సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

28, నవంబర్ 2016, సోమవారం

ఆ పాట వింటోంటే కన్నీళ్ళు వచ్చేశాయి: రంగనాయకమ్మ

రంగనాయకమ్మ
కరు సహజ సుందరంగా, తీయగా  పాడే  గాయని.
మరొకరు  మౌలిక భావాలతో  పదునుగా  రాసే రచయిత్రి.

వాళ్ళు... 
బాల సరస్వతీ,  రంగనాయకమ్మా!

ఆపాత మధురమూ, ఆలోచనామృతమూ  అయిన  ఆ ఇద్దరికీ  పరస్పరం...  స్నేహం, గౌరవం, ఇష్టం.

వారిద్దరూ ఈ మధ్య  కలుసుకున్నారు.
 
ఆ గాయని తమ ఇంటికి వచ్చినప్పటి ఘట్టాన్నీ , తన జ్ఞాపకాలూ,  అనుభూతులను  రంగనాయకమ్మ  ఓ వ్యాసంగా రాశారు.  అది ఏ పత్రికలోనూ  రాలేదు.

కొత్తగా  విడుదలైన ఆమె వ్యాసాల పుస్తకం ... ‘మార్క్సే నా టీచరు!’ లో  ఉందీ వ్యాసం.

 ఈ పుస్తకంలో సామాజిక, రాజకీయ అంశాల పై, భాషా సాహిత్య  అంశాలపై వ్యాసాలు ఉన్నాయి. 

బాల సరస్వతి గురించి రాసిన వ్యాసం విభిన్నంగా... ఆత్మీయ స్పర్శతో  ఉండటం వల్ల... నాకు ప్రత్యేకంగా  నచ్చింది.  

దీనిలో  ప్రస్తావనకు వచ్చిన  బాల సరస్వతి పాటలు నాకింతవరకూ తెలియనివే. ( నేనంతగా ఇప్పటివరకూ  పట్టించుకోనివి అన్నమాట...)

ఆమె సినిమా పాటలు -  అవి కూడా కొన్ని  మాత్రమే వినివున్నాను.

అందుకే ఆ లలిత గీతాలను  వినాలనే ఉద్దేశం కలిగింది. 

కొన్నేళ్ళ క్రితం నుంచీ హార్డ్ డిస్కులో భద్రంగా ఉన్న బాల సరస్వతి  పాటల్లో  కొన్నిటిని  ఇప్పుడు  విన్నాను.


రంగనాయకమ్మ వ్యాసాన్ని ఇక్కడ...ఈ  బ్లాగులో  ఇస్తున్నాను. 

బ్లాగులో  ఏ పోస్టు అయినా  నిడివి ఎక్కువ ఉంటే పాఠకులకు ఆసక్తిగా ఉండదు. అందుకే  దాన్ని మొత్తంగా కాకుండా... కొన్ని భాగాలను మాత్రమే  ఇక్కడ ఇస్తున్నాను.  

బ్లాగులో  పాటలు కూడా వినిపించే సౌలభ్యం ఉంది కదా?  అందుకని వ్యాసంలో ప్రస్తావించిన  బాల సరస్వతి పాటలు మూడిటినీ, ఒక  లతా మంగేష్కర్ పాటనూ  ఇస్తున్నాను.

సంగీతాభిమానులు వాటిని ఆస్వాదించవచ్చు.  

               * * *

రంగనాయకమ్మ గారి వ్యాసం ఇదిగో...

-----------------------------------------------------                 -----------------------------------------------------

నా చిన్నప్పుడు మా ఇంట్లో గ్రామ ఫోను వుండేది. మా నాన్నకి పాటలు ఇష్టం. ఎప్పుడూ రికార్డులు కొనేవాడు. ఆ రోజుల్లో, ఒక గ్రామఫోను రికార్డు, 3 రూపాయల పావలా అని గుర్తు.

 ఒకసారి ఏదో వూళ్ళో ఒక జమీందారు ఇంటికి వెళ్ళాననీ, అక్కడ ఎవరో తనకి ఒక గ్రామ ఫోన్ రికార్డు ఇచ్చారనీ, తీసుకొచ్చాడు. అది, కొన్నది కాదు, ఆ రికార్డుని గ్రామ్ ఫోన్ లో వేస్తే, ‘‘ఆ తోటలో నొకటీ’’ పాట వచ్చింది. అది బాల సరస్వతి  పాట అని రికార్డు మీద వుంది. రెండో పక్క కూడా ఆవిడిదో, రాజేశ్వర్రావుదో వుంది. గుర్తులేదు.

అప్పటి నించీ  ‘‘ఆ  తోటలో నొకటీ’ పాటా,  ఆ కంఠమూ, అలవాటయ్యాయి ఇష్టంగా. తర్వాత కాలంలో బాల సరస్వతీ, రాజేశ్వర్రావూ కలిసి పాడిన ‘‘రావే రావే కోకిలా! రాగము పాడవే కోకిలా !’’ పాటా; ‘‘తుమ్మెదా ఒక సారీ, మోమెత్తి చూడమనీ’’ పాటా-  అలాంటివి రేడియోలో వినడం వుండేది.




వినేసి వదిలెయ్యడం కాదు; మరుపు వుండేది కాదు. ఇప్పుడైతే, ఆ పాటలన్నీ టేపుల్లో నా దగ్గిర పెట్టుకున్నాను. ఆ పాటలు, ఆ కాలపు రికార్డుల నించి టేపుల్లోకి ఎక్కించి అమ్మినవి. ఆ టేపులు కొని, ఆ పాటల్ని ఒక వరసలో నేను మళ్ళీ కొత్త టేపుల్లోకి ఎక్కించుకుంటే, సౌండ్ ఎంతో తగ్గిపోయాయి. 



బాల సరస్వతి  మైసూర్ లో వున్న రోజుల్లో ఆవిడితో ఉత్తరాల పరిచయం వుండేది. ఆవిడ ఒకసారి హైదరాబాదు వచ్చి ఏదో హోటల్లో దిగి వున్నారు. ఆ సంగతి తెలిసి, వెంటనే వెళ్ళి, ‘‘మా ఇల్లు వుండగా, మీరు హోటల్లో వుండడం ఏమిటి? ఎన్నాళ్ళయినా మా ఇంట్లో వుండండి!’’ అని పిలిచి తీసుకొచ్చాం.

అప్పుడు ఒక వారం రోజులు వున్నట్టున్నారు, మా దగ్గిర. ఆ రోజుల్లో మాకు వాషింగ్ మిషన్ లేదు. బట్టల పనిని ఇంటి కార్మికురాలి మీద ఎప్పుడూ పెట్టలేదు. మేమే ఉతుక్కునేవాళ్లం. బాలమ్మ గారి బట్టలు నేనే ఉతికేదాన్ని. ఆవిడ ‘‘అయ్యో, అయ్యో’’ అనేవారు.

‘‘అయ్యో, అయ్యోలు కావు. మీరు కోకిలలాగా పాడుతూ వుండండి, నేను పనులు చేస్తూ వుంటాను’’ అని నేను అనేదాన్ని.

‘‘నాది, ‘కోకిల కంఠం’ కాదు; నేను బేస్ లోనే పాడతాను’’ అన్నారు ఆవిడ ఒకసారి.

నాకు కోపం వచ్చింది. ‘‘మీరు, మీ పెళ్లి మీద చెప్పుకోండి, ‘మీ కంఠం’ మీద చెప్పకండి! మీ కంఠం అందం మీకు తెలిస్తే, మీ జీవితం ఇంకో రకంగా వుండేది’’ అన్నాను.
ఆవిడ నవ్వి వూరుకున్నారు.

‘‘ఉందువో మధురానగరిలో; కృష్ణా! బృందావనిలో ఎందును లేవే’ పాట బాలమ్మ కంఠంతో ఎంత మధురం!



ఆ మధురానగరీ, ఆ బృందావనం, ఆ కృష్ణుడూ, అవేవీ నాకు పట్టవు. ఆ రాగం, ఆ కంఠం, ఆ సంగీతం, కావాలి నాకు! బాలమ్మకి అది ‘‘భక్తే’’! నాకు అది సంగీతం! ఆ పాటని తయారు చేయించిన సినిమా వాళ్లకి అది, డబ్బు మార్గం బహుశా! ఎవళ్ళకి ఏది కావాలో అదీ!
                


‘‘రావే రావే కోకిలా!’’ పాడిన ఆ బాల గాయని, తన కంఠ మాధుర్యం ఏ మాత్రమూ తెలియని, పెద్ద వయసు మూర్ఖుణ్ణి, అప్పటికే ఇద్దరు భార్యలు బ్రతికి వున్నవాణ్ణి, ఆ భార్యలకు సంతానం లేదని మూడో భార్య కావాలనుకున్నవాణ్ణి,  మన చిట్టి గాయని తన 17 ఏళ్ళ బాల్యంలో, అతి సంతోషంగా పెళ్ళి చేసుకుంది! అతను ఒక  చిన్న జమీందారు. అంటే, భూమి కౌళ్ళు తింటూ, గుర్రాల మీద పోలో ఆటలు ఆడుతూ, వేశ్యల అందాలు భార్యలకు వినిపిస్తూ తిరిగే జులాయి ధనికుడు!  ఆ ధనికుడి దగ్గిరికి కూడా మా నాన్న, పత్రిక చందా కోసం వెళ్ళినప్పుడే, ‘‘ఆ తోటలో నొకటి’’ పాట రికార్డు మాకు దొరికింది!

17 ఏళ్ళప్పుడు పెళ్ళంటే, అది అతి చిన్న వయసు! సంగీతం తప్ప కొత్త భావాలు లేవు, ఆ బాల గాయనికి. సినిమా పాటల మనిషి. పాటలే కాదు; చిన్నప్పుడు సినిమాల్లో వేసింది కూడా. తల్లిదండ్రులు కూడా, జమీందారీ సంబంధానికి ముగ్ధులైపోయారు. ఈ పిల్ల, గుర్రప్పందాలకు పోయినప్పుడు, ఆ ధనికుడు ఈ పిల్లను చూసి, వీళ్ళ కుటుంబం వెంటపడ్డాడు. గుర్రప్పందాలకు తిరిగే సినిమాల పిల్లకి, ఎలాంటి భావాలు వుంటాయి? మూడో భార్యగా మారడానికే ముచ్చట పడిపోయింది!

బాలమ్మతో యుగళ గీతాలు పాడే రాజేశ్వర్రావు గారు అడిగాడట, బాలమ్మ తండ్రిని. ‘‘అమ్మాయిగార్ని నేను పెళ్ళి చేసుకుంటాను’’ అని! కానీ, అడిగిన వాడికి అప్పటికే భార్య వుంది! అయినా, రెండో పెళ్ళి చేసుకుంటానన్నాడు! బాలమ్మ తండ్రి ఒప్పుకోలేదు, ‘‘రెండో పెళ్ళి ఏమిట’’ని! కానీ, కూతుర్ని మూడో పెళ్ళికి నిర్ణయించాడు.

బాలమ్మకి, రాజేశ్వర్రావు మీద ఆసక్తి లేదు. నేను అడిగితే, ఆవిడ ఆ మాట గట్టిగా చెప్పింది. అతనితో, కలిసి పాడడం వరకే గానీ, అది ‘‘ప్రేమ’’వేపు పోలేదు. రాజేశ్వర్రావు మీద తనకి అలాంటి ఆసక్తి లేదని చాలా గట్టిగా చెప్పారు ఆవిడ. జమీందారు గారికి మూడో భార్య అవడానికే ఇష్టపడింది!

ఆ 45 ఏళ్ళ జమీందారు సరసన, ఈ 17 ఏళ్ళ బాల వధువు, నిలబడి వున్న ఫొటో వుంటుంది! ఈ వధువు, ఎంతో అణకువతో, ఎంతో వినయ విధేయతలతో, నిలబడి వున్న బొమ్మలాగ కనపడుతుంది ఆ ఫొటోలో!

ఆ పెళ్ళి తర్వాత ఆ భర్త, ఆమె కంఠాన్ని ఆపేశాడు! ఆమె పాడాలంటే, అతని పర్మిషన్ కావాలి! సినిమాల వాళ్ళు అలాగే చేసేవారు. అతన్ని బ్రతిమాలుకుని, ‘‘మా సినిమాలో అమ్మగారి పాట తప్పకండా వుండాలండీ’’ అని అతనికి చెప్పుకుని, అతని అనుమతి కోసం అడిగేవారు. ‘‘సరే, వెళ్ళి పాడి వచ్చెయ్యి!’’ అనేవాడు. అలాంటి మాటలన్నీ చెప్పేవారు ఆవిడ నాతో. ఇంకా చాలా చెప్పారు.

నేను బాధపడి పోయేదాన్ని. ‘‘మీరు చాలా తప్పు చేశారు!! చాలా తప్పు చేశారు! మూడో భార్యగా పెళ్ళేమిటి? అయ్యో! ఎంత తప్పు చేశారు!’’ అనేదాన్ని.

‘‘అవును, చిన్నదాన్ని. తెలీదు అప్పుడు నాకు’’ అంటారు ఆవిడ.

బాల సరస్వతి
    
బాలమ్మగారి కుటుంబం, మైసూర్ నించి హైదరాబాదు వచ్చేశారు. వచ్చి, వాళ్ళు దిగిన ఇల్లు, సెంట్రల్ ఎక్సయిజ్ కాలనీలో మేము (నేను) కన్నీళ్ళతో వదిలి వచ్చిన అద్దె ఇల్లు! ఆ ఇంటి ప్లాను, మా జీవితాల్లో ఒక భాగం అనుకుంటూ, అదే ప్లానుని  ఇంకా మెరుగు చేసుకుని, ఆ ప్లానుని వదలకుండా వుంచుకున్నాము.

కానీ, ఆ ప్లాను ఇల్లు, బాలమ్మ గారికి నచ్చలేదు. నేలకి సాదా సిమ్మెంటు వుండడం, ఆమెకి నచ్చలేదు. ఆమెని కలవడానికి వెళ్ళి, ఆ ఇంట్లో మళ్ళీ కాలుపెట్టి, ‘‘ఇదేం ఇల్లు? మార్చెయ్యాలి’’ అని ఆవిడ అనడం విన్నాను. షోకైన ఇళ్ళల్లో బతికిన మనిషి ఆవిడ.

ఆవిడ ఈ వూరు వచ్చేశాక, అప్పుడప్పుడూ మేము వెళ్ళడం, ఆవిడ రావడం, జరుగుతూనే వుంది.

మొన్న ఒకసారి ఆవిడ, ‘‘మీ దగ్గిరికి ఒకసారి రావాలనిపిస్తోంది’’ అన్నారు.

అప్పుడు నేను ‘‘వేదాల’’ పుస్తకం పనిలో బిజీగా వున్నాను. అయినా, ఆవిడికి 87 ఏళ్ళు. నాకు 77. ఇద్దరికీ పెద్ద వయసులే. అప్పుడప్పుడూ కలవడం మంచిదే కదా? రేపేం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? ఆ మర్నాడే ఆవిడ వచ్చేలాగ, టాక్సీ రెడీ చేశాం.

ఆవిణ్ణి చూడాలని ఒక స్నేహితురాలు ఉష కూడా వొచ్చి వుంది. టాక్సీ దిగిన బాలమ్మగార్ని తీసుకురమ్మని ఉషని పంపించాను గానీ, కాళ్ళ నొప్పుల వల్ల నేను వెళ్ళలేదు. టాక్సీ రాగానే ఉషే వెళ్ళి ఆవిణ్ణి పట్టి తీసుకురాబోయింది.

‘‘అక్కరలేదు’’ అంటూ ఆవిడ చిన్న పిల్ల లాగ చక చకా వరండా మెట్లెక్కి గబగబా నడుచుకుంటూ వచ్చేశారు! ఆవిడ నడక మీద, అందరికన్నా నేనే ఎక్కువ ఆశ్చర్యపోయాను, నెప్పుల కాళ్ళదాన్ని!

బాలమ్మగారికి స్వీట్లు అంటే పిచ్చి ఇష్టం! షుగర్ జబ్బు లేదు.

టేప్ రికార్డర్ లో, ఆమె పాడిన ‘‘తన పంతమె’ పాట వినపడుతూ వుండగా ఆవిడ గది లోపలికి వచ్చారు.

ఆవిడ రాక ముందే, ‘‘రావే రావే కోకిలా’’ పాట వింటోంటే కన్నీళ్ళు వచ్చేశాయి నాకు. ఎప్పుడూ అలా జరగలేదు. ఆమె ఎంతో చిన్నప్పుడు పాడిన పాట అది.



పెద్ద వారై పోతున్నారు. మళ్ళీ ఎప్పుడు చూస్తామో అని నాకూ అనిపించింది. పాటలు వినపడుతూనే వున్నాయి. ఆవిణ్ణి కావిలించుకోవాలనిపించింది.

వచ్చి కుర్చీలో కూర్చున్నారు. కుర్చీలో కూర్చున్న మనిషిని ఎలా కావిలించుకుంటాను? ఆవిడ దగ్గిరికి పోయి, పక్కనే కూర్చోవాలని నేల మీద కూర్చోబోతోంటే, ఆవిడ నా చేతులు గట్టిగా పట్టుకుని ‘‘వొద్దు, వొద్దు’’ అని చాలా వారించారు.

‘‘కాదు, కొంచెం సేపు కూర్చుంటాను. నా కలా అనిపిస్తోంది’’ అంటూ, ఆవిడికి దగ్గిరిగా నేల మీద కూర్చుని ఆవిడి ఒడిలో మొహం పెట్టి, ఆవిడి పాటలు వస్తోంటే వింటూ కూర్చున్నాను. కొంతసేపు కూర్చుని లేచాను.

ఆవిడి పెళ్ళి గురించి ఆవిడికి బాధ వుండదు గానీ, నాకు చాలా బాధగా వుంటుంది. ఆ పెళ్లి జరగకపోతే, అసలు లతకి లాగ ఏ పెళ్ళీ జరగకపోతే, ఆవిడి పాటలు ఇంకా చాలా వినగలిగే వాళ్ళం.

అప్పటికి సినిమాలు ఇంకా భ్రష్టు పట్టలేదు. సంగీతాలు చచ్చిపోలేదు. తప్పకుండా కొన్ని మంచి పాటలే వచ్చేవి బాలమ్మ కంఠంతో.

చందమామకి భర్త వుంటే, ఆ భర్త, చందమామతో, ‘‘నువ్వు వెన్నెల కాయొద్దు! అందరూ చూస్తున్నారు. అంతా దాచు!’’ అంటాడు.

అప్పుడు, చందమామ ఏం చేస్తుంది? భర్త ఆగ్న్య కదా? భూమికి వెన్నెల రాదు!


బాల సరస్వతికి, భర్త వుండడం వల్ల, ఆమె కంఠానికి సంకెళ్ళుపడ్డాయి! అతని  దయతోనే అవి తెరుచుకునేవి. బాలమ్మ కంఠస్వరం ఇచ్చే వెన్నెల, మసక బారిపోయింది. భర్తలూ భార్యలూ కూడా సంగీతకారులైనప్పుడు, వాళ్ళ వివాహాల తర్వాత, ఆ భర్తలు, భార్యల సంగీతాల్ని ఆపి వేస్తారని, పేరున్న సంగీతకారులైన భర్తల గురించే విన్నాం. ఇటువంటి వార్త, రవి శంకర్ గురించి ఒకప్పుడు ఏదో పత్రికలో చదివాను.

కళానిధులైన భార్యలకు భర్తలు, అడ్డుకట్టలు! ప్రమాదకారులు!

గాయనీమణుల గానాలలో, అతి మాధుర్యాలు- బాలమ్మా, లతమ్మా! ఈ ఇద్దరూ  ఇతరుల కన్నా వేరు అనిపిస్తారు నాకు. ఎందరో  పాడతారు. అందరూ సంగీతాల నిధులే. అందరూ రమ్యంగానే పాడతారు. అందర్నీ వింటాం. ఎవరికి వారు, వేరు వేరు! కానీ, బాలమ్మా, లతా, మరీ వేరు!

లతని కూడా కావిలించుకోవాలనే వుంటుంది నాకు. కానీ, ఆమె కంఠానికే దాసోహం అవుతాను గానీ, ఆమె భావాలూ, ఆమె ప్రకటనలూ, చాలా అధమ స్థాయిలో వుంటాయి.

‘‘ఏమిటి లతా? అప్పుడప్పుడూ మతి లేకుండా మాట్లాడతావు? ఎవరికో ‘భారత రత్న’  రావడానికి ఉపవాసం చేస్తానంటావు! ఎవరో ‘ప్రధాన మంత్రి’ అవడానికి ఏదో చేస్తానంటావు! మతి పోతుందా? అంత ఆలోచించవేం?’’ అని అడిగేసి, తర్వాత ఆమె చేతులు పట్టుకుని ముద్దు పెట్టుకోవాలనుకుంటాను. కానీ, బాలమ్మ లాగ లత, మా ఇంటికి రాదు కదా? ‘‘నిన్ను చూడాలని వుంది’’ అనదు కదా? ఒక సారి మా ఇంటికి వచ్చి, బాలమ్మ లాగ నాకు కబుర్లు చెప్పదు కదా?

లత చాలా తెలివైనది! ‘‘లతా! నువ్వు పెళ్ళి చేసుకోలేదు. నీకు భర్త వుంటే, మాకు నీ కంఠంతో దొరకకుండా ఎన్ని పాటలు పోయేవో! నీకు చిన్నప్పుడే భర్త వుంటే, ‘‘ఆయెగా, ఆనే వాలా’’ దొరికేది కాదు కదా? ఇక, ఏ పాటలు దొరికేవి?



 ఎంత తెలివైన దానివి! నువ్వు తెలివితో చేశావో, ఎలా చేశావో గానీ, నీ గానానికి ‘‘భర్త’’ అనే అసూయాపరుడు లేకుండా, నిన్ను అడ్డుకునే పెత్తందారుడు లేకుండా, చేసుకున్నావు.

నువ్వు మా కోసం పాడావు! ఎంత మంచిదానివి లతా! బాలమ్మ అమాయకురాలు గానీ, మధుర గాయని, నీ లాగే! మీ ఇద్దరి గానాలకీ, నా ముద్దులు!

-----------------------------------------------------                 -----------------------------------------------------