సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, జులై 2017, సోమవారం

మీకు నచ్చిందని... నాకూ నచ్చాలా?


  సినిమా
ఓ రచన...

ప్రేక్షకుల, పాఠకుల  విశేష ఆదరణ పొందినంతమాత్రాన

వాటిని మెచ్చని వాళ్ళు  ఉండరని చెప్పలేం.

అసంఖ్యాకుల అభిప్రాయానికి  అది తేడాగా ఉంది కాబట్టి...

‘ఊరంతా ఒకదారి ఉలిపికట్టెదొక  దారి’ అంటూ వారి అభిప్రాయాలనూ  ఈసడిస్తే...

ఆస్వాదన తెలియదని  వారిని  తీసిపడేస్తే..

అది న్యాయంగా ఉంటుందా?

 ‘పదుగురాడు మాట పాడియై ధర జెల్లు’
నిజమే.

‘ఒక్కడాడు మాట ఎక్కదెందు.’

అయినా...
ఒక  భిన్నాభిప్రాయం మిగతా మూస  అభిప్రాయాల మధ్య  తళుక్కున  మెరుస్తుంది.

దానికి  విలువ కూడా  ఎప్పుడొస్తుందంటే...

అది కేవలం  భిన్నంగా ఉండటం వల్ల  కాదు;
దానిలో  తర్కమూ, వాస్తవమూ ఉంటే,  వాటి వల్లనే!


1975 లో  వచ్చిన  ‘ముత్యాల ముగ్గు’  ఎంతో ప్రజాదరణ  పొందిన సినిమా.
దీనిపై   మహా కవి  శ్రీశ్రీ  వ్యాఖ్య-

‘ముత్యాల ముగ్గు
రత్నాల రగ్గు
దయ్యాల దగ్గు’


మేమంత కష్టపడి  అంత  బాగా  తీస్తే ,  ఆంధ్రదేశమంతా  బ్రహ్మరథం పడుతోంది.  ఈయన  అలా  అంటారా? అనో, ఆయన అలా అంటే మాత్రం మాకేంటి  నష్టం ’ అనో  కోపాలు తెచ్చుకోలేదు  ఆ సినిమా రచయిత  ముళ్ళపూడి వెంకట రమణ,  ‘మహాకవి ఏమన్నారన్నది కాదు,  మన సినిమా గురించి  ఏదో ఒకటి అన్నారు కదా?, అది చాలు’ అంటూ స్పందించారు.

ఒకవేళ  ఆ  సినిమాపై   శ్రీశ్రీ  అభిప్రాయం  అర్థరహితంగా ఉందని ఎవరైనా   ఎదురుదాడికి దిగివుంటే ఏమయ్యేది? 

శ్రీశ్రీ  తన అభిప్రాయం  మరింత  గట్టిగా  చెప్పివుండేవారు. అంతేగానీ,  తన అభిప్రాయమైతే మార్చుకునేవారు  కాదు కదా?



‘క్లాసిక్’ గా  పేరుపొందిన  ‘యోగి వేమన ’ (1947)  కూడా శ్రీశ్రీ కి నచ్చలేదు మరి.  ఎందుకు నచ్చలేదో వివరంగానే  అప్పట్లో ఓ రివ్యూలో రాశారు.

మరి  శ్రీశ్రీకి నచ్చేవి  ఏమిటి ?

చాలా ఉన్నాయి.  చాప్లిన్ సినిమాలూ,  ఇంకా మరెన్నో.

రా.వి. శాఃస్త్రి  ‘ఆరు సారా కథల’ను  ఆరు కళా ఖండాలుగా  అభివర్ణించాడు శ్రీశ్రీ.

1962లో  ఆ కథల సంపుటికి  రాసిన ముందు మాటలో ఇలా అంటాడు -

‘‘ఏక కాలంలో అనేక రసాలను ఉప్పొంగింపజేసే కళాఖండాలను మాత్రమే  నేను ఉత్కృష్ట రచనలుగా అంగీకరిస్తాను. కథలలో, కవిత్వంలో, శిల్పంలో, చిత్రాలలో, నవలల్లో, నాటకాల్లో నేను ఇటువంటి రసానుభూతినే అన్వేషిస్తాను. చార్లీ చాప్లిన్ తన చలనచిత్రాలతో ఈ రసానుభవం నాకు కలిగించాడు. పికాసో రచించిన ‘గుయెర్నికా’ నాలో ఒక్కసారిగా నవ్వూ, ఏడుపూ, ఆశ్చర్య మూ, భయమూ కలిగించాయి. డిక్కెన్స్ నవలల్లోనూ, గురజాడ రచనలలోనూ  ఇటువంటి రస స్పందనలే  నాకు ఈనాటికీ ఉత్తేజం కలిగిస్తాయి ’ ’

గీతాంజలి  X  వాడే వీడు


‘‘మృత్యు దేవత నీ తలుపు తట్టినపుడు నువ్వేం అర్పిస్తావు అతనికి?
ఏమీ?  నా జీవిత పూర్ణపాత్రని  అతని ముందుంచుతాను. రిక్తహస్తాలతో అతన్ని ఎన్నడూ పంపను’’

‘‘ఓ నాడు ఈ భూమి నా కనుమరుగవుతుందనీ చివరి తెరని నా కళ్ళపైకి లాగి జీవితం మౌనంగా శలవ తీసుకుంటుందనీ నాకు తెలుసు’’

‘ ‘ అరణ్యంలో  అర్థరాత్రి  పుష్పించే కుసుమం వలె ఈ అనంత
నిగూఢ అద్భుత ప్రపంచంలోకి ఏ శక్తి నన్ను వికసింప చేసిందో!’’

‘‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో,
ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో,
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో....
....................


ఆ స్వేచ్ఛా స్వర్గానికి , తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు’’


రవీంద్రనాథ్ రాగూర్ గీతాంజలికి  తెలుగు అనువాదాలు ఎన్నో  వచ్చాయి.   ఎక్కువ  ప్రసిద్ధమైనవాటిలో  చలం  అనువాదం (1958)  ఒకటి.

‘గీతాంజలి సంపూర్ణంగా అర్థం కావాలన్నా, అనుభవంలోకి రావాలన్నా, ఈశ్వరుడిలో విశ్వాసం ఉండాలి’ అంటాడు చలం  ముందుమాటలో.

ఆ విశ్వాసం లేని  శ్రీశ్రీ కి గీతాంజలి  నచ్చకపోవటంలో  ఆశ్చర్యం లేదు.

గీతాంజలిపై   శ్రీశ్రీ  విమర్శల  గురించి సాహితీ మిత్రుల్లో చాలామందికి తెలిసేవుంటుంది .

కానీ  ఆ వివాదం ఎలా సాగిందో .. ముగిసిందో  వివరంగా  చదివినవాళ్ళు తక్కువ మందే ఉంటారని  అనుకుంటున్నాను. 

ఎందుకంటే... అది  దాదాపు 70 ఏళ్ళ క్రితం నాటి ముచ్చట.

‘ తెలుగు స్వతంత్ర’  వారపత్రికలో  జరిగిన  ఈ వివాదం  దూషణలకు దూరంగా,  చక్కగా  సాగటం విశేషం.
(అప్పుడు  మరి  ఫేస్ బుక్ లూ, బ్లాగులూ, వాట్సాప్ లూ  లేవు కదా అంటారా?  :))

శ్రీశ్రీ, చలంలతో పాటు ‘చతుర్వేది’ అనే మరో వ్యక్తి దీనిలో  పాల్గొన్నారు.

·   1948 నంబరు 5 సంచికలో ‘వాడే వీడు ’ అనే వ్యాసంతో  శ్రీశ్రీ దీనికి తెర తీశాడు.
·    1948 నవంబరు 19 సంచికలో  ‘చతుర్వేది ’ అభిప్రాయం వచ్చింది.
·    1948  డిసెంబరు 24 సంచికలో  తన ‘మ్యూజింగ్స్ ’ కాలమ్ లో  చలం  శ్రీశ్రీ  అభిప్రాయం గురించి  ప్రస్తావించారు.
·    1948 డిసెంబరు 31 సంచికలో ‘టాగూరు నా  ఎల్లెర్జీ’  అంటూ శ్రీశ్రీ  ఘాటుగా స్పందించారు.
·    ఆ తర్వాత  వెలువడిన తన మ్యూజింగ్స్ లో  చలం  ‘ శ్రీశ్రీ  అనుభవాన్ని కాదనలేను’  అంటూ  ఇంకా  కొంత  రాశారు.

ఎవరెవరు  ఏమని అన్నారు? 



శ్రీశ్రీ :  నిస్సందేహంగా  ‘గీతాంజలి’ కంటే ‘వాడే వీడు’ గొప్ప గ్రంథం

చతుర్వేది:  నిస్సందేహంగా గీతాంజలి గొప్ప గ్రంథమే.  

 
చలం: గీతాంజలిలో  ప్రతి మాటలో స్ఫురించే కవిత్వం, అందం, ఆ కలల విశాలత్వం, మూలిగే నలిగే ఆత్మలకి శాంతీ, ఆశ, జీవితానికి ఓ అర్థమివ్వాలనే ప్రయత్నం, ఈ చిరాకుల్లోంచి, అల్పత్వాల్లోంచి గొప్పతనం చూడగల దృష్టి, ఇవన్నీ ఎట్లా మిస్ కాగలిగారు శ్రీశ్రీ!

శ్రీశ్రీ :  ప్రపంచమంతా హారతి పట్టినా నేను టాగూరును కవిగా అంగీకరించలేను.  


చలం: శ్రీశ్రీ తనకి గీతాంజలిలో ఏమీ కనపళ్ళేదంటే , ఆ అనుభవాన్ని కాదనలేను, ఏదో అవునని రాయడం తప్ప.


 ఆ  వాదనల క్రమాన్ని  ‘తెలుగు స్వతంత్ర’  సంచికల నుంచి  తీసి, వాటిని  ఒక ఫైలుగా కూర్చి  ఇక్కడ   ఇస్తున్నాను.
   Srisri Tagore Chalam by Reader on Scribd


దాదాపు 11 పేజీల్లో ఉండే  ఈ సమాచారంలో  మొత్తం  ‘గీతాంజలి- వాడేవీడు ’  గురించి మాత్రమే ఉండదు.  ముఖ్యంగా  చలం    ‘మ్యూజింగ్స్’ లో  ఈ విషయాన్ని  దాదాపు  ఒక  న్యూట్రల్ టోన్  ప్రస్తావించినా  శ్రీశ్రీ మాత్రం  ఎగ్రెసివ్ గానే స్పందించటం చూడవచ్చు.  

*** 

శ్రీశ్రీ  అభిప్రాయం చదివితే నాకేమనిపిస్తుందంటే...

అందరూ మెచ్చుకునే  గీతాంజలి తనకు  నచ్చలేదనే విషయం బలంగా  చెప్పడానికే ,  డిటెక్టివ్ నవలతో పోల్చటం ద్వారా  షాక్ చేసి,  అందరినీ ఆలోచింపజేయడానికే  ఆయన  ఇలా రాశాడని!

ఈ సందర్భంగా  నసీరుద్దీన్ కథ ఒకటి గుర్తొస్తోంది.

మహీధర నళినీ మోహన్   ‘ మౌల్వీ నసీరుద్దీన్ కథలు’ రెండు భాగాలుగా   తేట తెలుగు నుడికారంతో అందించారు. వాటిలో చాలా కథలు నాకు బాగా ఇష్టం.

అందులో ఓ కథంటే  మాత్రం మరీ మరీ!

నాకు గుర్తున్నంతవరకూ  నా మాటల్లో..  చెప్తానీ కథని.

రాజు   తైమూర్ కి  ఓసారి  కవిత్వం రాయాలనే కోరిక కలిగింది.  ఏదో తోచినట్టు రాసేశాడు.

అది బాగుందో లేదో  తెలియాలి కదా?

పండితుడుగా పేరుమోసిన నసీరుద్దీన్ ని పిలిపిస్తాడు.

అతడా  కవిత్వం చదివి, ‘అబ్బే ఏమీ బాగా లేదు’ అని పెదవి విరుస్తాడు, రాసింది రాజు అనే మొహమాటం కూడా లేకుండా.

‘అంత కష్టపడి రాస్తే  ఇలా చెప్తాడా ’ అని  తైమూర్ కి  చిర్రెత్తుకొస్తుంది.   ‘ఇతగాణ్ణి గాడిదల కొట్టంలో  పడెయ్యండి’ అని ఆజ్ఞాపిస్తాడు.

కానేపటికి  కోసం తగ్గుతుంది తైమూర్  కి.  ‘ అంతటి  పండితుడు అలా అన్నాడంటే, నిజంగానే  నా కవిత్వం బాగా లేదేమో’ అనే ఆలోచనతో తన తొందరపాటుకు  పశ్చాత్తాపపడి,  కొట్టంలోంచి  నసీరుద్దీన్ ని  విడుదల చేయిస్తాడు.

కొన్నాళ్ళకు బాగా కృషి చేసి కవిత్వం రాస్తాడు తైమూర్.

నసీరుద్దీన్ అభిప్రాయం  తెలుసుకోవటానికి  మళ్ళీ అతణ్ణి పిలిపిస్తాడు.

తన  కొత్త కవిత్వం గురించి  ఏం చెపుతాడా అని  తైమూర్ ఉత్కంఠగా ఎదురుచూస్తుంటాడు.

మొత్తం చదివేసి,  ఆ కాయితాలు  పక్కన పెట్టేసి  మౌనంగా అక్కణ్ణుంచి బయటకి  అడుగులు వేస్తుంటాడు నసీరుద్దీన్.

‘ఏమీ చెప్పకుండా  బయల్దేరుతున్నావేంటీ? ఎక్కడికీ?  ఆశ్చర్యంతో అడుగుతాడు తైమూర్.

నిర్వికారంగా... స్థిరంగా  జవాబిస్తాడు నసీరుద్దీన్-

 ‘గాడిదల కొట్టంలోకి!’