సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

1, ఫిబ్రవరి 2014, శనివారం

మూగమనసులూ ... మూడు కన్నీటి పాటలూ

‘మూగమనసులు’  స్టిల్.   కళ్ళతోనే భావాలు పలికిన  సావిత్రి

‘మూగమనసులు’  సినిమా విడుదలై  50 సంవత్సరాలైన  సందర్భంగా నిన్న  ‘ఈనాడు  సినిమా పేజీ’లో ఓ  ఆర్టికల్ రాశాను.

దాన్నిక్కడ  చూడొచ్చు...    
 
  
కన్నీటి  గీతాలు 
ఈ సినిమాను ఇన్నేళ్ళుగా జనం గుర్తుంచుకోవటానికి  ప్రధాన  కారణం -  వీనులవిందైన సంగీతం, ఆలోచింపజేసే భావాలున్న  సాహిత్యం...

ఆచార్య  ఆత్రేయ దీనిలో  ఏడు పాటలు రాశారు. 

‘నా పాట నీ నోట పలకాల సిలకా’  పాటలో  ‘నా నీడ సూసి నువు కిలకిలా నవ్వాల’ అంటూ నవ్వు గురించి  రాసి;   మరో మూడు  పాటలను మాత్రం  కన్నీటితో తడిపారు.
 
ఈ మూడు పాటల్లోని భావాలూ,  వ్యాఖ్యానాలూ   సినిమా  పాత్రల పరిమిత పరిధిని దాటిపోయాయి.   అందరికీ అన్వయించే  స్థాయిలో   తెలుగులో స్థిరపడిపోయాయి. సందర్భానుసారం  కోట్ చేసే పంక్తులుగా మారాయి.    

‘ముద్దబంతి పూవులో  మూగకళ్ళ వూసులో ’ పాటలో  -

నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా

మనసును   పైపైన కాకుండా లోతుగా  అర్థం చేసుకోవాలనే సూచన..

‘మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను’ పాటలో-

కలలు కనే కళ్ళున్నాయి, అవి కలతపడితె నీళ్ళున్నాయి

కలల కనటం , అనుకున్నది జరగకపోతే  కన్నీళ్ళు రావటం ఎవరికైనా సామాన్యమే అనే వాస్తవానికి అద్దం పట్టటం.   

ఇక  ‘పాడుతా తీయగా సల్లగా...’ పాటలో -

గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు
ఉండమన్న వుండవమ్మ శాన్నాళ్ళు

ఏడిస్తే బాధ తగ్గిపోయి ఊరట కలుగుతుందనేది కవితాత్మకంగా చెప్పటం. ఆ బాధ  ఎంతటిదయినా కాలం గడిస్తే దాని తీవ్రత తగ్గిపోతుందని  కూడా చెప్పటం .

* * *
పూర్వజన్మా... పునర్జన్మా 
పునర్జన్మలుంటాయనే అశాస్త్రీయమైన నమ్మకం మీద ఆధారపడి తీసిన చిత్రం  ‘మూగమనసులు’.    

పూర్వజన్మ జ్ఞాపకాలతో  గత జన్మలోని వారిని గుర్తుపట్టారంటూ దశాబ్దాల క్రితం  పత్రికల్లో  వార్తలు విరివిగా వచ్చేవి.  ఇలాంటి సంఘటనలు పేపర్లలో చదివినపుడు ‘నిజమే సుమా’ అనిపించేట్టుగా ఆ కథనాల అల్లిక ఉండేది.

‘మూగమనసులు’ పాటల పుస్తకంలో  మొదటి పేజీ  చూడండి-


ఇలాంటివి  పొక్కినపుడు ఆ సంఘటనలు  జరిగిన ప్రదేశాలకు  నాస్తిక ప్రముఖుడూ, శాస్త్రవేత్తా డా. అబ్రహాం కోవూర్ స్వయంగా వెళ్ళి,  వారిని పరిశీలించి  అవి కల్పనలనీ/  మానసిక భ్రాంతులనీ శాస్త్రీయంగా రుజువు చేశారు.

ఆయన వ్యాసం  ‘పునర్జన్మ ఉన్నదా?’ అనేది  ప్రసిద్ధం.

సంచలనాత్మకమైన వదంతులను వ్యాప్తి చేయటంలో  ఆసక్తి చూపే పత్రికలు-  అవి అబద్ధాలని తెలిశాక నిజాలను ప్రజలకు తెలియజెప్పాలనే బాధ్యతా,  పట్టింపుతో  సాధారణంగా ఉండవు కదా!

యాబై సంవత్సరాల క్రితం ఇలాంటి  వార్తలే చదివి ,  వాటి ప్రభావంతో దర్శకుడు ఆదుర్తి  తయారుచేసుకున్న పాయింటు ‘మూగమనసులు’ సినిమాగా మారింది.

పునర్జన్మలున్నాయని రుజువు చేయటం కోసం కాకుండా, అలాంటిది జరిగితే ఏమవుతుందనే  ఊహతో  తీయటం వల్ల ‘మూగమనసులు’  మూఢనమ్మకాలకు పెద్దగా ఊతమివ్వలేదని అనిపిస్తుంది. 

కానీ మధురమైన  సంగీతంతో,  ఆకట్టుకునే సహజ సన్నివేశాలతో  అభిరుచి గల దర్శకుడు  దీన్ని  తీశారు.  

సబ్జెక్టు మూఢనమ్మకాలపై ఆధారపడినదీ-  
దాని  కథన పద్ధతి  కళాత్మక విలువలున్నదీ  అన్నమాట.  

ఈ సినిమా ‘బాగుంద’ని మెచ్చుకోవటమంటే  స్పష్టంగా రెండో అంశం గురించి మాత్రమే!   

‘మూగమనసులు’ (1964)  వచ్చిన 12 సంవత్సరాలకు  ‘దేవుడు చేసిన బొమ్మలు’ (1976) అనే చిత్రం వచ్చింది.  మురళీమోహన్, జయసుధలు నటించారు. సత్యం సంగీతంలో  ‘నిను వినా నాకెవ్వరూ’ అనే శ్రావ్యమైన పాట ఈ సినిమాలోదే!

ఇది కూడా పునర్జన్మల ఆధారంగా  తీసిందే!  

* * *
మరపురాని దృశ్యం
మళ్ళీ ‘మూగమనసుల’ దగ్గరకు  వద్దాం.

‘పాడుతా తీయగా..’ పాట చిత్రీకరణలో ఓ  దృశ్యం  ఉంది. 

భర్తను కోల్పోయి, పుట్టింటికి చేరి  మంచమ్మీద పడుకుని  కుమిలిపోయే సావిత్రి.  ఆ ఇంటి బయట గుమ్మం ముందు కూర్చుని ఆమెను పాటతో ఊరడిస్తూ విషాదభరితంగా నాగేశ్వరరావు.

 బయటున్న నాగేశ్వరరావూ,  ఇంట్లో  మంచమ్మీదున్న  సావిత్రీ  ఒకేసారి  కనిపించే  కోణం చూడండి-  అబ్బురంగా అనిపించటం లేదూ?!

చీఫ్ కామెరామన్ పి.ఎల్. రాయ్ ప్రతిభావంతంగా  తీసిన ఈ  దృశ్యం  ప్రేక్షకుల మదిలో ముద్రపడిపోయేలా ఉంటుంది.  పాట ముగిసిపోయినా  వెంటాడుతుంది.


ఈ కోణం చిత్రకారుడు  ‘బాపు’ను కూడా ఆకట్టుకుంది. 

 ‘కోతికొమ్మచ్చి’ సిరీస్ లో  ఈ పాట గురించి ముళ్ళపూడి వెంకట రమణ ప్రస్తావించినపుడు -

బాపు  ఫ్రీ హ్యాండుతో  అలా గీశారు.


‘కొస’ మెరుపు
ఈ సినిమాలో  కొసరాజు -  ‘ గౌరమ్మా నీ మొగుడెవరమ్మా ’  పాట రాశారు.

నూజివీడు లో నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో  ఈ పాటలో చివరిలో ఉండే ఓ విశేషాన్ని ఎమ్వీయల్ గారు క్లాసులో చెప్పుకొచ్చారు.

‘సగం దేహమై నేనుంటే , అది పెళ్ళామంటే సెల్లదులే
పళ్ళు పదారు రాలునులే
పళ్ళు పదారు రాలునులే’


పళ్ళు ఎవరికైనా ముప్పై రెండు కదా? పదారు (పదహారు) అని ఎందుకు రాశారు?  ‘పళ్ళు - పదారు’ అనే ప్రాస కోసమేనా?

కొసరాజు  అలా అర్థమేమీ లేకుండా  రాస్తారా?!

మరి దీనిలో అంతరార్థమేంటి?

పురాణాల్లో  శివుడు అర్ధ నారీశ్వరుడు కదా?  నోట్లో సగం పళ్ళు గౌరి (పార్వతి) వే.  కాబట్టి  మిగిలిన  పదహారు  పళ్ళ సంగతే  ప్రస్తావించి,  అవి రాల్తాయని చమత్కారంగా చెప్పటమన్నమాట! 

ఎమ్వీయల్ గారు  వివరించేవరకూ ఈ విశేషం మాకు అర్థం కాలేదు. 

విశేషం సంగతి  తర్వాత- ‘ పళ్ళు పదారు’ అని యాంత్రికంగా పాడుకోవటమే కానీ,    ‘అందరికీ ఉండేవి ముప్పై రెండు  పళ్ళు  కదా?  పదహారని రాశారేమిటీ?’ అనే సందేహమే  రాలేదు, అప్పటివరకూ!