సాయం చేస్తానని హామీలిచ్చే  సౌందర్య సాధనాల, ఉత్పత్తుల మాయాజాలమే ఎక్కడ చూసినా... పత్రిక తెరిచినా, టీవీ పెట్టినా, నెట్ చూసినా! 

ఆయుధాలూ... సాధనాలూ

మారణాయుధాలు తయారుచేసే కంపెనీలు వాటి వినియోగం పెరగటం కోసం దేశాల మధ్య యుద్ధాలను ప్రోత్సహిస్తాయి. యుద్ధం చేసే రెండు దేశాలకూ ఆయుధాలను సరఫరా చేస్తాయి. ప్రపంచ శాంతి ఆ కంపెనీలకు మనశ్శాంతిని ఇవ్వదు!

అలాగే -

సౌందర్య సాధనాలు తయారుచేసే సంస్థలకు అందం గురించి జనం ఉదాసీనంగా ఉంటేనో, ఒక మాదిరిగా మాత్రమే  పట్టించుకుంటేనో నచ్చదు గాక నచ్చదు.  తమ సరుకు  వినియోగం పెరగటం కోసం అవి ప్రజల్లో అందం పట్ల  మోజును ప్రోత్సహిస్తాయి. 

వ్యూహాత్మకంగా కొన్ని దేశాల యువతులకే అందాల కిరీటాలు కట్టబెడతాయి. ‘మిస్ యూనివర్స్ మీ దేశం అమ్మాయికే దక్కింది’, ‘  మిస్ వర్ ల్డ్  మీ దేశం యువతే’ అంటూ  అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలకు ఎరలు వేస్తాయి. ఆ రకంగా  తమ ఉత్పత్తులను భారీగా అమ్ముకుంటుంటాయి. 

(అందాల కిరీటాలు దక్కాక మనదేశంలో సౌందర్య ఉత్పత్తులు ఎంత శాతం అమాంతం పెరిగిపోయాయో గూగిలించి చూడండి).

ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేసయినా సరే,  అందం గురించిన మితిమీరిన వ్యామోహాన్ని పెంచిపోషించటం ఈ సంస్కృతి ముఖ్య లక్షణం.  జీరో సైజ్ మోజుతో అమ్మాయిలెందరో  అనొరెక్సియా వ్యాధిబారిన పడ్డారు.  సినీ తారలను యువత గుడ్డిగా అనుకరించటాన్ని ప్రశంసిస్తూ, హైలైట్ చేస్తూ  ‘నయా ట్రెండ్’ అంటూ వ్యాపార పత్రికలు ఇలాంటివాటికి వంతపాడుతూ ఆ సంస్కృతిలోనే ఐచ్ఛికంగా భాగమైపోతుంటాయి.

మగవాళ్ళను కూడా ఈ వలలోకి  లాగటంలో ఈ సంస్కృతి ఇప్పటికే ఎంతో కొంత విజయం సాధించింది!  

* * *

చిరస్మరణీయ కవిత
విమల గారి ‘సౌందర్యాత్మక హింస’ కవిత 20 సంవత్సరాల కిందట మొదటిసారి  చదివివుంటాను.  అందాల పోటీల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ గుర్తొచ్చే కవిత ఇది. 

కవయిత్రి  వర్ణించే  ఈ హింస ప్రత్యేకత ఏమిటంటే- ఇది బయటకి  తెలియదు.  దాన్ని అనుభవించేవారిలో కూడా చాలామందికి స్పష్టం కాని హింస ఇది. 

స్త్రీల అందాల ప్రదర్శన పోటీలు వారి ఆత్మగౌరవానికి వ్యతిరేకం కాబట్టి వాటిని వ్యతిరేకించాలని ప్రబోధించే కవిత కాదిది. పోటీల్లో నెగ్గటం కోసం చేసే  ఆ సౌందర్య సాధన వెనక ఆ స్త్రీలు తెలిసీ- తెలియకా అనుభవించే దు:ఖాన్నీ, నిస్సహాయతనూ  సహానుభూతితో పంచుకుని రాసిన కవిత ఇది.

ఆలోచనలు రేపే  శక్తిమంతమైన వ్యక్తీకరణలు ఈ కవితను చిరస్మరణీయం చేశాయి.

మొదటి పాదమే సూటిగా  విషయాన్ని చెప్పేస్తుంది.

‘మనమంటే 34, 24, 35 కొలతలమైన చోట
మొటిమలు మొలవడం, జుట్టురాలడం
నడుం సన్నగా  లేకపోవడమే
మన నిరంతరాందోళనలైన చోట’-


ఆలోచనల్లో, మాటల్లో, నడకలో,  నవ్వులో అసహజంగా  సౌందర్య స్పృహ తప్ప మరేదీ మిగలని అవస్థ ఎంతటి హింసాపూరితమో కదా!

‘‘అంకెల మధ్య కుదించుకుని, కుదించుకుని
నవ్వినా, నడిచినా, మాట్లాడినా, కూర్చున్నా
ఒక కృత్రిమ సౌందర్యం కై వెంపర్లాడుతూ…
మూసలోకి వొదిగి, వొదిగి…
ఈ ‘స్వచ్ఛంద’ సౌందర్య హింస
మన సహజాతమని నమ్ముతూ…’’



అలంకారం చేసుకున్న స్త్రీని  చూస్తే... కవయిత్రికి  ‘పంటచేలో నిలబెట్టిన దిష్టిబొమ్మ’, ‘ఈజిప్షియన్ మమ్మీ’ గుర్తొచ్చాయి.  కొత్తగా చదివేవారికి ఈ పోలికలు విభ్రాంతిని కలిగిస్తే ఆశ్చర్యమేమీ లేదు.

‘అందం పోటీయైన చోట
అందం ‘సరుకైన’చోట
అందాల వ్యాపారాల్ని ద్వేషిద్దాం!
మన మనుగడకు అందం అనివార్యమైన చోట
ఈ జీవితాన్నే ద్వేషిద్దాం! ’


మనుగడకు అందం తప్పనిసరి అయిన దుర్భర స్థితిలో ‘ఈ జీవితాన్నే ద్వేషిద్దాం’ అనటంలో నిస్సహాయత పరాకాష్టకు చేరి  వ్యక్తీకరణ కూడా  పదునెక్కింది.

అక్కడితో కవిత ముగిసివుంటే చాలా బాగుండేది.

కానీ తర్వాత రాసింది  ప్రబోధాత్మకమై (దానిలో మంచి లేదని కాదు)  కాసింత ‘కళ’ తప్పినట్టు నాకు  అనిపించింది . 

‘నిరంతర శ్రమలో పెదవులు పగిలి, చేతులు కాయలు కాచి,
రేగిన జుట్టుతో, అలసిన కళ్ళతో, చింకిపాతలతో
అందాన్ని ‘ఖరీదు చేయలేని’ కోట్లాది మంది స్త్రీల
‘అందహీనత’ని మనం ప్రేమిద్దాం!’



ఇది చదివినపుడు తోడికోడళ్ళు (1957) సినిమాలో ఆత్రేయ పాట-  ‘కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడి చాన’ గుర్తొచ్చింది.

‘గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా 
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు ’


అయితే  ముగింపు  పాదాలు ఆశావహంగా,  నినాదప్రాయంగా కనిపించినా వాటిలో కవిత్వాంశ లేకపోలేదు. 

‘అందరికోసం అద్భుత సౌందర్యాన్ని
సహజసౌందర్య భరిత ప్రపంచాన్నీ సృష్టిద్దాం!’


ముసిముసి ఏడ్పు

ఈ కవిత వెలువడిన 8 ఏళ్ళకు కొండేపూడి నిర్మల గారి ‘మల్టీ నేషనల్ ముద్దు’ ఇదే సబ్జెక్టుతో  వచ్చింది.  దీన్ని విమల కవితకు కొనసాగింపుగా చెప్పుకోవచ్చు.

విమల కవిత ‘మనం’ అంటూ సాగితే... నిర్మల కవిత ‘నేను’ అని కొనసాగుతుంది.

అందాల పోటీల్లోని క్యాట్ వాక్ ని వర్ణించిన తీరు చూడండి-

 ‘మరిగే పాలలో మూతిపెట్టి
ముసిముసిగా ఏడ్చుకునే క్యాట్ వాక్ స్ఫూర్తిగా
అందాల గారడీ’



సౌందర్య స్పృహ మితిమీరితే  సహజత్వం కరిగిపోయి  కృత్రిమత్వంలోకి ఎలా మారిపోతుందో చూడండి-

‘రోజువారీ చిక్ రోజ్ అద్దకాల మధ్య
సిగ్గు ఏ రంగులో ఉండాలో నా బుగ్గలు మర్చిపోయాయి’


అత్యాధునిక  సౌందర్య చికిత్సల మాయలేళ్ళ ప్రభావాన్ని  కూడా విస్మరించని  ఈ కవితలో ఆకట్టుకునే కొన్ని  వ్యక్తీకరణలు గమనించండి-

‘కావలసిన కొలతల బెంగ
నాన్ సర్జికల్ గా కుట్టిపోతుంది

సిలికాన్ ఇంప్లాంట్స్ కింద
బిక్క చచ్చిపోయిన గుండెచప్పుడు కంటే హింసగా’


ముగింపుకొచ్చేసరికి భావ తీవ్రత, వ్యక్తీకరణ పదునూ కూడా  రెట్టింపయినట్టు అనిపిస్తాయి. 


‘పెడిక్యూర్ అనుకుంటూ
పరాయి మార్కెట్ పాదసేవకు
చేతులిచ్చిన దాసిని నేనే

చెక్కిన అవయవాల సమూహంతో
చుక్కల కెగిసిన దేవేరిని నేనే’


అని ప్రకటించాక వచ్చే ఈ పాదం  చూడండి-

‘డీకంపోజవకుండా రసాయనాలు దట్టించిన
తలక్రిందుల కల ఈజిప్షియన్ మమ్మీని నేనే’


అందాల పోటీల వెనకున్న మార్కెట్ మాయాజాలాన్ని  ప్రతిభావంతంగా అక్షరబద్ధం చేసిన ఈ రెండు కవితలనూ యథాతథంగా ఇక్కడ scribd లో  చదువుకోవచ్చు.  
 





ఈ రెండు కవితలూ నిజానికి  పేరాల్లేకుండా ఒక్కోటీ  ఏక ఖండంగా  ఉంటాయి. కానీ భావ స్పష్టత కోసం  పేరాలుగా విభజించాను. 

విమల కవిత ‘అడవి ఉప్పొంగిన రాత్రి’ కవితా సంకలనంలో ఉంది.

నిర్మల కవితను ఆమె ఇటీవల విడుదల చేసిన ‘కొండేపూడి నిర్మల కవిత్వం’ సంపుటిలో చూడొచ్చు.  ఆన్ లైన్ పుస్తకం కోసం కినిగె లింకు- http://kinige.com/kbook.php?id=1178&name=Kondepudi+Nirmala+Kavitvam

ఆడవాళ్ళయినా,  మగవాళ్ళయినా అందంగా కనపడాలనుకోవటంలో దోషం కానీ,  అసహజం కానీ  ఉండదు.  కానీ  ‘అతి సర్వత్ర వర్జయేత్’అనేది  సౌందర్య పోషణకైనా, అలంకరణకైనా వర్తిస్తుంది.

‘అందంగా లేనా?, అస్సలేం బాలేనా?’ అనే ప్రశ్న ఇప్పుడు మగవాళ్ళను కూడా ఎంతో కొంత  వేధిస్తోంది.  మరి ‘సౌందర్యాత్మక హింస’ మేల్ వర్షన్ రాబోయే కాలంలో చూస్తామా? 

18, జూన్ 2013, మంగళవారం

పాము కాటేసింది... మనిషి మన్నించాడు!



ప్రతిరోజూ ఎన్నో వార్తలు చదువుతుంటాం.  అన్నీ గుర్తుండిపోవు; మనసును తాకలేవు.

కానీ  ఇవాళ  ఈనాడు  పత్రిక  హైదరాబాద్ సిటీ ఎడిషన్లో వచ్చిన ఓ వార్త... అసాధారణంగా అనిపించింది.  మరిచిపోతున్న మానవత్వపు పరిమళాన్ని గుర్తు చేసింది.
 
* * *

ఎవరికో  సాయం చేయడానికి వెళ్ళి పాముకాటుతో  చనిపోయాడు కొడుకు. ఆ కొడుకు ప్రాణం తీసిన పాము ఇంకా కళ్లముందే సజీవంగా ఉంది !

ఎవరైనా ఏం చేస్తారు?  కోపంతో చంపేస్తారు కదూ?!

కానీ అనంతరాములు అలా చేయలేదు.

చెట్టంత కొడుకు పోయిన గుండె కోత,  కొడుకు పోయిన దు:ఖంతో తన భార్య,  భర్తను కోల్పోయిన  కోడలి శోకం, మూడేళ్ళ మనవరాలు  తండ్రి గురించి అమాయకంగా తీస్తున్న ఆరా -  వీటిని దిగమింగేశారు.  

ఆ పాముకు ఎలాంటి అపకారమూ తలపెట్టలేదు. కొడుకు శవం ఇంకా ఇంటికి రానేలేదు.  పామును సంచిలో పెట్టుకుని  భద్రంగా అడవిలోకి తీసుకువెళ్ళారు. స్వేచ్ఛగా  వదిలేశారు! 

‘పాముల ద్వారా మనుషులకూ, మనుషుల ద్వారా  పాములకూ ఎలాంటి హానీ కలగకుండా చూస్తా’నని తన గురువుకు ఎప్పుడో ఇచ్చిన  వాగ్దానం ఇలా నెరవేర్చుకున్నారు !

ఆ పాము ఆత్మరక్షణకోసమే శ్రీనివాస్ ను  కాటేసివుంటుంది. నిజమే! అది తెలిసినప్పటికీ  పుత్రశోకం భరిస్తూనే -  చూస్తూ చూస్తూ ఆ పాముకు ప్రాణభిక్ష పెట్టటం మామూలు విషయమైతే కాదు. 

ఈనాడు హైదరాబాద్ సిటీ ఎడిషన్లో  వారం రోజుల క్రితం వచ్చిన వార్త,  దానికి ఫాలో అప్ గా ఇవాళ వచ్చిన వార్తా ఎవరి మనసులనైనా  ద్రవింపజేస్తాయి.  

* * *

మొదటి వార్తను  క్లుప్తం చేసి,  ఇక్కడ  రాస్తున్నాను. 

ఇవాళ  హైదరాబాద్ ఎడిషన్లో వచ్చిన రెండో వార్త ను  యథాతథంగా... ఇదే టపాలో పెట్టిన  scribd లో చూడండి. 

* * *

ది రోజుల క్రితం ...
ఆదివారం రాత్రి -

హైదరాబాద్  గండిమైసమ్మ చౌరస్తాలోని ప్లాస్టిక్ పరిశ్రమలోకి పాము వచ్చింది.  అక్కడివాళ్ళు వెంటనే దాన్ని  పట్టుకోవటం కోసం  మాదాసు అనంతరాములు అనే వ్యక్తికి కబురు పంపారు. జగద్గిరి గుట్ట దగ్గర్లోని దేవమ్మబస్తీ లో ఆయన నివసిస్తుంటారు.

ఇలా జనావాసాల్లోకి పాములు వస్తే వాటిని పట్టుకుని  ఊరికి దూరంగా వదిలివేసే పనిని ఆయన ఉచితంగా 20 సంవత్సరాలుగా చేస్తున్నారు. 

ఫోన్ వచ్చిన సమయంలో అనంతరాములు  వేరే చోటికి వెళ్ళారు ఆయన. దీంతో ఆయన పెద్దకొడుకు శ్రీనివాస్ (32) కు ఫోన్ వెళ్ళింది.  తండ్రి బదులు తనే బయల్దేరి వెళ్ళారు శ్రీనివాస్. పామును పట్టుకున్నారు.

కానీ సంచిలో వేయబోతుండగా శ్రీనివాస్ ను పాము కాటేసింది. చేతివేళ్ళు పాము నోట్లో కరుచుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా విడిపించుకోవటం సాధ్యం కాలేదు.

చేతికి కరుచుకున్న పాముతోనే షాపూర్ నగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి వరకూ  వచ్చారు. అక్కడికి వచ్చిన మిత్రులూ, బంధువులూ ఎలాగో పాము కోరల నుంచి శ్రీనివాస్ ను విడదీశారు.

అప్పటికే - పాము విషం ఎక్కి,  అపస్మారక స్థితికి చేరుకున్న శ్రీనివాస్ ప్రాణాలు విడిచారు!

* * *     



26, మే 2013, ఆదివారం

ఎన్టీఆర్- గురజాడ ... గోపీచంద్- గంగాధర్!



న్టీఆర్ అంటే జూనియర్ కాదనీ;  గోపీచంద్-  హీరో కాదూ- రచయిత అనీ; గంగాధర్ అంటే గాయకుడు కాదూ- చిత్రకారుడనీ ముందే చెప్పేస్తున్నాను. 
  
అయినా,  ఇదేదో పొంతన లేని టైటిల్ లాగా కనపడితే ఆశ్చర్యమేమీ లేదు. 

గురజాడ కన్యాశుల్కంలో ఎన్టీఆర్ నటించాడు. ఇక ఎన్టీఆర్ సొంత సినిమాల పబ్లిసిటీకి  ఆస్థాన ఆర్టిస్టు గంగాధర్. మరి దర్శకుడు కూడా అయిన రచయిత గోపీచంద్ కూ, ఎన్టీఆర్ కూ సంబంధమేమైనా ఉందా అనే  సందేహం వస్తోందా? 

ఎన్టీఆర్ కు మిగతావారితో ఉన్న సంబంధం గురించి  ఇక్కడ చెప్పబోవటం లేదు. ఈ నలుగురినీ కలిపే ప్రత్యేక అంశం ఒకటుంది.

అదే ఈ టపా కథ!

ఇంకా చెప్పాలంటే ఈ జాబితాలో చాసో, శ్రీశ్రీ, బాపులను కూడా కలిపేసుకోవచ్చు!

* * *

భీమసేనుడి భీకర శపథం

‘పాండవ వనవాసము’ చూశారా? 1965 లో వచ్చిన సినిమా. ఇందులో ‘ధారుణి రాజ్యసంపద..’పద్యం పాడుతూ భీముడి పాత్రధారి ఎన్.టి. రామారావు చూపే రౌద్ర, వీర రసాలు గగుర్పాటు కలిగించేలా ఉంటాయి.

మాయాజూదంలో పరాజితుడవుతాడు  ధర్మరాజు. తననూ, సోదరులనూ, ద్రౌపదినీ కూడా పణంగా ఒడ్డి ఓడిపోతాడు. అప్పుడు నిండు సభకు ద్రౌపదిని రప్పిస్తాడు దుర్యోధనుడు.  దుశ్శాసనుడి హేళనాపూర్వకమైన మాటలకు వంతపాడుతూ, తన తొడ చూపి ఆమెను దానిమీద కూర్చోమన్నట్టుగా దుర్యోధనుడు సైగ చేసినపుడు... ద్రౌపది అవమానాగ్నితో  దహించుకుపోతూ తల్లడిల్లిపోతున్నపుడు... 

తోకతొక్కిన తాచుపాములా లేస్తాడు భీముడు, క్రోధంతో. దుర్యోధనుడి తొడలు విరగ్గొడతాననీ, దుశ్శాసనుణ్ణి భీకరంగా సంహరిస్తాననీ శపథం చేస్తాడు.

ఈ సందర్భంగా నన్నయ రాసిన  ‘ధారుణి రాజ్య సంపద మదంబున..’ , ‘కురువృద్ధుల్ గురువృద్ధ  భాంధవులనేకుల్ జూచుచుండన్ ...’ అనే రెండు పద్యాలను ‘పాండవ వనవాసము’ సినిమాలో ఉపయోగించారు. 

రౌద్రాన్నీ, వీరాన్నీ ఘంటసాల అనుపమానంగా తన గళంలో పలికిస్తాడు. దీటుగా ఎన్.టి.ఆర్. హావభావాలు శిఖరాగ్రస్థాయిలో ప్రదర్శిస్తాడు.

చూడండి... ఈ చిన్న వీడియో. దీని నిడివి రెండు నిమిషాల కంటే కూడా తక్కువే.  



‘ధారుణి రాజ్య సంపద..’ పద్యం ప్రారంభమయ్యేటపుడు గమనించండి- తలపైకి ఎత్తి చూస్తూ...  కోపంతో మండిపడుతూ లేచిన భీముడి మొహం సైడ్ వ్యూలో కనపడుతుంది.




 ఇదో గొప్ప షాట్!

సన్నివేశం అంతగా పండటానికి ఆ షాట్ చక్కటి ప్రాతిపదిక ఏర్పరిచింది.

ఇది ఛాయాగ్రాహకుడు సి. నాగేశ్వరరావు ఆలోచనో, దర్శకుడు కమలాకర కామేశ్వరరావు ఆలోచనో గానీ... (సహాయకుల ఆలోచన కూడా కావొచ్చనుకోండీ..) ఈ ఘట్టం చిరస్మరణీయంగా నిలిచిపోయింది.

అంతకుముందు నాలుగేళ్ళ క్రితమే (1961) ‘సీతారామ కల్యాణం’ వచ్చింది. ఈ సినిమాలో
దాదాపు అలాంటి posture తో రావణ పాత్రధారిగా ఎన్టీఆర్ కనపడతాడు.



ఆ సినిమా దర్శకుడు ఎన్టీ రామారావే. ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్.

* * *

న్.టి. ఆర్  దేహ సౌష్ఠవం ముఖ్యంగా పౌరాణిక పాత్రల్లో దేనికైనా అతికినట్టు సరిపోతుంది. (ఒక్క నారదుడు తప్ప దాదాపు అన్ని ప్రముఖ పౌరాణిక పాత్రలూ ఆయన పోషించాడు).

సైడ్ వ్యూలో ఆయన మొహం  ఎక్కువ ఆకట్టుకునేలా కనపడుతుందని నాదో థియరీ! ముఖ్యంగా వీరరసం ఉప్పొంగే ఘట్టాల్లో!

ఈ వర్ణచిత్రాలు గమనించండి- 

శ్రీకృష్ణుడు,   అర్జునుడు

అడవిరాముడు

                     (ఈ మూడూ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ చిత్రించినవి).



* * *
  
క్కకు తిరిగిన ముఖం (side face view) తో ఉన్న మనుషుల బొమ్మలు చూసినపుడు ఒక కన్ను మాత్రమే  కనపడి ఆశ్చర్యం వేసేది... నా చిన్నవయసులో. 

ఆర్టిస్టు రెండో కన్ను వెయ్యలేదేమిటనే అమాయకపు  సందేహం వచ్చేది! తల్చుకుంటే ఇప్పుడు నవ్వొస్తుంటుంది.

స్కూలు రోజుల్నుంచీ గురజాడ అప్పారావు బొమ్మ ఎక్కడ చూసినా ఎడం పక్కకు తిరిగే కనపడేది. దీంతో ఆయన మొహం ఎలా ఉంటుందో అంతుపట్టేది కాదు.
 


ఈ మధ్యకాలంలోనే గురజాడ  చిత్రాలు వేరే కోణంలో ఉన్నవి చూడగలిగాను.

    
రచయిత గోపీచంద్ బొమ్మ కూడా అంతే. 
 
   
 

 కుడిపక్కకు తిరిగి ఉన్న బొమ్మనే ఏళ్ళ తరబడిగా చూస్తూ వచ్చాను. తర్వాతికాలంలో ఆయన మనవైపు చూస్తున్న భంగిమలో ఉన్న ఫొటో చూసి, ‘ఈయన గోపీచందేనా?’ అని సందేహించేంత ఆశ్చర్యం కలిగింది.


 చుట్టా... సిగరెట్.. పైపు



కథా రచయిత చాసో  ఫొటో/ చిత్రం ఎడం పక్కకు తిరిగివుండే భంగిమలోనే ఉంటుంది, ఎక్కడ చూసినా!

కర్ణుడి సహజ కవచకుండలాల్లాగా చుట్ట ఒకటి ఆయన నోటికి కనపడుతుంటుంది.

చుట్ట లేని బొమ్మ కూడా ఉండటం కొంత ఆశ్చర్యకరమే.



ఇప్పుడు కాదు గానీ, చాలాకాలం క్రితమైతే... సిగరెట్ దమ్ము బిగించిన శ్రీశ్రీ ఫొటో,  పైపు కాల్చే బాపు బొమ్మా (సెల్ఫ్ కారికేచర్) తరచూ పత్రికల్లో కనపడేవి. 

ఇవి ఉన్నది  సైడ్ వ్యూలోనే!  


మద్యం సీసాలతో స్టైల్ గా  పోజులిచ్చే రచయితల, కవుల ఫొటోలు మనకు లేనందుకు సంతోషించాలేమో!


* * *

రేఖాచిత్ర రస గంగాధరం

సైడ్ ఫేస్ బొమ్మల గురించి చెప్పుకునేటపుడు తప్పనిసరిగా గుర్తొచ్చే చిత్రకారుడు గంగాధర్.

ఆయన కొన్ని దశాబ్దాల క్రితం తెలుగు మ్యాగజీన్స్ లో  కథలకు విరివిగా ఇలస్ట్రేషన్స్ వేశారు. అవి లలితమైన రేఖలతో భలే ఉండేవి.



ఆయన తన బొమ్మల్లో వ్యక్తులను తరచూ  సైడ్ వ్యూలోనే వేసేవారు. ఆ కోణం గంగాధర్ బాగా ఇష్టమేమో.

లేకపోతే బొమ్మలు అలా వేయటంలో ఏదో సౌలభ్యం ఆయనకు ఉండివుండాలి.



సౌలభ్యం అంటే గుర్తొచ్చింది.

ఎవరిదైనా రూప చిత్రం (పోర్ట్రెయిట్ ) వేగంగా  వేయాలంటే  చిత్రకారులకు  సైడ్ వ్యూ చాలా అనుకూలం.

కొన్నేళ్ళ క్రితం ... ఓసారి  మా ఆఫీసులో ఆర్టిస్టుల సెక్షన్ కు ఇలస్ట్రేటర్ బాబు అతిథిగా వచ్చారు. ( బాలజ్యోతిలో, ఇంకా ముందు రోజుల్లో విజయ మంత్లీలో బొమ్మలు వేసిన ఆర్టిస్టు.)

సరదాగా అక్కడున్నవాళ్ళ  పోర్ట్రెయిట్లను వేయటం మొదలుపెట్టారు.

ఎదుటి వ్యక్తిని  మొహం పక్కకు తిప్పమని చెప్పి, తాను నిలబడి సైడ్ యాంగిల్లో అలవోకగా రూపచిత్రాలను చకచకా గీసేశారు.


ఆయన అప్పటికప్పుడు రెండు నిమిషాల్లోనే గీసిన ఓ చిత్రం ఇది. 

గీసిన బొమ్మకూ, ఒరిజినల్ మనిషికీ పోలికలు బాగా కనపడాలంటే ముక్కుకు ప్రధానపాత్ర ఉందని అప్పుడే అర్థమైంది.

సైడ్ యాంగిల్లోనే ముక్కు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కదా?