సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

19, మే 2014, సోమవారం

శ్రీశ్రీకి వేటూరి చిరస్మరణీయ నివాళి... చదివారా?


వేటూరి సుందరరామమూర్తి,  శ్రీరంగం శ్రీనివాసరావులు సినీ కవులుగా  చాలాకాలం  సహ ప్రయాణం చేశారు. ‘గోరింటాకు’ లాంటి సినిమాల్లో ఇద్దరూ  పాటలు రాశారు.  ‘గీతాంజలి’సినిమాకు వేటూరి రాసిన  ‘ఆమనీ పాడవే హాయిగా’ పాటలో శ్రీశ్రీ  ‘మరో ప్రపంచమే మరింత చేరువై’కనిపిస్తుంది!

31 సంవత్సరాల క్రితం...  మహాకవి శ్రీశ్రీ మరణించిన సందర్భంలో ఎన్నో తెలుగు పత్రికలు సంపాదకీయాలు రాసి  ఆయనపై గౌరవం చాటుకున్నాయి.

వాటన్నిటిలోనూ ప్రత్యేకమైనది వేటూరి ‘ఈనాడు’లో  రాసిన గెస్ట్ ఎడిటోరియల్!

తెలుగు జాతికి  శ్రీశ్రీ ‘సమర్పణ’ను  స్మరించుకుంటూ ‘ఆయన  చోటెక్కడ?’ అని అడుగుతూ, తెలుగు వాడిని నిలదీస్తూ,  శ్రీశ్రీ  కవిత్వానికి తెలుగు సాహిత్యంలో ఉన్న స్థానాన్ని భావోద్వేగ పూరితంగా అంచనా కట్టటానికి  చేసిన ప్రయత్నం అవటం వల్ల ఈ నివాళి సార్థకమైంది.


శ్రీశ్రీని  కేవలం కవి కాదు ; ‘మహర్షి’ అనీ, ‘ప్రవక్త’ అనీ శ్లాఘించారు.  ప్రాసల చమక్కులు ఎక్కువే;  అవి చెప్పదలిచిన విషయానికి  వన్నె తెచ్చాయి.

1940  జులై 17న మహాప్రస్థానం కావ్యానికి  చలం రాసిన ‘యోగ్యతాపత్రం’తో  1983  జూన్ 17న ప్రచురితమైన వేటూరి సంపాదకీయాన్ని పోల్చవచ్చనిపించింది.


మొదటిది శ్రీశ్రీ విశ్వరూపాన్ని ముందుచూపుతో సందర్శించి చలం కట్టిన అంచనా. (యోగ్యతా పత్రం రాసిన పదేళ్ళకు గానీ మహా ప్రస్థానం విడుదల కాలేదు). 

రెండోది  శ్రీశ్రీ  ప్రతిభా సంపత్తులు బహుముఖంగా వ్యాప్తమై, ఆయన నిష్క్రమించాక  వేటూరి చేసిన గౌరవ వందన సమర్పణ లాంటిది.

‘‘ఇంకా రాత్రి చీకట్లో, లోకం నిద్రలో భయంకర స్వప్నాలు కంటో, దీనంగా పలవరించే సమయాన ఉషాగమనాన్ని గుర్తించి స్వాగతమిచ్చే వైతాళికుడు శ్రీ శ్రీ!’’అని చలం మెచ్చుకుంటే  ‘శ్రీశ్రీ వైతాళికులకు వైతాళికుడు’  అని వేటూరి ప్రశంసించారు!

‘నెత్తురూ, కన్నీళ్ళూ తడిపి కొత్త tonic తయారు చేశాడు శ్రీ శ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి’

‘ మాటల్ని కత్తులూ, ఈటెలూ, మంటలుగా మార్చటం అతనికే చేతనవును’

‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ’

- ఇలాంటి మరపురాని సూత్రీకరణలు/ వ్యాఖ్యానాలు చలం యోగ్యతాపత్రంలో చూడొచ్చు.

వేటూరి రాసిన నివాళి లో  కూడా ఇలాంటి వాక్యాలెన్నో ఉన్నాయి-  
‘రెండు శ్రీల ధన దరిద్రుడు, కవితా ఘన సముద్రుడు శ్రీశ్రీ’

‘కవిగా శ్రీశ్రీ జన్మించిన నాటి నుంచి-
అతని వాక్కు రుక్కు అయింది.
అతని మాట బాటయింది.
గేయం జాతీయం అయింది.
ఊపిరి ఉద్యమం అయింది.

కవిగా అతను తన జీవితకాలంలోనే ‘లెజెండ్’ అయినాడు.’

‘అతని రిపార్టీలు, చతురోక్తులు, సమాధానాలు, సంభాషణలు నానుడులై, సామెతలై, పలుకుబడులై తెలుగు భాషను సుసంపన్నం చేశాయి’

 ‘శ్రీశ్రీ మొదలంటా మానవుడు- చివరంటా మహర్షి- మధ్యలో మాత్రమే కవి- ఎప్పటికీ ప్రవక్త’

అలవోకగా సాగే వేటూరి అక్షర విన్యాసం, పదక్రీడ ముచ్చటగొలుపుతుంది. 
 
‘చాందస భావబంధాలతో , ఛందస్సుతో  అతను తెగతెంపులు చేసుకోకపోతే  అతనూ చాలా కల్పనా కల్పవృక్షాలకూ  విశాఖ నుంచి చెన్నపురి దాకా బీజావాపనం చేసి గ్రంథ సాంగుడయ్యేవాడు.’

భవ బంధాలనే పదబంధాన్ని ‘భావ బంధాలు’గా పరిమార్చటం,  గ్రంథాలు రాసేవాడనటానికి  ‘గ్రంథసాంగుడ’ని రూఢ్యర్థాన్ని పక్కనపెడుతూ  చమత్కరించటం... 

 సంతాపకీయాలు
శ్రీశ్రీ మరణించాక  తెలుగు దిన, వార,  పక్ష, మాస, త్రైమాసిక పత్రికలూ, ప్రత్యేక సంచికలెన్నో నివాళి సంపాదకీయాలు ప్రచురించాయి. వాటన్నిటినీ  శ్రీశ్రీ సాహిత్య నిధి (విజయవాడ) వాళ్ళు పుస్తకంగా వేశారు.

మొత్తం 34 ‘సంతాపకీయాల్లో ’ వేటూరి రాసినదే మొదట ప్రచురించారు. 

‘ప్రజాసాహితి’ లో కూడా ఈ సంపాదకీయాన్ని ఓసారి ప్రచురించారు!

ఆ సంపాదకీయం ఇక్కడ చూడండి... 

( ఈనాడు ‘పాతికేళ్ళ అక్షరయాత్ర’ పుస్తకంలో ప్రచురించిన పునర్ముద్రణ ఇది).



వేటూరి ని ఎలా ఎంచుకున్నారు? 
బాధా సర్పదష్టుల, నిరుపేదల పక్షపాత కవి  శ్రీశ్రీ మరణించినపుడు  కమర్షియల్ సినీ కవిగా పేరున్న  వేటూరితో ‘ఈనాడు’ వారు సంపాదకీయం ఎందుకు రాయించారనే సందేహం వస్తుంది.

 ఆయన సాటి సినీ కవి అనా?  పూర్వాశ్రమంలో పాత్రికేయుడు అనా? ఇవేమీ కాదు. 

బూదరాజు రాధాకృష్ణ గారి ఆత్మకథ ‘విన్నంత-కన్నంత’ లో  దీనికి సమాధానం దొరుకుతుంది.

వేటూరి సంపాదకీయాన్ని ‘ఎడిట్’ చేసింది బూదరాజు గారే!

అప్పటికే  ఈనాడు నుంచి రాంభట్ల కృష్ణమూర్తి,  గజ్జెల మల్లారెడ్డిలు నిష్క్రమించారు.  మల్లారెడ్డి తన పుణ్యభూమి కాలమ్ లో దాశరథిపై తీవ్ర విమర్శ చేసివున్నారు.  పైగా కార్టూనిస్టు శ్రీధర్ అప్పటి  ముఖ్యమంత్రి  అంజయ్య,  దాశరధిలపై వ్యంగ్యచిత్రం వేశారు. కాబట్టి దాశరథితో సంపాదకీయం రాయించే వీలులేదు.

‘‘మహాకవి శ్రీశ్రీ అస్తమించినప్పుడు సంపాదకీయం రాయటానికి అనువైన వ్యక్తి కోసం ఈనాడు అన్వేషణలో పడ్డది. ... సినారే గారు రాసిస్తామని మాట ఇచ్చారు గాని మధ్యాహ్న సమయానిక్కూడా ఆయన వ్యాసం అందలేదు - ఆయన ఆచూకీ దొరకలేదు! అప్పుడు సినిమా సంబంధాల వల్ల పరిచితులైన వేటూరి సుందరరామమూర్తి గారు మద్రాసు నుంచి టెలిఫోన్లో చెప్తుంటే ఇక్కడ టేపు రికార్డు చేసి కంపోజింగ్ మొదలుపెట్టారు. కొన్ని చోట్ల మూలం తెలియలేదు. మొత్తం మీద సంపాదకీయం సుదీర్ఘమయింది. దాన్ని కుదించటానికి  నన్ను పిలిపించారు రామోజీరావు గారు. ... అందరికీ నేను కుదింపులకూ రంధ్రాన్వేషణ చేసి తప్పులు దిద్దటానికీ పనికి వస్తానన్న నమ్మకముంది కాబట్టి ఈపనికి నన్ను పిలిచారు. నా కర్తవ్యం నెరవేరే సమయానికి సాయంత్రం 6 గంటలు దాటింది...’’
అని రాశారు బూదరాజు గారు.

ఇప్పుడు మనం చూస్తున్న సంపాదకీయం కుదించినది అన్నమాట... 

‘కొన్ని చోట్ల మూలం తెలియలేదు’అన్నారు కదా?  ‘శుచిరగ్ని: శుచి: సవి: ’ అనే వాక్యం మూలం ఎక్కడిదో మరి...!

వేటూరి గారు తక్కువ వ్యవధిలో రాసినందువల్లనేమో, ఇందులో  కొటేషన్లు నిర్దుష్టంగా రాలేదు.

‘కవిర్మనీషీ స్వయంభూ ఆత్మభూ  ’ అనే వాక్యం  చూద్దాం..
‘ఈశావాస్యోపనిషత్తు’ఎనిమిదో శ్లోకంలో  ఇలా ఉంది- 

‘కవిర్మనీషీ పరిభూ :
స్వయంభూ: యాథాతథ్యత:
అర్థాన్ వ్యదధాత్
శాశ్వతీభ్య: సమాభ్య: ’


శివుడికి ఉన్న రెండు పేర్లలో స్వయ౦భూ : తో పాటు ఆత్మభూ: ఈ కొటేషన్లోకి వచ్చినట్టుంది.

‘శౌర్యం పెరిగిన మనిషినీ , మృగాన్నీ కటకటాలలో పెడతారు’ అనే పాట రాసింది శ్రీశ్రీ కాదు; ఆరుద్ర. జగపతి వారి ‘ఆరాధన’లో పాట ఇది. ( శ్రీశ్రీ సాహిత్య నిధి వారు ఈ సవరణ- వివరణ ఇచ్చారు.)

ఈ లోపాలు అర్థం చేసుకోదగ్గవే.  అప్పటికి  ఫోన్ సదుపాయాలు ఇంత బాగా విస్తరించలేదు. ఫాక్సు సౌకర్యం లేదు. ఇంటర్నెట్ అసలే లేదు. రెఫరెన్సులు, కొటేషన్లు  వేగంగా వెతికి పొరబాట్లు దొర్లకుండా  రాయటం,  వాటిని పరిమిత వ్యవధిలో  సరిచూడటం అప్పట్లో  కష్టమైన పనులే. 

ఇక ఈ నివాళిలో ముఖ్యంగా శ్రీశ్రీ కొటేషన్లలో కొన్ని అక్షరదోషాలు దొర్లాయి. మహా ప్రస్థానం తరచూ చదివేవారికి అవి తేలిగ్గానే తెలుస్తాయనుకోండీ.

ఈ అపశ్రుతులున్నప్పటికీ  ఈ సంపాదకీయం విశిష్టత దీనిదే.  అరుణతార,  ప్రజాసాహితి, సృజన, ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి .. ఇలాంటి పత్రికల రాసినవాటికంటే  దీనికే అగ్రస్థానం ఇవ్వబుద్ధేస్తుంది.

మొత్తానికి వేటూరితో సంపాదకీయం రాయించాలనే ఆలోచన చిరస్మరణీయమైన సంపాదకీయం రావటానికి కారణమైంది.



రెండు శ్రీల అద్భుత చిత్రం
 


శ్రీశ్రీ  బొమ్మను  చాలామంది చిత్రకారులు వేశారు. కానీ  శ్రీశ్రీ  అనే  అక్షరాల్లోనే ఒక ఘర్షణను సూచించేలా వేసిన ఈ  చిత్రం  నాకు  చాలా ఇష్టం.  పీడకుణ్ణీ, పీడితుణ్ణీ ఆ అక్షరాల్లోనే  గొప్పగా పొదగటం విశేషం.

చిత్రకారుడూ,  పబ్లిసిటీ ఆర్టిస్టూ అయిన  గంగాధర్  దీన్ని చాలా సంవత్సరాల క్రితం  వేశారు.

బహుశా ‘విజయ’ మాసపత్రికలో ఓ కథకు/ వ్యాసానికి  వేసినట్టు గుర్తు. మొదటి శ్రీని బక్కగా, రెండో శ్రీని బొద్దుగా వేయటంలోని కాంట్రాస్టు ఆకట్టుకుంటుంది.

శ్రీశ్రీ  హాస్య చతురత,  రిపార్టీల గురించి చెప్పటానికి తరగని గనిలా ఎన్నో విశేషాలుంటూనే ఉంటాయి. 

రా.వి.శాస్త్రి గారు  16.6.83న విశాఖ లో జరిగిన సంతాప సభలో  చెప్పిన ఓ రెండు విశేషాలు -  (ఇవి చాలామందికి తెలిసినవే.. కానీ గుర్తుచేసుకోవటం బాగుంటుంది..)

‘‘ మీ శిష్యరత్నం ఆరుద్ర గారెలా ఉన్నారని ఈ మధ్య ‘ఆంధ్రజ్యోతి’లో ఎవరో అడిగారు. ‘శిష్యుడంటే ఆయనొప్పుకోడు. రత్నమంటే నేనొప్పుకోను’ అన్నారాయన. అంత బాగా మహాకవి శ్రీశ్రీ గారే చెప్పగలరు.

‘కష్టజీవికి రెండువైపులా ఉండేవాడే కవి’ అని శ్రీశ్రీ గారన్నారు. ఇంత తేలిగ్గా చెప్పడం నిజానికెంతో కష్టమైన సంగతి.  కవిత్వంలో శ్రీశ్రీ గారు సాధించినదదే. అందుకే ఆయన మహా కవి. ’’