సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

25, డిసెంబర్ 2015, శుక్రవారం

మీ గొప్పలు మీరే చెప్పుకోవాలా?



న్మాన సభల్లో  కళాకారులను ధారాళంగా పొగుడుతూ చేసే కీర్తి గానాలు  దుర్భరంగా ఉంటాయి.

అవే అలా అనిపిస్తుంటే...

ఎవరికి వారు తమను  పొగుడుకుంటుంటే  వినాల్సిరావటం/  చదవాల్సిరావటం..
మరెంత  ఘోరం..!


*  *   * 

స్పీ బాలసుబ్రహ్మణ్యం  మధుర  గాయకుడిగానే కాదు-

చక్కని నటుడిగా , 
ప్రతిభావంతుడైన  డబ్బింగ్ ఆర్టిస్టుగా,
ప్రత్యేకించి అద్భుతమైన యాంకర్ గా  నాకెంతో ఇష్టం.

ఆయన ఇంటర్ వ్యూలు ఎప్పుడూ భలే  ఉంటాయి.  కొత్త విషయాలెన్నో తెలుస్తాయి.  అంతకుముందు తెలిసినవి కూడా  ఆయన మాటల్లో వింటే మరింత స్వారస్యంగా తోస్తాయి.

బాలూ పాడిన తొలిపాట రికార్డింగ్ జరిగి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా పది రోజుల క్రితం  ఆయనతో చేసిన పెద్ద  ఇంటర్ వ్యూ ఈనాడు సినిమా పేజీలో వచ్చింది.

ఆసక్తిగా చదివాను.


 మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి గానీ... 

 రెండు చోట్ల మాత్రం ఆయన సమాధానాలు చదువుతుంటే  చేదుగా అనిపించింది.

‘ఈ దేశం ఓ గొప్పకళాకారుడిని  సృష్టించింది’ అనీ,   ‘నాలాంటి గాయకుడు పుట్టడం చాలా అరుదు’ అనీ తన ఘనతను తానే చాటుకున్నారు  బాలు.

 


ఈ  విషయాలు ఎంత నిజాలైనా కావొచ్చు; కానీ వాటిని  ఆయనే  చెప్పుకోవటం మాత్రం ఏమీ బాగా లేదు.

అడిగిన ప్రశ్నల తీరు అలా చెప్పేలా ప్రేరేపించివుంటుందని సర్దుకుందామా?  సినీ మాయామేయ ప్రపంచంలో  దశాబ్దాలుగా విజయవంతంగా కొనసాగుతూ  అసంఖ్యాకమైన ఇంటర్ వ్యూలు  ఇచ్చి  ఏది ఎలా ఎంతవరకూ  చెప్పాలో ఎంతో తెలిసిన  బాలూ  కదా..  అలా ఎలా చెప్పాడనే ప్రశ్న మాత్రం వదల్లేదు నన్ను.  
  
 ‘‘ఇప్పుడు కూడా  నా గురించి నేను చెప్పుకోకపోతే నాకు నేను ద్రోహం చేసుకున్నవాడినవుతా!’’ అనే సమర్థన మరీ ఇబ్బందిని కలిగించింది. 

బాలూ!  మీ గురించి మీరలా చెప్పుకోకపోతే మీ గురించి  శ్రోతలకూ,  ప్రేక్షకులకూ  తెలియని పరిస్థితి  ఉందా?

మీరే ఇంతలా దీనంగా  భావిస్తుంటే... మరి మీ సీనియర్ గాయని సుశీల సంగతి?  

తెలుగు చిత్రసీమ  స్వర్ణయుగంలో అవిభాజ్య భాగమై..  ఘంటసాలతో,  మీతో  కూడా మరపురాని... మనోహరమైన పాటలనెన్నో ఆలపించిన సుశీల  ఇలా తన గొప్పలు తానే ఎన్నడైనా  చెప్పుకున్నారా?

అవార్డులే  కొలమానంగా భావించే, వాటికోసం  వెంపర్లాడే  సినిమా సంస్కృతిలో ఏళ్ళ తరబడి ఉంటూ కూడా ..

తను పాటలు పాడటం మొదలుపెట్టినపుడు బహుశా ఇంకా పుట్టని గాయని  చిత్రకు పద్మశ్రీ ఇచ్చి తనను పట్టించుకోకపోయినా-

ఆ గాన కోకిల  మౌనంగానే ఉన్నారు కదా?

ఆవేదనతోనో, ఆక్రోశంతోనో తన ఘనత చాటుకునే ప్రయత్నం ఆమె  చేయలేదు కదా? (కొద్ది కాలం తర్వాత ఎవరి సిఫార్సు పనిచేసో.. అంతకన్నాపెద్ద అవార్డే  వచ్చిందనుకోండీ...)    

బాలూ... మీ గురించి మీరిలా చెప్పుకోవడం ద్వారా మీ ఉన్నత వ్యక్తిత్వాన్ని కొంత  కుదించుకుని,  మిమ్మల్నిఅభిమానించేవారిని ఎంతో కొంత బాధపెట్టారనిపించింది.

ఈ ఆత్మ శ్లాఘనలు మీ ఔన్నత్యాన్ని తగ్గించాయనే  అభిప్రాయం  నాలాంటి అభిమానులకు  ఏర్పడిందంటే- ఇప్పుడు నిజంగానే మీకు మీరే  ద్రోహం చేసుకున్నట్టు అవలేదా? 

 
*  *   * 
‘ఆత్మ శ్లాఘన’అనే మాట వినగానే గుర్తొచ్చే రచయిత చెలం.

 శ్రీశ్రీ మహా ప్రస్థానానికి  ఆయన  రాసిన ‘యోగ్యతాపత్రం’లో  ఈ వాక్యాలు చూడండి-

‘‘అబద్ధాలతో, స్తోత్రాలతో, వంచనలతో, అనుకూల దుష్ట ప్రచారంతో, ఆత్మ శ్లాఘనలతో దేశం మీద పడి బతుకుతున్న ఈ  prasite కవివరేణ్యులు శ్రీ శ్రీ ని విమర్శించడానికి సాహసిస్తున్నారు. "అభివృద్ధికి రాతగినవాడవు" అని ఆకాశమంత ఎత్తుగా వుండే అతని వీపు తట్ట చూస్తున్నారు.’’


అలాంటి శ్రీశ్రీ  తర్వాతి కాలంలో   ‘ఈ శతాబ్దం నాది’ అంటూ  గొప్పలు పోవటం బాగా అనిపించలేదు.

ఒక భాషా సాహిత్యంలోని ఒకానొక  ప్రక్రియలో ప్రభావశీలమైన ప్రతిభ చూపినంతమాత్రాన ఒక  శతాబ్దం మొత్తం ఆ కవిదే  అయిపోదు.  ఒకవేళ అయితే గియితే...ఆ మాట ఇతరులు.. విమర్శకులు చెప్పొచ్చు  గానీ..

ఒక కవి తన ప్రభావం గురించి తానే  ఎలుగెత్తి చెప్పుకోవడం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. 

ఆ  శ్రీశ్రీని  తొలి దశలో ప్రబావితం చేసిన  కవి  విశ్వనాథ  సత్యనారాయణ.   

 ‘ధిషణాహంకారం’తో  విశ్వనాథ  చేసిన స్వీయ కీర్తిగానాలూ  అంతే!


చూడండి-

‘‘అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోః
హల బ్రాహ్మీమయమూర్తి  శిష్యుడయినాడన్నట్టి దా వ్యోమపే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశ స్వామి కున్నట్టుగన్
’’
(శ్రీమద్రామాయణ కల్పవృక్షం)

తనంతటివాడు శిష్యుడైన అదృష్టం చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రికి  దక్కింది గానీ నన్నయ, తిక్కనలకు కూడా  దక్కలేదట! 

తిరుపతి వేంకటకవుల్లో  ఒకరు ఈ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి.

ఆ జంట కవులు విసిరిన సవాళ్ళలో  ఎంతెంత సొంత పొగడ్తలు కురిపించుకున్నారో చూడండి-



"దోసమటం చెఱింగియును దుందుడు కొప్పఁగఁ బెంచినార మీ
మీసము రెండుభాషలకు మేమె కవీంద్రులమంచుఁ దెల్పఁగా
రోసము గల్గినన్ గవివరుల్ మము గెల్వుఁడు గెల్చిరేని యీ
మీసము దీసి మీపదసమీపములం దలలుంచి మ్రొక్కమే."


తెలుగు, సంస్కృత భాషలు రెంటికీ వాళ్ళే కవీంద్రులట. అందుకే  మీసం పెంచారట.  తమను ఏ కవులైనా గెలిస్తే వారి మీసం తీసేసి, వాళ్ళ కాళ్ళ దగ్గరపెట్టి మొక్కుతామని సవాలు విసిరారు.

అప్పట్లో కొప్పరపు కవులకూ,  వీరికీ మధ్య  అవధానాల, కవనాల, వాగ్యుద్ధాలు హోరాహోరీగా  జరిగేవట. మొహమాటాలేమీ పడకుండా యథేచ్ఛగా ఎవరి  గొప్పలు వారే చెప్పుకోవటం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం.

కొప్పరపు కవులు కూడా ఇలాగే తమ ఘనతను చాటుకున్నారో  లేదో  తెలియదు.

*  *   * 
హాభారత రచనా కాలం నాటికే  ఎవరిని వారు పొగుడుకోవటం  హీనమైన విషయంగా ఉంది.

కర్ణపర్వం మూడో ఆశ్వాసంలో  అర్జునుడు ఓ సందర్భంలో  దర్మరాజును నానా తిట్లూ తిడతాడు. ఆపై పశ్చాత్తాపంతో  తన తల నరుక్కుంటానని అంటాడు.

కృష్ణుడు " అర్జునా ! దానికీ ఒక ఉపాయం ఉంది !  తనని తాను పొగుడుకోవడం చావుతో సమానం అంటారు పెద్దలు. అందుచేత నిన్ను నువ్వు పొగుడుకో. అదే ప్రాయశ్చిత్తం.’’ అంటాడు.

అప్పుడు అర్జునుడు తనను ఇలా పొగుడుకుంటాడు-

 " ధర్మజా ! నా పరాక్రమం నీకు తెలియనిదా !  శివుడు వొక్కడూ తప్పిస్తే  విల్లు పట్టినవాళ్ళలో నాతో సాటి వచ్చేవాడు ముల్లోకాల్లోనూ లేడు. దిగ్విజయం చేశాను. కోట్లు కోట్లు ధనం నీ రాజసూయం దక్షిణల కోసం తెచ్చిపోశాను. సాటి లేని  సంశప్తకులను  నాశనం చేశాను. నా చేతిలో చచ్చిన కౌరవసేనలు ఎలా పడివున్నాయో ఒక్కసారి చూడు’’ 

‘నిన్ను నువ్వు పొగుడుకుంటే  నిన్ను నువ్వు చంపుకున్నట్టే’ అంటూ  సొంత డబ్బా కొట్టుకోవడాన్ని ఆ కాలంలోనే అంత తీవ్రంగా నిరసించేవారన్నమాట!

*  *   *  

రు సంవత్సరాల క్రితం రచయిత  నామిని సుబ్రహ్మణ్యం నాయుడికి తిరుపతిలో  చెక్కు బహూకరణ సన్మానం జరిగింది.

ఆ సందర్భంగా తన  ప్రసంగ వ్యాసం- ‘పాఠకులారా! మిమ్మల్నిక్షమించలేను’లో  నామిని తన రచనల ఘనతను స్వయంగా చాటుకున్నారు.



 ‘ఆబాల గోపాలానికి ఎంతగానో ఉపయోగపడే ఇన్నిపుస్తకాలు’ రాశానన్నారు. పాఠకుల దేహాల్లో  ‘ఎప్పటికప్పుడు మంచి రసాయనాల ఇన్సులిన్ పడటానికి ’ తన  పుస్తకాలు కొనాలని చెప్పుకొచ్చారు.

దీన్ని రచయిత్రి  రంగనాయకమ్మ ఎలా దుయ్యబట్టారో చూడండి-

                             
‘‘ఏ మనిషి అయినా , ‘నేను అందరికన్నా చాలా గొప్పవాణ్ణి’ అన్నాడంటే , అనుకున్నాడంటే ఆ మనిషి మొదట అందరికన్నా అల్పుడు!  తర్వాత అందరికన్నా మూర్ఖుడు! 

నువ్వు చాలా గొప్పవాడివే అయితే , ఆ మాట, నీ గురించి ఇతరులు చెప్పుకోవాలి. నిన్ను నువ్వే వర్ణించుకోవడం కాదు.  ఇంత చిన్నవిషయం తెలియని ఏ మనిషి అయినా , గొప్పవాడయ్యేది , అల్పత్వంలోనే !’’


‘గొప్పవాడయ్యేది అల్పత్వంలోనే... ’ -  ఎంత  పదునుగా ఉందో కదా  ఈ వ్యాఖ్య!

*  *   * 

న ప్రతిభా సంపత్తుల విషయంలో నమ్రతగా, వినయంగా  ఉన్న కవి కాళిదాసు!

రసవంతమైన- మనసుకు హత్తుకునే పోలికలు చెప్పటంలో  ‘ఉపమా కాళిదాసస్య’  అని  ప్రఖ్యాతికెక్కిన సంస్కృత కవి.

 తాను రాసిన  కావ్యం   ‘రఘువంశం’  మొదట్లోనే  తన గురించి ఏం చెప్పుకున్నాడో  చూడండి-




మన్ద: కవియశ: ప్రార్థీ గమిష్యామ్యపహాస్యతామ్
ప్రాంశులభ్యే ఫలే లోభాదుద్బాహురివ వామన:


అంటే-

‘‘నేనొక తెలివితక్కువ వాణ్ణి.  కవి అనే కీర్తి పొందాలనే కోరిక ఉన్నవాణ్ణి . పొడుగైన వాళ్ళకు మాత్రమే అందే పళ్ళు అందుకోవాలని చేతులు సాచే పొట్టివాడిని చూసి నవ్వినట్టు జనం నన్ను చూసి నవ్వుతారేమో.’’

 కర్ణకఠోరమైన స్వీయ గుణగానాలతో ‘పోలిస్తే’ కాళిదాసు తన గురించి  చెప్పింది హాయిగానూ,  శ్రవణపేయంగానూ  లేదూ!  


13, నవంబర్ 2015, శుక్రవారం

సుశీల మాటా... సావిత్రి పాటా!

 

పి. సుశీల...

హాయి గొలిపే తీయని తెలుగు పాటకు మరో పేరు ఆమె! 

ఐదు దశాబ్దాలకు పైగా సినీరంగంలో నిలిచి వెలిగి- తరతరాల శ్రోతలను మరపురాని పాటలతో మురిపించిన మధుర గాయని!

ఆమెనూ  ఆమె పాటలనూ పలకరిస్తూ,  పలవరిస్తూ,  పరామర్శిస్తూ  ఓ కథనాన్ని తాజా ‘సితార’ వారపత్రికలో రాశాను.

దాన్నిక్కడ చదవొచ్చు. 



పాట వినగ ప్రాణాలు కదలురా!

సుశీల మధుర గీతాల్లో చాలావరకూ  ఈ  ‘సితార’ కథనంలో వచ్చాయి 

స్థలం లేక ఎడిట్ అయినవీ, ఆ కథనం రాసినప్పుడు తప్పిపోయినవీ మరికొన్ని పాటలున్నాయి. వాటినిక్కడ గుర్తుచేస్తున్నాను.

సుశీల పాటల్లో ఎక్కువ భాగం సంగీతాభిమానులు ‘రేడియో’లో పదేపదే విని ఇష్టపడినవే. ఒక్కో శ్రోతకు ఒక్కో పాటతో ప్రత్యేక జ్ఞాపకం ఉండొచ్చు.

ఇలా  ఈ పాటలను స్మరించుకోవటమంటే మనసును ఉల్లాసపరిచిన- ఉద్వేగపరిచిన కాలంలోకి ప్రయాణించడమే. కరిగిపోయిన గతంలోని చెరిగిపోని పాత పరిమళాల్లోకి సాగిపోయి పరవశమైపోవటమే! 


(పాటలు ఏ సినిమాలోవో ఇస్తున్నాను. కానీ  లింకులు ఇవ్వటం లేదు... ఆసక్తి ఉన్న శ్రోతలు ఈ ఆధారంతో  నెట్ సాయంతో  వాటిని తేలిగ్గానే సాధించగలుగుతారు కదా...)

* ఆహా అందము చిందే హృదయ కమలం  (ఆడ బ్రతుకు)
* పచ్చని చెట్టూ ఒకటీ వెచ్చని చిలకలు రెండూ   (రాము) 
* పిల్లలూ దేవుడూ చల్లని వారే (లేత మనసులు)
* దీపానికి కిరణం ఆభరణం  (చదువు- సంస్కారం)

*  నీ చెలిమీ నేడె కోరితినీ  (ఆరాధన)
*  జోరు మీదున్నావు తుమ్మెదా (శివరంజని)
*  చిన్నమాటా...ఒక చిన్నమాటా (మల్లెపూవు)
*  ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో (మరో చరిత్ర)

*  ఆకులో ఆకునై పూవులో పూవునై (మేఘ సందేశం)
* ముందు తెలిసేనా ప్రభూ నీ మందిరమిటులుంచేనా  (మేఘ సందేశం)


సుశీల పాడిన తొలి పాటలను నటి జమునపై చిత్రీకరించారు. ఆ రకంగా సుశీల కెరియర్ ఆమెతోనే మొదలైందన్నమాట.

 ‘గొంతుకలో సన్నివేశానికి తగిన భావనను నింపి , ఆ పాత్ర స్వభావాన్ని అనుసరించి, అర్థం చేసుకుని పాడగల సమర్థురాలు’  అని జమున కితాబిచ్చారు.

అందుకే అంత వైవిధ్యభరితమైన పాటలకు ప్రాణ ప్రతిష్ఠ చేయగలిగారామె.

*  పార్వతిని ప్రార్థించే పాటను (‘జననీ శివకామినీ..’ - నర్తనశాల) ఎంతగా మెప్పించారో...

మరియ తనయను స్తుతించే ( ‘రాజ్యము బలమూ మహిమా నీవే నీవే’- రాజాధిరాజు)  గీతాన్ని కూడా అలాగే  ఒప్పించారు. 

*  దయ్యం పాటంటే వెంటనే గుర్తొచ్చే సుశీలపాట- ‘‘నిను వీడని నీడను నేనే" (అంతస్తులు )  కదా? 

 టీజింగ్, చమత్కారపు పాటలు  తల్చుకుందామా! 

*  పాండవులూ పాండవులూ తుమ్మెదా (అక్కా చెల్లెలు)  
* ఏమండోయ్ శ్రీవారూ, ఒక చిన్నమాటా (మంచి మనసులు)
*  పొరుగింటి మీనాక్షమ్మను చూశారా? ( సంబరాల రాంబాబు)
*  ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్ (అమ్మ మాట)



నటి వాణిశ్రీ ...  సుశీల పాటల గురించి
ఏమన్నారో చూడండి-   


 పుట్టినరోజు సందర్భాన్ని గుర్తుచేసే ఈ పాటలు అత్యంత ప్రాచుర్యం పొందినవి-

*  మళ్ళీ మళ్ళీ పాడాలి  ఈ పాట (మట్టిలో మాణిక్యం)
*  పుట్టిన రోజు పండగే అందరికీ (జీవన తరంగాలు)

*   పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయీ ( బంగారు కలలు)

*  ఈనాడే బాబూ నీ పుట్టినరోజు  (తాత-మనవడు)



సుశీల పాడిన జోల/లాలి పాటలు ఎన్ని ఉన్నాయో...!

*  పాలకడలిపై శేషతల్పమున పవళించేవా (చెంచులక్ష్మి )
*  అత్త ఒడీ పువ్వు వలే మెత్తనమ్మా (తోడూ నీడా)
*  వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా (ఆరాధన)
*  నీ మది చల్లగా స్వామీ నిదురపో (ధనమా? దైవమా?)

*  ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు (జీవనజ్యోతి)
*  చందురుని మించి అందమొలికించు (రక్త సంబంధం)
*  నీలాల కన్నుల్లో మెలమెల్లగా (నాటకాల రాయుడు)
*  చిరుగాలే వింజామర చిట్టిపాపే కెందామర (శ్రీదేవి)

*  ప్రేమకు నేనూ పేదను కాను (ముందడుగు)
*  జోలపాట పాడి ఊయలూపనా (ఇది కథ కాదు)
*  వటపత్ర శాయికి వరహాల లాలి (స్వాతిముత్యం)

సుశీల...  ఘంటసాలతో పాడిన యుగళగీతాలు ఎన్నో శ్రావ్యమైనవి ఉన్నాయి. వాటిని ఇక్కడ ప్రత్యేకంగా ఇవ్వటం లేదు. 

కానీ,  ఘంటసాల ప్రాభవం ఉన్నరోజుల్లోనూ  కాలానికి నిలిచే యుగళ గీతాలను బాలుతో కలిసి పాడటం విశేషం.

ముఖ్యంగా... ఘంటసాల సంగీత దర్శకత్వంలో సుశీల- బాలు పాడిన యుగళగీతం ఒకటి చెప్పుకోదగ్గది. అది-

* సెలయేటి గలగలా చిరుగాలి కిలకిలా  (తులసి)

ఇంకా మిగిలిన పాటలు...

* ఏమంటున్నది ఈ గాలి ఎగిరే పైటను అడగాలి  (మేమూ మనుషులమే)
*  తనివి తీరలేదే నా మనసు నిండలేదే (గూడుపుఠాణి)
*  కురిసింది వానా నా గుండెలోనా (బుల్లెమ్మ బుల్లోడు)

* కొండపైనా వెండివానా (ఇంటి దొంగలు)

*  ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లూ (పండంటి కాపురం)
*   నీలో విరిసిన అందాలన్నీ  (మనుషులు- మట్టి బొమ్మలు)  

* మల్లి విరిసిందీ పరిమళపు జల్లు కురిసిందీ (రామయ తండ్రి) 
* మల్లెకన్న తెల్లనా మా సీత మనసు  (ఓ సీత కథ) 
పాలరాతి మందిరాన పడుచు బొమ్మ అందం (నేనూ మనిషినే) 
చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు (చీకటి వెలుగులు) 

* ఇది తీయని వెన్నెల రేయి (ప్రేమలేఖలు)
 * మానసవీణా మధుగీతం (పంతులమ్మ)


*  ప్రణయరాగ వాహినీ చెలీ వసంత మోహినీ (మాయామశ్చీంద్ర)
*  కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా (చెల్లెలి కాపురం)
*  కుశలమా నీకు కుశలమేనా (బలిపీఠం)


*  తొలివలపే తియ్యనిది (నీడ లేని ఆడది ) 

*  మెరుపులా మెరిశావు (ప్రేమ సంకెళ్ళు)
*  చినుకులా రాలి నదులుగా సాగి  (నాలుగు స్తంభాలాట)
*  నీకోసం జీవితమంతా వేచాను మల్లెలలో (మూడు ముళ్ళు)
*  వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన మురళి (సప్తపది) 
 
 స్లో సాంగ్స్ రోజుల్లోనూ  చాలా వేగవంతమైన స్వరకల్పనలున్న  పాటలను సుశీల పాడారు. వాటిలో చెప్పుకోదగ్గవి-

 1) ముత్యాల జల్లు కురిసే రతనాల మెరుపు మెరిసే (కథానాయకుడు)  సంగీతం: టీవీ రాజు

 2) రా వన్నెల దొరా కన్ను చెదరా  (లక్ష్మీ కటాక్షం)  సంగీతం:  ఎస్ పీ కోదండపాణి

ఈ  పోస్టు శీర్షిక సంగతి

 ఇంతకీ  ఈ బ్లాగు పోస్టు  టైటిల్  గురించి ఇంకా చెప్పనే లేదు కదూ...!

సుశీల పాటలు మనకు ఏళ్ళ తరబడిగా తెలుసు. మరి  ఆమె మాట ఎలా ఉంటుందో  చూద్దాం.

ఓ సందర్భంలో  ఘంటసాల ఘనతను తల్చుకుంటూ నివాళిగా ఆమె ఇలా మాట్లాడారు....




ఈ పోస్టు రెండో భాగంలో సావిత్రి పాట గురించి ప్రస్తావన ఉంది. దాని సంగతేమిటి  అంటారా ?  

‘సుశీలమ్మ’ పాడితేనే తనకు బాగా నప్పుతుందని సావిత్రి నమ్మకం. అందుకే  ఆమె మాత్రమే తనకు పాడాలని ఆమె కచ్చితంగా దర్శక నిర్మాతలకు చెప్పేవారట. 

ఆమె ఓ ఇంటర్వ్యూలో  ‘మూగ మనసులు ’ పాటలోని ఓ చరణాన్ని సరదాగా ఆలపించారు.  అదిక్కడ  విందాం.  (చివర్లో  అదే చరణాన్ని  సుశీల గళంలో కూడా వినొచ్చు.)

  



విన్నారు కదా?   స్థాయి (పిచ్) లో మాత్రం తేడా వచ్చింది కదూ... ( సుశీల పాడింది కూడా  వింటే ఆ భేదం స్పష్టంగా తెలుస్తుంది).

కానీ  అనౌన్సర్  కోరిక మీద అప్పటికప్పుడు పాడాల్సివచ్చిన సందర్భం ఇది!  

సాధన చేయకపోయినా,  సంసిద్ధంగా లేకపోయినా ట్యూన్ సరిగానే పాడేశారు సావిత్రి!

30, అక్టోబర్ 2015, శుక్రవారం

కనపడే చిత్రం... దాగిన విచిత్రం

   
కరకాల  గోళాలన్నీ కదలి వస్తూ,  ఎగిరిపోతూ  ఒక విస్ఫోటనం జరుగుతున్నట్టుంది కదూ...!

అంతే కాదు,  తలను  పక్కకు వంచి కళ్ళు మూసుకుని,  దీర్ఘాలోచనలో ఒక స్త్రీ  మొహం కూడా  కనపడుతోంది,  చూశారా?  

‘గాలాటీ ఆఫ్ ద స్ఫియర్స్ ’ అనే ఈ ఆయిల్ పెయింటింగ్ ని స్పానిష్ అధివాస్తవిక  చిత్రకారుడు  సాల్వడార్ డాలీ  1952లో  వేశాడు.  

ఈ బొమ్మను తమిళ సినిమా ‘అన్బే శివం’ లోగోలో వాడుకున్నారు. 



కానీ  స్త్రీ  బదులు కమల్ హాసన్  రూపం కనపడేలా మార్చారు.
 

 తెలుగులో ఈ సినిమా ‘సత్యమే శివం’ (2003)  అనే పేరుతో అనువాద చిత్రంగా విడుదలయింది.  

సత్యమే శివం లోగోలో మాత్రం ఎలాంటి  బొమ్మా ఉండదు.


 నాకిష్టమైన సినిమాల్లో ఇదొకటి.

కథ ఇతివృత్తం,  సున్నితమైన- చురుకైన హాస్యం,  కమల్, మాధవన్ ల నటన, సంగీతం... ఇవన్నీ ఎంతో బాగుంటాయి.

డాలీ బొమ్మలో  స్త్రీ రూపం చూడగానే తెలిసిపోతుంది. కానీ పరిశీలించి చూస్తే  గానీ దాగివున్న అంశాలు కనపడని పెయింటింగ్  ‘సత్యమే శివం’లో ఉంది. 

ఈ సినిమాలో కమల్ హాసన్  ఫ్యాక్టరీ కార్మికుడు, వీధి నాటక కళాకారుడు,  ఆధునిక చిత్రకారుడు;  ముఖ్యంగా ‘కామ్రేడ్’.

 కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా  నెలకు 910 రూపాయిల జీతమిచ్చి పనిచేయించుకునే పెట్టుబడిదారుడు నాజర్.
 
అతడి కోసం శివుడి  పెయింటింగ్ వేసే పని ఒప్పుకుని ఆ పని పూర్తి చేస్తాడు కమల్.

ఆ పెయింటింగ్ మామూలుగా చూస్తే తపస్సు చేస్తున్న  శివుడి రూపంలాగే ఉంటుంది.


దానిలో  నెలవంకను కమ్యూనిస్టు చిహ్నమైన కొడవలిగా,  దానిలోపల సుత్తిని కూడా తెలివిగా  ఇముడుస్తాడు. 

కుడిపక్కన ఏకంగా   కార్ల్ మార్క్స్ బొమ్మ! ఇది  పరిశీలిస్తే గానీ  కనపడని రీతిలో ఉంటుంది.


( కార్మికులను పీడించి వారి శ్రమ ఫలితం  దోచుకునే పెట్టుబడిదారుడి ఇంట్లో కార్ల్ మార్క్స్ బొమ్మ... భలే ఉంది కదూ!) 

అన్నిటికంటే మించి... నాజర్  కార్మికులకు  ఇచ్చే  నెల జీతం  910 అంకెలను శివుడి  జటాజూటం నుంచి కిందకు జారే గంగాజలం పాయలుగా చిత్రీకరిస్తాడు.   


శివుడి రూపం తన రూపాన్ని  పోలివుండేలా వేయటం  మరో విశేషం.     


శివుడి తలచుట్టూ  గోళాలు సాల్వడార్ డాలీ  బొమ్మను స్ఫురింపజేస్తాయి.

(డాలీ బొమ్మ అయినా ,  శివుడి బొమ్మ అయినా కళ్ళు మూసుకునే ఉండటం ఓ విశేషం)

ఈ పెయింటింగ్ లోని మర్మం గురించి ‘సత్యమే శివం’లో  నాజర్ కి మొత్తానికి తెలిసిపోతుందనుకోండీ.  తర్వాత కథ మలుపులు తిరుగుతుంది.  ఆ  విషయాలు ఇక్కడ  అవసరం లేదు.  సి. సుందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మాత్రం  చూసి తీరాల్సినది! 

*   *   *

సాల్వడార్ డాలీ పెయింటింగ్ వేసిన కొద్ది నెలల్లోనే  (1953 మార్చిలో) ఇక్కడ మన  కొడవటిగంటి కుటుంబరావు గారు  చందమామ మాసపత్రికలో ఓ ఆసక్తికరమైన కథ రాశారు.  

( నిజానికి ఈ రెంటికీ నేరుగా ఏమీ  సంబంధం లేదు. కానీ  ఆలోచిస్తే... ఒక సారూప్యత  ఉందనేది నా ఉద్దేశం)   

ఇద్దరిలో రూపురేఖలు ఒకేలా ఉంటే  ‘అచ్చు గుద్దినట్టు’ ఈ వ్యక్తి   ఫలానా వ్యక్తి లాగా ఉన్నాడని  అంటారు. 

కానీ  గమనింపుతో  చూసి... పట్టించుకోనంతవరకూ కొన్నిసార్లు ఆ  పోలికలు కనపడవు.

కొ.కు. రాసిన కథ పేరు  ‘రాతిలోని ముఖం’.  చివరి వరకూ విషయం తెలియకుండా కొంత  ఉత్కంఠను పెంచుతూ ఈ  కథ రాశారాయన. 


ఓ కొండమీద రాతిలో  ప్రకృతి సిద్ధంగా ఓ  ముఖాకృతి ఏర్పడి ఉంటుంది. ఆ రాతిలోని మనిషి పోలిక ఉన్నవాడి వల్ల చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు ఉపకారాలు జరుగుతాయని ఓ ముని చెప్తాడు. 

ఆ మాటలు గాఢంగా నమ్మిన వసువు అనే కుర్రవాడు అలాంటి పోలికలున్న వ్యక్తి వచ్చి ఊరికి మేలు చేస్తాడని ఎదురుతెన్నులు చూస్తుంటాడు.

మరి అతడి నిరీక్షణ ఫలించిందా? లేదా?

శంకర్ బొమ్మలతో  ఉన్న ఆ చిన్న  కథ ఇక్కడ ఇస్తున్నా, చదివి ఆనందించండి. 




ఈ కథలో రాతిలోని ముఖం పోలికలున్న మనిషి దొరుకుతాడో లేదో,  దొరికాడో లేడో  చివరికి గానీ మనకు తెలియదు. అసలు నిజం   తెలిశాక  భలే అనిపిస్తుంది.

మరి సాల్వడార్ డాలీ వేసిన బొమ్మ?  

చూడగానే  వింతగా అనిపిస్తుంది. వేగంగా పరిభ్రమించే గోళాలు మాత్రమే అక్కడున్నాయి. కానీ వాటి వల్ల   స్త్రీ రూపం నేరుగా ఏర్పడింది కాదు.  అది  పరోక్ష ఫలితమే.

ఈ  రూపం ఆయన భార్య గాలా ది. ఈ బొమ్మ అణుసిద్ధాంతాన్ని సూచిస్తుందనీ,  దీనిలో అణువులోని పార్టికల్స్ ను సూచించాడనీ అంటారు. ఈ పెయింటింగ్ అంతరార్థం గురించి ఎన్నో విశ్లేషణలు వచ్చాయి.

దీన్ని త్రీడీలో చూస్తే ...
ఇలా  ఉంటుంది.  (నిమిషన్నర కూడా నిడివి లేని చిన్న వీడియో...) 



 *   *   * 

ప్పుడో  చిన్న క్విజ్...
ఇక్కడున్న ఈ  బొమ్మలో ఎన్ని జంతువులున్నాయి?


3  అని ఎవరూ  చెప్పరనుకుంటాను. 

అని గానీ, 
5  అని గానీ -   చెపుతారు ఎక్కువమంది. 

కాస్త తేరిపార  చూస్తే కనపడే జంతువులు మాత్రం  6! 


పరిశీలనగా చూస్తేనే  అంతరార్థం బోధపడే  కళలో (ముఖ్యంగా  చిత్ర,  శిల్ప కళల్లో )  ప్రత్యేకత ఉంటుంది.  ఎంతో ఆకర్షణ కూడా!       

29, సెప్టెంబర్ 2015, మంగళవారం

ఆలాపనతో ఇళయరాజా గీతాంజలి

 వేటూరి రాసి -  ఇళయరాజా స్వరపరిస్తే... బాలు సోలోగా  పాడిన రెండు పాటల గురించి ఈ పోస్టు.

పనిలో పనిగా  ఈ రెండు పాటలు పుట్టటానికి ఇరవై ఏళ్ళముందు వచ్చిన మరో పాట సంగతి కూడా చెప్పుకొస్తాను, చివర్లో! 

1989లో వచ్చిన  నాగార్జున ‘గీతాంజలి’ సినిమాలోని  ‘ఆమనీ పాడవే హాయిగా’ పాట ఎంత పాపులరో చాలామందికి తెలుసు. 

దానికి మాతృక అనదగ్గ పాట ఒకటుంది. 

అది అంతకుముందు మూడేళ్ళ క్రితం విడుదలైన ‘ఆలాపన’ సినిమాలోది.  ఆ సినిమా ఫ్లాప్ కాబట్టి ఈ పాట కూడా అంత పాపులర్ కాలేదు.

ఈ పాట ‘ఆమనీ పాడవే’ కంటే హాయిగా ఉంటుంది. అందుకే దీనికే నా మొదటి మార్కు. 

ఆ పాట- ‘ఆవేశమంతా ఆలాపనేలే..’.
ఈ పాటను బాలు కాస్త జలుబు చేసినట్టుండే గొంతుతో పాడినట్టు అనిపిస్తుంది.  

సంగీతాభిమానులు ఈ పాట ప్రత్యేకత ను గ్రహించి దానిలోని మెరుపులను ఆస్వాదించటం నాకు తెలుసు. (ఓసారి సంగీత దర్శకుడు బంటి ఈ పాటను టీవీలో పాడటం చూశాను; విన్నాను.) 

ఒక  పాటకు రెండోది  మాతృకలాంటిది అన్నానంటే ఆ రెండు పాటలకు ఆధారమైన రాగాల గురించి బాగా తెలిసి కాదు. ఆ రెండు పాటల పోకడలు చాలా దగ్గర గా ఉన్నట్టు అనిపించి. 



ఈ  రెండు పాటల్లోనూ  ప్రకృతి వర్ణనల పులకింతలు ఉన్నప్పటికీ  ‘అందాలు కరిగే ఆవేదన’ మొదటి పాటలోనూ, ‘గతించి పోవు గాథ’ రెండో పాటలోనూ వినిపిస్తాయి.

రెండు పాటల్లోనూ జ్వలించటం కామన్.  మొదటి పాటలో వర్ణాల రచన  జ్వలిస్తే... రెండో పాటలో వయసులోని వసంతం ఉషస్సులా జ్వలిస్తుంది.    

కథానుగుణంగా ఆలాపనలో ఆనందం పరుగులు పెడితే... గీతాంజలిలో నిరాశ నడకలు ధ్వనిస్తాయి!

‘ఆలాపన’ పాట ఇక్కడ చూడండి.
 పల్లవికీ, చరణాలకూ ముందు వచ్చే స్వరాల విన్యాసం వినసొంపుగా ఉంటుంది. దర్శకుడు వంశీ పాట చిత్రీకరణ వైవిధ్యభరితం.



పాట సాహిత్యం... 

ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే ఉదయినిగా
నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జనించే స్వరాలా
ఆవేశమంతా ఆలాపనేలే

అలపైటలేసే సెలపాట విన్నా
గిరివీణమీటే జలపాతమన్నా
నాలోన సాగే ఆలాపన
రాగాలు తీసే ఆలోచన
ఝరుల జతుల నాట్యం
అరవిరుల మరుల కావ్యం
ఎగసి ఎగసి నాలో
గళ మధువులడిగె గానం
నిదురలేచె నాలో హృదయమే

ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే

వనకన్యలాడే  తొలిమాసమన్నా
గోధూళి తెరలో మలిసంధ్యకన్నా
అందాలు కరిగే ఆవేదన
నాదాల గుడిలో ఆరాధన
చిలిపి చినుకు చందం
పురి విడిన నెమలిపింఛం
ఎదను కదిపి నాలో
విరిపొదలు వెతికె మోహం
బదులులేని ఏదో పిలుపులా

ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జనించే స్వరాలా
ఆవేశమంతా ఆలాపనేలే

ఇప్పుడు ‘గీతాంజలి’ గీతం చూద్దాం.



పాట సాహిత్యం 
ఆమనీ పాడవే హాయిగా
మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో
పూసేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల
మౌనమైన వేళల

ఆమనీ పాడవే హాయిగా
ఆమనీ పాడవే హాయిగా

వయస్సులో వసంతమే
ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే
రచించెలే మరీచికా
పదాల నా యెద
స్వరాల సంపద
తరాల నా కథ
క్షణాలదే కదా
గతించి పోవు గాథ నేనని

ఆమనీ పాడవే హాయిగా
మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో

శుకాలతో పికాలతో
ధ్వనించినా మధూదయం
దివీ భువీ కలా నిజం
సృశించిన మహోదయం
మరో ప్రపంచమే
మరింత చేరువై..
నివాళి కోరినా
ఉగాది వేళలో
గతించి పోని గాథ నేనని

ఆమనీ పాడవే హాయిగా
మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో
పూసేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల
మౌనమైన వేళల
ఆమనీ పాడవే హాయిగా
ఆమనీ పాడవే హాయిగా

విశ్వనాథన్  ‘గౌరవం’
1970లో  ‘గౌరవం’ అనే సినిమా వచ్చింది.  దానిలో  ‘యమునా తీరాన రాధ మదిలోన కృష్ణుని ప్రేమ కథా’అనే పాట నాకు అత్యంత ఇష్టం.  ఎమ్మెస్ విశ్వనాథన్ దీని స్వరకర్త.  పాడినవారు బాలు, సుశీల.

ఆలాపన పాటలో ‘అల పైటలేసే...’ చరణానికి ముందు స్వరాలతో పాటు వచ్చే మెరుపులాంటి క్లుప్తమైన వేణువు బిట్ వినండి.

దానికీ  ఈ ‘యమునా తీరాన..’ పాట ఆరంభంలోని వేణువు బిట్ కూ చాలా సారూప్యం కనపడుతుంది నాకు. 

ఎమ్మెస్ విశ్వనాథన్ ప్రభావం ఇళయరాజా మీద గాఢంగా ఉందనటానికి ఇదో ఉదాహరణ అనిపిస్తుంది.     

వినండి ఈ పాట...  

ఇది సినిమాలో ఎలా ఉంటుందో మరి.  ఈ వీడియోలో మాత్రం వరసగా రాధాకృష్ణుల  నిశ్చల చిత్రాలు మాత్రమే ఉంటాయి.


31, ఆగస్టు 2015, సోమవారం

తొలి సినీ వీణా గానం!





ప్పటివరకూ సినిమా  కథ ఎలా సాగినా  కథానాయిక వీణను ఒడిలో పెట్టుకుని ఇంకా  శ్రుతి చేయకముందే -  ఒక మధుర స్వరఝరి కోసం  అప్రయత్నంగానే సిద్ధమయ్యేవారు ప్రేక్షకులు. సంగీతాభిమానులైతే మరింత ఆసక్తిగా, ఉత్సాహంగా!

కథానాయిక వేళ్ళ కదలికలతో వీణ జీవం పోసుకుంటూనే ఆమె గొంతులోంచి  రాగం పాటగా ఉప్పొంగి జత కలిసేది.  

ఆ సందర్భం -

విషాదమో, విరహమో, విన్నపమో కావొచ్చు.  

ఆనందార్ణవ తరంగితమూ,
ఆహ్లాద సంభరితమూ కావొచ్చు. 


అది ఏదైనా సరే...
మైమరిపించే పాట వెలువడేది.
సన్నివేశం పండేది; రసావిష్కరణ జరిగేది! 

***

ప్పుడంటే వీణ పాటలు తెలుగు  సినిమాల్లో దాదాపు కనుమరుగయ్యాయి.

కానీ  గతంలో  కొన్ని దశాబ్దాల పాటు  వీణ పాటల ట్రెండ్ ఎన్నో సినిమాల్లో కొనసాగింది.

శ్రావ్యమైన- మధురమైన - మరపురాని వీణ పాటలు ఆ సినిమాల పరిధినీ, సన్నివేశాల సందర్భాలనూ దాటి  ప్రేక్షకుల మదిలో  నిలిచిపోయాయి.

ఏమని పాడెదనో  ఈ వేళ...
55 ఏళ్ళ క్రితం తెలుగు సినిమాల్లో  తొలి వీణ పాట  పి. సుశీల గాత్రంలో పుట్టింది.  అభ్యుదయ గీతాలకు పేరుపొందిన  శ్రీశ్రీ  ఈ పాటను రాయడం విశేషం.

లలిత సంగీత శాఖకు ఆద్యుడైన సాలూరి రాజేశ్వరరావే  స్వరాలు సమకూర్చి వీణ పాటకు నాంది పలికారు. 

ఆ సినిమా ‘భార్యాభర్తలు’(1961). 



ఈ సినిమా విడుదలైనపుడు ప్రచురించిన పాటల పుస్తకంలోని  పాట ఇది...


ఇన్నేళ్ళయినా వన్నె తరగని పాట ఇది.  చిత్ర కథాపరంగా... విషాద గంభీరంగా సాగుతుందీ పాట.

ఈ  పాట యూ ట్యూబ్ లో  ఇక్కడ -




‘నిదురించిన వే-ళా’ అనే పదాల దగ్గర స్వర విన్యాసం చూడండి.

చరణాల్లో కూడా ఇలాంటి  చాతుర్యమే కనపడుతుంది. 

మొదటి చరణం వరకూ చూస్తే ..
కలత నిదుర‘లో ’
కాంచిన కల‘లే’
గాలి మేడ‘లై’ ...

ఆ చివరి అక్షరాల విరుపుల మెరుపులు గమనించండి.  అది రాజేశ్వరరావు గారి ముద్ర.

1977లో విడుదలైన ‘కురుక్షేత్రము’లోని ‘మ్రోగింది కల్యాణ వీణ’ పాటలోనూ,

1978లో వచ్చిన  ‘ప్రేమ-పగ’లోని ‘కలిసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణ’ పాటలోనూ...

ఇలాంటి స్వర విన్యాసాన్నే మరింత  విస్తారంగా చేశారు ఎస్ రాజేశ్వరరావు.

సెకండ్ వాయిస్
ఈ పాటను రికార్డు చేసినపుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న రచయిత్రి ఇంద్రగంటి జానకీబాల  తన అనుభవాన్ని  భూమిక పత్రికలో ఏప్రిల్ 23, 2009న ఇలా  పంచుకున్నారు. 

‘‘1960-61 సంవత్సరాలలో నేను మద్రాసులో వున్న రోజులు. ఆ రోజు భలే ఉషారుగా వుంది. ఎందుకంటే ప్రసాద్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ వారి ‘భార్యాభర్తలు’ సినిమా పాట రికార్డింగ్‌. నేను సుశీల గారితో తయారై పోయాను. మొదట ఆమె భర్త ఆమెతో కూడా వెళ్తారనుకున్నారు. కానీ ఆయనకేదో అర్జంట్‌ పనివల్ల నేనే వెళ్ళాలని తెలిసింది.

సాలూరి రాజేశ్వర రావు సంగీతం చేస్తున్న ఆ సినిమాలో ఈ పాట రిహార్సల్స్‌కి నేను వెళ్ళాను. అదీ నా ఆనందం.

ఏ.వి.ఎమ్‌ స్టూడియోలో ఆర్టిస్టు రూ౦ వేరేగా వుంది. అంటే పాడేవాళ్ళ రూ౦ సెపరేట్‌ – హాల్లో మొత్తం ఆర్కెస్ట్రా సెట్‌ చేశారు. ఆమె హెడ్‌ ఫోన్స్‌ పెట్టుకుని పాడతారన్నమాట -

‘ఏమని పాడెదనో ఈ వేళ’ పాటకి వీణ వాయించిన వారు ప్రఖ్యాత వైణికులు చిట్టిబాబు. ఆయన్ని కూడా ఆర్టిస్టు రూ౦లో వుండి వాయించేట్టు ఏర్పాటు చేశారు, ఆ పాటకి మొత్తం పాటంతా చిట్టిబాబు గారు వీణ మీద ఫాలో అవుతారు. అది ఎంత అందంగా, ఎంత సున్నితంగా, ఎంత లలితంగా వుంటుందో ఆస్వాదించి తెలుసుకోవాల్సిందే-

నేను అదే రూ౦లో సోఫాలో కూర్చున్నాను. దూరంగా నాకు ఆర్కెస్ట్రా ధ్వని వినిపిస్తూనే వుంది. ఆమె పాడటం,  వీణ ఆమె పాటను అనుసరించటం వింటుంటే నాకెంతో సంతోషం.

రెండు మూడు రిహార్సల్స్‌ అయ్యాయి.

 అప్పుడప్పుడు అసిస్టెంట్‌ వచ్చి ఏవో సూచనలిచ్చి, చిన్న చిన్న సర్దుబాట్లు చేసి వెళ్తున్నారు- రెడీ, టేక్‌ అన్నారు.
ఫస్టు టేక్‌ అయ్యింది. బాగుంది బాగుంది అన్నారంతా. కానీ రెండో టేక్‌ కోసం తయరవుతుంటే నేను నాలో నేను అనుకున్నాను ‘చాలా బాగుంది కదా’- అని.

ఇంతలో అసిస్టెంట్‌ గారొచ్చి నెమ్మదిగా సుశీల గారితో ఏదో చెప్పి వెళ్ళారు.

ఆమె నా దగ్గర కొచ్చి నెమ్మదిగా ‘‘నువ్వు పాడుతున్నావా – పాడకూడదు. నిశ్శబ్దంగా వుండు – సెకండ్‌ వాయిస్‌ వినిపిస్తోందన్నారంట’ అంటూ చెప్పారు.

నా గుండెలు జారిపోయాయి.

రికార్డింగ్‌ అంటే పిన్ను పడిన శబ్దమైనా లాగేస్తుందని, నా కప్పుడప్పుడే అర్థమవుతోంది. సినిమా రికార్డింగులు చూస్తున్నప్పుడే నాకు కొన్ని సున్నితమైన విషయాలు తెలియవస్తూ వున్నాయి. నేనెలా పాడాను? నా గొంతులోంచి శబ్దం ఎలా వచ్చింది? నాకు తెలుసుకదా అది రికార్డింగని’ అనుకుంటూ బాధపడిపోయాను.

మొత్తానికి కుదురుగా, నిశ్శబ్దంగా, నోరెత్తకుండా కూర్చున్నాను.

పాట రికార్డింగ్‌ పూర్తయింది. అందరూ  ఆనందంగా సుశీల గార్ని అభినందిస్తుంటే అదేదో నన్నేఅన్నంత ఆనందపడి పోయాను.

”హీరోయిన్‌ ఈ పాట వీణ వాయిస్తూ పాడతారు. వీణ మెట్లమీద చక్కగా వేళ్ళు కదలాలి” అన్నారెవరో. ‘‘పోనీ చిట్టిబాబు గారి చేతిని క్లోజప్‌లో పెడితే సరి”.

”అబ్బే అది కుదరదు. ఆయనది అచ్చమైన మగవానిచెయ్యి” అన్నారు మ్యూజిక్‌ డైరక్టర్‌ గారు.

ఈ ‘ఏమని పాడెదనో’ పాట తర్వాత ఎంత పాపులర్‌ అయిందో, అది ఈనాడు ఒక క్లాసిక్‌గా ఏవిధంగా నిలిచిపోయిందో అందరికీ తెలిసిన విషయమే.

మహాకవి శ్రీశ్రీ వ్రాసిన ఈ పాట సంగీతపరంగా కూడా చాలా గొప్ప పాట. పాడటంలో సుశీల చూపిన ప్రతిభ, వీణలో చిట్టిబాబు పలికించిన లాలిత్యం ఈ పాటను ఉన్నతంగా పెట్టాయి.

రాజేశ్వరరావు గారు కంపోజ్‌ చేసి, సుశీల పాడిన వీణ పాటల్లో ఇదొక గొప్ప పాట.

వీటికి తోడుగా, ఆ పాటను చిత్రీకరించిన సన్నివేశం హీరోయిన్‌ నటన (కృష్ణకుమారి), సినిమా అత్యంత ప్రజాదరణ పొందడం, కళాత్మకంగా వుంటూనే కమర్షియల్‌గా విజయం సాధించటం ఆ పాటని అందరి మనస్సులోన శాశ్వతంగా వుండేట్టు చేశాయి.

సినిమా పాటకి సంగీతం, సాహిత్యం, సన్నివేశం, కుదరటం ఒక ముఖ్యమైన అవసరం. దానికి తోడు సాంకేతికంగా బాగా రికార్డు చేయడం కూడా మరీ అవసరం. అప్పుడే అది కలకాలం నిలబడుతుంది.’’

బాగుంది కదూ జానకీబాల గారి జ్ఞాపకం! 

ఇంతకీ  ఆ పాటలో చిత్రీకరించిన-  వీణ మీటిన  వేళ్ళు  ఎవరివి?

ఈ సంగతిని  ఆ పాటకు అభినయించిన కథానాయిక మాటల్లోనే  తెలుసుకుందామా? .  

‘‘ ఏమని పాడెదనో... పాటలో వీణ మీద నా చేతి వేళ్ళు కదలాడిన విధానం చాలా బాగుందని ఎంతోమంది మెచ్చుకున్నారు. చిన్నప్పుడు నేను కొన్నాళ్ళు వీణ నేర్చుకున్నాను. అది ఆ పాట చిత్రీకరణ సందర్భంగా బాగా ఉపయోగపడింది. ’’  

 -  కృష్ణకుమారి (నవ్య వారపత్రిక  మార్చి 28, 2007 సంచిక నుంచి).

ఈ తొలి వీణ పాటను ఇన్ని సంవత్సరాలుగా వేలమంది గాయకులు ఇష్టంగా పాడుతూ... వినేవారిని ఆనందపరుస్తూ వచ్చారు.

***

వీణ పాటల ప్రభావం సాంఘికాల నుంచి  పౌరాణిక చిత్రాలకు వ్యాపించింది. 

1963లో వచ్చిన ‘నర్తనశాల’లో కూడా వీణ పాట ఉంది.  ‘ సఖియా వివరించవే  వగలెరిగిన చెలునికి నా కథా ’(సముద్రాల, సుసర్ల దక్షిణామూర్తి సంగీతం) . కథలో కీచక పాత్రధారి సైరంధ్రిని చూసే కీలక ఘట్టంలో ఈ పాటను ఉపయోగించుకున్నారు దర్శకుడు.

వీణ పాటంటే  సుశీల గారే అనేంతంగా ఆమె ఎక్కువ  వీణపాటలను ఆలపించారు. అలాగే ఎస్. రాజేశ్వరరావు మధురమైన  వీణ పాటలెన్నిటికో స్వరాలు సమకూర్చారు.

మరి వీణపాటలు రాయటంలో స్పెషలిస్టు ఎవరు? 

ఆత్రేయ ఎక్కువగానే  రాశారు గానీ,
ప్రధానంగా వీణ పాటలంటే గుర్తుకు వచ్చే కవి మాత్రం  దాశరథి.

దాశరథి  రాసిన మధురమైన వీణ పాటలు ఓసారి గుర్తు చేసుకుంటే...

* నీవు రావు నిదుర రాదు నిలిచిపోయే ఈ రేయి  (‘పూల రంగడు’ 1967  సంగీతం- ఎస్ రాజేశ్వరరావు)

* మదిలో వీణలు మ్రోగే  ఆశలెన్నో చెలరేగే  ( ‘ఆత్మీయులు’ 1969  సంగీతం- ఎస్. రాజేశ్వరరావు) ,

* వేణుగాన లోలుని గన వేయి కనులు చాలవులే  (‘రెండు కుటుంబాల కథ’ 1970  సంగీతం- ఎస్. రాజేశ్వరరావు)

* పాడెద నీ నామమే గోపాలా ( ‘అమాయకురాలు’ 1971  సంగీతం-  ఎస్. రాజేశ్వరరావు)

* మ్రోగింది వీణా పదేపదే హృదయాలలోన (‘జమీందారు గారి అమ్మాయి’ 1975  సంగీతం- జీకే వెంకటేశ్  ) 

*  కలిసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణ  (‘ప్రేమ-పగ’ 1978 సంగీతం- ఎస్. రాజేశ్వరరావు) 


తరతరాల శ్రోతల హృదయ వీణలను మీటిన పాటలే కదా ఇవన్నీ !


9, జులై 2015, గురువారం

నేటి ‘బాహుబలి’ ... నాటి ‘కంచుకోట’!



‘కంచుకోట’  అంటే  1967లో వచ్చిన  ఎన్టీఆర్ జానపద  సినిమా అనుకుంటారేమో ... అదేమీ  కాదు!  అప్పటికింకా  పదేళ్ళ ముందటి  జానపద గాథ  సంగతి!


ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా  ‘బాహుబలి’ సినిమా విశేషాలు  మార్మోగిపోతున్నాయి... టీవీల్లో, పత్రికల్లో, ఎఫ్ ఎం రేడియోల్లో!  

ఇదొక  కాల్పనిక జానపద కథ అంటున్నారు.

ఊహాజనిత నగరం   ‘మాహిష్మతి’ గురించి విన్నపుడు మాత్రం  అంతకుముందెప్పుడో  దీని గురించి చదివానేమో  అనిపించింది.

అది నిజమేనని  అర్థమైంది.   అదేమిటో  ఈ పోస్టు  చివర్లో  చెప్తాను.


***

మాహిష్మతీ నగరం  ఎక్కడుంది?

ఈ నగరం ప్రస్తావన  రెండు పురాణాల్లో  కనిపిస్తోందని   లేటెస్టుగా తెలుసుకున్నాను.  


వరాహ పురాణంలో- ‘మాహిష్మతి’ అనే రాక్షస వనిత (మహిషాసురుడి  తల్లి ఈమే), మాహిష్మతి అనే  పట్టణం పేరూ  కనిపిస్తాయి.


బ్రహ్మాండ పురాణం ప్రకారం- కార్త వీర్యార్జునుడి రాజధాని పేరు ‘మాహిష్మతీపురం’. ఇది వింధ్య పర్వతాల దగ్గర ఉండేదట.

ఈ కార్తవీర్యార్జునుడికీ,  చేతులకూ (బాహువులు) సంబంధం ఉంది.  కథ ప్రకారం... ఇతడికి వెయ్యి చేతులు!

 జమదగ్ని ఆశ్రమంలోని  హోమధేనువును బలవంతంగా తీసుకువెళ్ళినందుకు కోపించిన  పరశురాముడు ఇతడి చేతులన్నీ నరికేసి, చంపేస్తాడు.

ఇది 18వ శతాబ్దం నాటి పెయింటింగ్
  శాపవశాన  చేతుల్లేకుండా పుట్టి, తపస్సు చేసి  వెయ్యి  చేతులు సంపాదించిన కార్త వీర్యుడు మళ్ళీ శాపం కారణంగానే   ఆ చేతులన్నిటితో పాటు  ప్రాణాలూ కోల్పోతాడన్నమాట.


ఈ విధంగా  బాహువులను బలి తీసుకున్న పరశురాముడిని ‘ బాహు బలి’ అనుకోవచ్చేమో కదా! 

***

ర్ణాటక లోని  గోమఠేశ్వరుడిని  ‘బాహుబలి’ అంటారు. మహా మస్తకాభిషేకం జరిగే నిలువెత్తు విగ్రహం  చాలామందికి తెలిసేవుంటుంది.

ఈ  గోమఠేశ్వరుడి కథ   ఆసక్తికరంగా ఉంటుంది. బాహుబలీ, భరతుడూ అన్నదమ్ములు. ఇద్దరి మధ్యా    పోరు జరుగుతుంది. దానిలో యుద్ధ రీతులూ, మలుపులూ బాగుంటాయి. రాజమౌళి  మార్కు    కొత్త రకం ఆయుధం అంటుంటారు కదా... అలాంటి ఆయుధం   'చక్రరత్న' కూడా ఈ  జైన బాహుబలి కథలో భాగం. 

అమరచిత్ర కథ వారు ప్రచురించిన ఈ కథ ముఖచిత్రం ఇది...



      ***

మళ్ళీ మాహిష్మతి దగ్గరకు...

 చందమామలో వచ్చిన దాసరి సుబ్రహ్మణ్యం గారి  ‘కంచుకోట’(1958) సీరియల్  అన్ని భాగాలూ కూర్చిన  pdf ఫైల్ ను  మొన్నీమధ్య  అనుకోకుండా  మరోసారి చూశాను.

సీరియల్ మొదటి  భాగం - మొదటి పేజీ- మొదటి పదమే ఆశ్చర్యం లో ముంచెత్తింది.  ‘మాహిష్మతీనగర రాజైన యశోవర్థనుడు..’ అంటూ  ఈ సీరియల్ ప్రారంభమైంది.

చూడండి-
ఈ  జానపద ధారావాహిక   మొదటి - చివరి పేజీలు. 



 బాహుబలి సినిమాలోని  మాహిష్మతి రాజ్య దృశ్యాన్నీ -

చందమామలో చిత్రకారుడు చిత్రా  చిత్రించిన బొమ్మ  క్లోజప్ నూ  చూడండి- 


ఈ రెంటికీ  నాకైతే పోలికలు కనపడుతున్నాయి. రెండూ ఏరియల్ వ్యూ అవటం వల్ల కూడా ఇలా అనిపిస్తోందేమో!


దాసరి సుబ్రహ్మణ్యం గారు నాస్తికుడైనప్పటికీ   సాంప్రదాయిక  గాథలు  బాగా  చదివినవారు. ‘మాహిష్మతీ  నగరం’ అనే పేరును  ఆయన పురాణాల నుంచే గ్రహించి  ‘కంచుకోట’లో  ఉపయోగించివుంటారు.

‘బాహుబలి’ కథకులు ఈ సీరియల్ ను చదివి  ప్రేరణ పొందారో  లేదో- ఈ పేరు పెట్టటం  కాకతాళీయమేమో తెలియదు.

కానీ ఈ సీరియల్లో  సుబాహు’ అనే పాత్ర  కూడా  ఉండటం మాత్రం కాస్త  విచిత్రమే అనిపిస్తోంది!

30, జూన్ 2015, మంగళవారం

మాసాంత వేళ- నా బ్లాగూ... నేనూ!



సక్తితోనో .... అనాసక్తితోనో ... దాదాపు ప్రతిసారీ ఆలస్యంగానే 
బ్లాగులో  పోస్టులు రాసేస్తూ ఉండటమేనా?

ఎక్కడో ఓచోట కామా పెట్టి,
ఓసారి ఈ వ్యాసంగాన్ని పరామర్శించుకోవాలనీ...
ఇలాంటి  టపా ఒకటి రాయాలనీ కొద్ది కాలంగా అనుకుంటూనే ఉన్నాను.

వంద టపాలు పూర్తయినపుడా?
‘వంద’!
అయితే ..?
ఇలాంటి  అంకెల మ్యాజిక్కుల మీద నాకేమీ నమ్మకాల్లేవ్.

నూట ఆరో టపా రాసిన సమయంలో అనుకుంటా... నా బ్లాగు రాతల మీద ‘కన్ఫెషన్’ లాంటిది రాయాలనిపించింది.  కానీ కుదర్లేదు. మరో నాలుగు రాసేశాను.

*****

ప్రతి నెలా చివరి రోజుల్లోనే రాస్తూ వస్తున్నాను చాలా కాలంగా.

కారణం- ప్రతి నెలా తప్పనిసరిగా ఒక పోస్టునైనా రాయాలనే స్వీయ నిబంధన పెట్టుకోవటం !

దీన్ని పాటించటం కొన్నిసార్లు  కష్టంగా ఉన్నప్పటికీ .... రాయకుండా ఉండటం.. దాన్ని ఉల్లంఘించటం నాకే ఇష్టంగా ఉండదు.

ఇది  జూన్ నెల చివరి రోజు... పగలు గడిచింది... రాత్రి సమయం..
సరే,  ఆనవాయితీ తప్పినట్టూ ఉండదూ... అనుకుంటున్న ‘కన్ఫెషన్’ ఏదో  రాసేద్దామూ అనిపించింది...

*****

2009లో తెలుగు బ్లాగ్లోకంలోకి అడుగుపెట్టటమే సోషల్ మీడియాలో నా ప్రవేశం..! అప్పట్లో... ఎంతోమంది ఎంతో బాగా రాసేవారు. 


గూగుల్ బజ్ వల్ల కొంతకాలం బ్లాగుల జోరు తగ్గిపోయింది. తర్వాత  ఫేస్ బుక్ విజృంభణా, మైక్రో బ్లాగ్ ట్విటర్ హోరూ, గూగుల్ ప్లస్  ప్రాచుర్యం....వీటితో బ్లాగుల ప్రభ గణనీయ స్థాయిలో క్షీణించిపోయింది.

అప్పట్లో క్రమం తప్పకుండా బ్లాగులను రాసేవాళ్ళు క్రమంగా బ్లాగులకు దూరమైపోయారు.

అయితే  -

‘బ్లాగు’ ఇప్పటికీ  నా మోస్ట్  ఫేవరిట్!

సవివరంగా చిత్రాలతో, వీడియో-  ఆడియోలతో  అలంకరించటానికి  దీనిలోనే  మంచి అవకాశం ఉంటుంది (అని నా నమ్మకం).

చదివినవారు  సావకాశంగా వ్యాఖ్యానించటానికైనా, 
వ్యాఖ్యలు అప్రూవ్ చేస్తే గానీ  ప్రచురితం కాని వెసులుబాటుకైనా బ్లాగులే బెటర్.

ట్విటర్ అయినా,  ఫేస్ బుక్, గూగుల్ ప్లస్ లైనా లింకులు ఇచ్చుకోవటానికే ఎక్కువ ఉపయోగం.

*****

సాహిత్యం,  సంగీతం,  చిత్రకళ... స్థూలంగా  ఈ బ్లాగు పరిధి అంశాలు. ఏం రాసినా వీటిలో ఏదో  ఒకటి- లేదా రెండు కలిసొచ్చేలా ఉంటాయి,  సాధారణంగా .  

సంగీత సాహిత్య  చిత్రకళలు-  ఈ  మూడూ కలిసొచ్చిన  విశిష్టమైన  పోస్టు మాత్రం  ఒకటుంది. అనుకోకుండా అలా కుదిరిన ఆ  టపా-  హిమగిరి సొగసులు.  బ్లాగింగ్ తొలినాళ్ళలోనే ... 2009లోనే రాశానిది.   
 
బాగా నచ్చిన పుస్తకాలూ, సినిమాలూ,  పాటల గురించే  ఎక్కువ టపాలున్నాయి. 

మరి నచ్చనివాటి గురించి?

అవి చాలా తక్కువే.  
‘ప్రశ్నలెన్నో ముసిరే నవలిక మునెమ్మ’ 
‘వేరే రచయితల కథలను తిరగరాయొచ్చా? ’ ఇలాంటివి.  ఇవి వరసగా 2013 ఫిబ్రవరి,  మార్చి నెలల్లో.

‘ శ్రీరామరాజ్యం’  సినిమా పాటల విశేషాలు రెండు రోజులు- రెండు భాగాలుగా! .... ‘శ్రవణానంద కారకా.. ఇళయరాజా’ (2011 డిసెంబరు 23, 24).

వరసగా రెండు టపాల్లో  కళాదర్శకుడూ, రచయితా,  చిత్రకారుడూ అయిన  మా. గోఖలే  విశేషాలు.  (2012 జూన్, జులై).

అమితంగా అభిమానించే సంగీత దర్శకుడు ఇళయరాజా ,  చందమామ ల గురించీ,  ఇష్టమైన  కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గురించీ-  ఒకటికి మించిన  పోస్టులు. 

ముఖ్యంగా అత్యధిక టపాలు మాత్రం-  నా అభిమాన రచయిత్రి  రంగనాయకమ్మ గురించినవే! 

రచనలు చదవకుండా రచయితలను హేళన చేసే, వ్యతిరేకించే ధోరణి పాఠకలోకంలో  ఒకటుంది.  అరకొరగా చదివి దూషణలతో ముంచెత్తే వైఖరి కూడా.

ముఖ్యంగా రంగనాయకమ్మ గారి విషయంలో  ఇది జరుగుతూ వచ్చింది.  బ్లాగులోకంలోనూ ఇది మరింతగా  ప్రతిబింబించింది. 

వేణువు బ్లాగు టపాలు ఈ mis conception ఎంతో కొంత తొలగటానికి  పరోక్షంగా తోడ్పడ్డాయని అనుకుంటున్నాను. 

మనకిష్టమైన అంశాల విశేషాలన్నీ ఓ చోట ... అక్షరాలుగా- చిత్రాలుగా- దృశ్య శ్రవణ రూపంలో కనపడుతుంటే అదో సంతృప్తి.

ఈ క్రమంలో  నా  వ్యక్తీకరణ- writing ability -  బాగానే  మెరుగుపడింది.

వ్యక్తిగతంగా నేను పొందిన లాభమిది!  

*****

కామెంట్ల   సంఖ్యకీ,  టపాను ఎక్కువమంది చదవటానికీ   సంబంధం ఉండాలనేమీ లేదు.

టపాల  గణాంకాలను గమనిస్తే ఇది  అర్థమైంది.




*  ఇప్పటివరకూ నేను  రాసిన 110 టపాల్లో (నిజానికి మొత్తం టపాలు  111. కానీ వీటిలో ఒకటి-  ఓ మిత్రుడి రచన)  అత్యధిక పేజీ వ్యూస్ (2291)  వచ్చిన పోస్టు- ‘ప్రశ్నలెన్నో ముసిరే నవలిక  మునెమ్మ’.

2013  మార్చి 5న రాశాను. దీనికి వచ్చినవి ఏడే కామెంట్లు.(నా సమాధానాలతో కలిపి).

*  కానీ 2010 జులై 26 న రాసిన ‘నా హీరోలు వాలీ, కర్ణుడూ’కు  అత్యధికంగా  142 కామెంట్లు వచ్చాయి. (నా వ్యాఖ్యలతో కూడా కలిపి..)

కానీ పేజీ వ్యూస్  1421 మాత్రమే.




‘ఇదండీ మహాభారతం’ పుస్తకాన్ని శ్రద్ధగా చదివి, వ్యక్తిగత కోణం అనుసంధానించి సమీక్షిస్తూ  రాసిన టపా కంటే ....

ఆ  పుస్తకం అప్పటికింకా పూర్తిగా చదవకుండా రాసిన కర్టెన్ రైజర్ (మహాభారతంపై రంగనాయకమ్మ పుస్తకం)  టపాకే  కామెంట్లూ ..పేజీ వ్యూస్  ఎక్కువ!

ఇలా ఉంటాయి... బ్లాగ్ లోక విచిత్రాలు!  

*****

చందమామ అభిమానిగాబ్లాగాగ్ని బ్లాగు ప్రేరణతో... 2009 మార్చి 11న తెలుగు బ్లాగ్లోకంలో  ‘తొలి అడుగు’ వేశాను. 



ఎమ్వీయల్-యువజ్యోతి బ్లాగర్  రామ్ ప్రసాద్,  ‘అనుపల్లవి’ బ్లాగర్   ‘తెలుగు అభిమాని’, చందమామ రాజశేఖరరాజు  .... ఇంకా మరికొందరి ప్రోత్సాహం లభించింది. 

ఇంతకీ-
పేరు కూడా  కలిసొచ్చేలా  ‘వేణువు’ బ్లాగు పేరు పెట్టాలని నాకెలా తోచింది?  

పత్రికా రంగంలో నా జూనియర్   పప్పు అరుణ  ‘అరుణమ్’  అనే బ్లాగును అప్పటికే  మొదలుపెట్టింది. (తర్వాత  మారిన పేరు ‘అరుణిమ’). 

ఆ పేరు  ప్రభావంతో  ఆలోచిస్తే ... వెంటనే  తట్టిన పేరిది!

29, మే 2015, శుక్రవారం

నా పుస్తకాల లోకంలో .. పరిభ్రమిస్తూ!




‘ఆహారమూ, నీళ్ళూ  లేకుండా  ఎంతకాలం జీవించగలం?’

ఇలాంటి ప్రశ్నే పుస్తకాల విషయంలో నన్ను అడగవచ్చు.

‘పుస్తకాలూ, పత్రికలూ అసలేమీ చదవకుండా ఎన్ని రోజులు  ఉండగలవు?’ అని.

పుస్తకాలను ప్రాణ సమానంగా ఇష్టపడేవారు ఎంతోమంది. 
ఆ జాబితాలో నేనూ  చేరతాను!  

* * *

చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు పత్రికల మీదుగా అడుగులు మొదలయ్యాయి.

సచిత్ర వార- మాస పత్రికలూ,  డిటెక్టివ్,  సాంఘిక నవలలూ,  కథానికల మీదుగా... నా సాహిత్య పఠనం కొనసాగింది.

ఎవరైనా అంతేనంటారా?
అయితే,  అందరిలాగే నేను కూడా!

పుస్తక పఠనం నాకు చాలా చిన్న వయసులోనే  అప్రయత్నంగా  అలవాటయింది.

నాలుగో తరగతిలో ఉన్నపుడు - తొమ్మిదేళ్ళ వయసులోనే  ‘ చందమామ’లో వచ్చే ‘విచిత్ర కవలలు’ సీరియల్ ను నెలనెలా ఎంతో ఆసక్తితో  చదివేవాణ్ణి. దానిలో చిత్రా వేసిన బొమ్మలు ఇష్టంగా ఉండేవి.  కొత్త సంచిక కోసం ఎదురుచూసేవాణ్ణి. 

పది సంవత్సరాలప్పుడు ఆంధ్రప్రభ వారపత్రికలో  కార్టూనిస్టు  బుజ్జాయి  కామిక్ సీరియల్  ‘న్యాయానికి భయం లేదు’ చాలా భాగాలు  చదివాను.

బొమ్మలను ఆస్వాదిస్తూ  చదవటం అలా మొదలైంది. 
 చందమామలో బొమ్మలను చూడగానే సంతకంతో సంబంధం లేకుండా  అవి చిత్రా,  శంకర్, వ.పా. , జయ, రాజి- ఎవరు వేసినవో గుర్తుపట్టటం సరదాగా ఉండేది. 

ఇంట్లో అన్నయ్యలు తెచ్చే పత్రికలూ , పుస్తకాలూ ఉండటం వల్ల  సహజంగానే వాటిని చదవటం అలవడిందనుకుంటాను.

మా ఊళ్ళో  తెలుగు మాస్టారి ఇంట్లో చిన్న లైబ్రరీ ఉండేది. ఆయన నా  పుస్తక పఠనాన్ని బాగా  ప్రోత్సహించారు.

ఆ  లైబ్రరీ  నా పుస్తక దాహాన్ని పెంచింది; కొంత తీర్చింది!


* * *

ప్పుడైనా ఖాళీ గా ఉండి  చదవటానికి ఏమీ లేకపోతే సమయం వ్యర్థమయినట్టు అనిపిస్తుంది. ఆస్పత్రుల్లాంటి చోట్లకు వెళ్ళి గంటల తరబడి వేచి ఉండాల్సినపుడు చేతిలో పుస్తకం ఉంటే చాలనిపిస్తుంది.

అంటే  ‘ఉత్తమ సాహిత్యం’ మాత్రమే చదివి జ్ఞానం పెంచుకుంటూ ఉంటానని కాదు.

సరదా, ఆహ్లాద రచనలూ; సస్పెన్స్, థ్రిల్లింగ్ రచనలూ చదవటం నాకిష్టమే.

మొత్తమ్మీద పుస్తక పఠనం నాకెంతో ఇష్టమైన వ్యాపకం. నాకున్న ఓ మంచి వ్యసనం!    

* * *
పుస్తకాల్లో చాలా రకాలు.
అన్నీ అందరికీ నచ్చవు. నచ్చాలని కూడా లేదు.

ఒక దృక్పథాన్ని ఏర్పరచుకోవడానికి పుస్తకాలూ,  మ్యాగజీన్లూ  ఉపయోగపడతాయి. అలా  ఏర్పరచుకున్నాక దానికి భిన్నంగా ఉండేవి అంతగా రుచించవు. 

అందుకే...
‘ మంచి  తెలుగు పుస్తకాల జాబితా  ఇవ్వు. వాటన్నిటినీ చదువుతాను’ అని  ఎవరైనా అడిగితే  నాకు నవ్వొస్తుంది.

ఏ పుస్తకాలు తనకు నచ్చుతాయో, ఏమేం చదవాలో కూడా బోధపడని  పరిస్థితి  ఉందంటే  ఆ పాఠకులు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నారని అనుకోవచ్చు.

చదువరులకు తమ అభిరుచిని బట్టి  మంచి పుస్తకాలేమిటో తెలుస్తూనే ఉంటుంది.

ఏ పుస్తకాలు చదవాలో తేల్చుకుంటే.. అవెక్కడ ఉంటాయో, వాటిని సంపాదించుకునే మార్గమేమిటో కూడా తెలిసిపోతుంది!

 * * *

పుస్తకాల్లో పేజీ నంబర్లు పేజీకి పైన ఉంటాయి కదా?  ఈ మధ్య వస్తున్న చాలా పుస్తకాల్లో ఆ నంబర్లు పేజీలకు కిందిభాగంలో వేస్తున్నారు.

పేజీ చదివి, తర్వాతి  పేజీకి వెళ్ళేటపుడు పేజీ నంబర్ సరి చూసుకోవటం నా అలవాటు. (రెండు పేజీలు కలిసివుండి - తిప్పినపుడు ఒక పేజీ  దాటిపోవచ్చు.  కథలో లింకు పోయినట్టు ఒకోసారి  తేడా తెలియక దాన్ని గుర్తించలేం కూడా.). 

దీంతో  ఈ ‘కొత్త’ పేజీ నంబరింగ్ నాకు ఇబ్బందిగా అనిపిస్తూ వస్తోంది.

ఇలా పేజీలకు కిందనే నంబరింగ్ ఇవ్వటం ‘ప్రచురణరంగంలో  కొత్త నిబంధనా?’ అనిపించేంతగా దాదాపు ప్రతి పుస్తకంలోనూ ఇదే ధోరణి.

‘పాత పుస్తకాల్లో ఇలా ఉండేది కాదు; ఇప్పుడే ఈ కొత్త  అసౌకర్యం ’ అని బ్లాగులో రాద్దామనిపించింది.

ఎందుకైనా మంచిదని పాత పుస్తకాలూ, మ్యాగజీన్లూ కొన్ని పరిశీలిస్తే-  కళ్ళు తిరిగినంత పని అయింది.

చూడండి- 

 1935లో ముద్దుకృష్ణ సంకలనం చేసిన ఈ  ‘ వైతాళికులు’ పుస్తకంలో పేజీ సంఖ్య పేజీ అడుగు భాగంలోనే  ఉంది. 
 

 

‘చందమామ’ మాసపత్రిక  తొలి సంచిక (1947 జులై)  నుంచీ  పేజీల సంఖ్యను అడుగు భాగంలోనే వేస్తూ వచ్చింది. దీన్ని ఇంతకాలమూ  గమనించకపోవటం  నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది.

 
‘కన్యాశుల్కం’ నాటకం సంగతి?  





1947, 1961 రెండు ప్రచురణల్లోనూ పేజీల సంఖ్యను పేజీల పై భాగంలోనే ముద్రించారు.



1948లో ప్రచురించిన ‘శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి  చిన్న కథలు’ పుస్తకంలో పేజీల అడుగున  తెలుగు అంకెలను ఇచ్చారు.


మరి  శ్రీశ్రీ  మహాప్రస్థానం  సంగతి?



 1956 వచ్చిన  ప్రచురణలో  ఇలా... పేజీ అడుగు భాగంలో పేజీ నంబర్లను ఇచ్చారు.


కానీ  2000లో శ్రీశ్రీ చేతిరాతతో ముద్రించిన పుస్తకంలో మాత్రం పేజీ పై భాగంలోనే పేజీల సంఖ్యను  ఇచ్చారు..  




పుస్తకాల్లో   పేజీల సంఖ్యను పేజీ అడుగు భాగంలో ఇవ్వటం కొత్త పద్ధతేమీ కాదని  అర్థమైంది.

...  కానీ  ఆ  సంఖ్యను పేజీల  పై భాగంలో ఇవ్వటం పాఠకులకు అలవాటైన పద్థతి. నా ఉద్దేశంలో ఇది  అనుకూలమైన, సౌకర్యమైన  పద్ధతి కూడా!